calender_icon.png 26 October, 2024 | 8:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం గాయబ్!

28-08-2024 12:54:55 AM

  1. మంచిర్యాల జిల్లాలోని పలు గోదాముల్లో వడ్లు మాయం
  2. మిల్లర్ల రిసీవ్డ్ కాపీతో బయటపడిన స్కాం

 కొన్ని ఏజెన్సీల పరిధిలో భారీ వ్యత్యాసం 

ఎవరిది బాధ్యత? ఎవరి నుంచి రికవరీ ?

మంచిర్యాల, ఆగస్టు 27 (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లాలో ధాన్యం గోల్‌మాల్ అయిన ఘటన వెలుగు చూసింది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యంలో కొంత పౌర సరఫరాలశాఖ అధికారులు మిల్లులకు తరలించారు. ఆపై మిగిలిన ధాన్యాన్ని ఏజెన్సీలకు అప్పగించి గోదాముల్లో నిల్వ చేయించారు. తర్వాత ఆ ధాన్యా న్ని ఏజెన్సీలు మిల్లులకు పంపించాయి. ఈ క్రమంలోనే మిల్లర్లు రిసీవ్డ్ కాపీని అధికారులకు ఇవ్వడంతో ధాన్యం గోల్‌మాల్ అయిన ఘటన వెలుగు చూసింది.

అధికారులు లెక్కల ప్రకారం.. రూ.కోట్ల విలువైన ధాన్యం తేడా వచ్చినట్లు సమాచారం. పీఏసీఎస్ ఏజెన్సీలో సుమారు 800 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత రాగా.. డీఆర్‌డీఏ తరపున సుమారు 400 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ఏజెన్సీ తరపున సుమారు 150 మెట్రిక్ టన్నుల ధాన్యం కొరత వచ్చినట్లు సమాచారం. ఇలా మూడు ఏజెన్సీల నుంచి సుమారు 1350 మెట్రిక్ టన్నులు అంటే సుమారు రెండున్నర కోట్ల విలువైన ధాన్యం తేడా రానుంది. దీంతో గోదాముల్లో ఏజెన్సీలు ఎంత నిల్వ చేశాయి.. మిల్లులకు ఎంత తరలించాయిఅనే విషయంలో అను మానాలు రేకెత్తుతున్నాయి. తక్కువ వచ్చిన ( షార్టేజీ) ధాన్యానికి ఎవరు బాధ్యత వహిస్తారో, ఎవరి నుంచి రికవరీ చేస్తారో చూడాలి. 

తరలింపులో ఆలస్యం..

2021 యాసంగిలో వరి ధాన్యాన్ని పెద్ద మొత్తంలో కొనుగోలు చేసిన పౌరసరఫరాల శాఖ అధికారులు వాటిని మిల్లులకు తరలించారు. ఇంకా మిగిలిన ధాన్యాన్ని జిల్లాలోని వ్యవసా య మార్కెట్ కమిటీ గోదాముల్లో దించడానికి ఆయా ఏజెన్సీలకు అప్పగించారు. ఆ ధాన్యాన్ని ఆరు నెలల్లోనే మిల్లులకు కేటాయించి మిల్లింగ్ చేయించాల్సి ఉంటుంది. అధికారుల అలసత్వంతో ఈ ఏడాది స్థానికంగా కొన్ని మిల్లులతో పాటు పెద్దపల్లిలోని సుల్తానాబాద్‌కు దగ్గరలో ఉన్న  సుగ్లాంపల్లిలోని లక్ష్మి ఇండస్ట్రీస్‌కు, నీరుకుళ్లలోని గోకుల్ ఇండస్ట్రీస్  మిల్లులకు ఒక్కోదానికి 8,513.70 మెట్రిక్ టన్నును సీఎంఆర్ కోసం కేటాయించారు. మిగతా ధాన్యాన్ని జిల్లాలోని మిల్లుల కు సీఎంఆర్ కోసం తరలించారు.

23,955.920 మెట్రిక్ టన్నులు..

యాసంగి సీజన్‌లో ధాన్యం పెద్ద మొత్తంలో రావడంతో సివిల్ సప్లయ్ అధికారులు ఆయా ఏజెన్సీలతో మాట్లాడి మార్కెట్ కమిటీ గోదాముల్లో ఆయా ఏజెన్సీల ఇంటర్మీడియట్ గోదాముల పేరిట ధాన్యం నిలువ చేయించారు. దీంతో డీసీఎంఎస్ ఏజెన్సీ తరపున భీమారం, కోటపల్లి, లింగాపూర్ ఇంటర్మీడియట్ గోదాముల్లో 4,404 మెట్రిక్ టన్నులు, డీఆర్‌డీఏ ఐకేపీ తరపున భీమారం, చెన్నూర్, జన్నారం, వేమనపల్లి ఇంటర్మీడియట్ గోదాముల్లో 7,859.080 మెట్రిక్ టన్నులు, పీఏసీఎస్ ఏజెన్సీ తరపున చెన్నూర్, జన్నారం, కాసిపేట, రేచిని, వేమనపల్లి ఇంటర్మీడియట్ గోదాముల్లో 11,692.840 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉంచారు. ఆ ధాన్యాన్ని మూడు నెలల్లోనే మిల్లులకు కేటాయించాల్సి ఉండగా సివిల్ సప్లయ్ అధికారుల నిర్లక్ష్యంతో గోదాముల్లోనే ఉండిపోయింది. అయితే ఇటీవలే ఆ ధాన్యాన్ని మిల్లులకు తరలించారు.

రిసీవ్డ్ కాపీలతో బయటపడిన వ్యత్యాసం..

2021-22 యాసంగి సీజన్‌కు సంబంధించి 12 గోదాముల్లోని డీఆర్‌డీఏ(ఐకేపీ), పీఏసీఎస్, డీసీఎంఎస్ ఏజెన్సీల పరిధిలోని 23,955.920 మెట్రిక్ టన్నుల ధాన్యం జిల్లాలోని కొన్ని మిల్లులకు, పెద్దపల్లి జిల్లాలోని రెండు మిల్లులకు షిఫ్ట్ అయ్యాయి. ఇందులో పీఏసీఎస్ ఏజెన్సీ తరపున ధాన్యం దిగినట్లు  మిల్లర్లు అక్నాలెడ్జ్‌మెంటు (మిల్లర్ రిసీవ్డ్) కాపీని సివిల్ సప్లయ్ అధికారులకు అందజేశారు. ఇందులో 11,692.840 మెట్రిక్ టన్నులకుగాను సుమారు 800 మెట్రిక్ టన్నులు తేడా వచ్చినట్లు తెలిసింది.

అలాగే డీసీఎంఎస్, డీఆర్‌డీఏ ఏజెన్సీలవి కూడా ఒక్కో ఏజెన్సీ నుంచి 500 మెట్రిక్ టన్నులపైగానే వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది. ఒక్కో ఏజెన్సీ పరిధిలో వారు నిలువ ఉంచి న ధాన్యం నుంచి ఐదు నుంచి ఏడు శాతం షార్టేజీ వచ్చేలా ఉందని ఏజెన్సీల బాధ్యులు చెబుతున్నారు. ధాన్యం షార్టేజీపై సివిల్ సప్ల య్ డీఎంను వివరణ కోరేందుకు ప్రయత్ని ంచగా ఆయన అందుబాటులోకి రాలేదు.