calender_icon.png 23 January, 2025 | 12:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మిల్లర్లకిచ్చిన ధాన్యం వాపస్ తీసుకోవాలి

03-07-2024 12:52:42 AM

కొందరు సీఎంఆర్ చేసినా ప్రభుత్వానికి ఇవ్వట్లేదు

నిరుడు నిజామాబాద్‌లో భారీగా సన్నధాన్యం సేకరణ

మిల్లుల్లో తనిఖీ చేయకుండా మిల్లర్ల అసోసియేషన్ పైరవీ 

విజిలెన్స్ బృందాలు రాకుండా అడ్డుకుంటున్న మిల్లర్లు

పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు యెండల వినతి 

హైదరాబాద్, జూలై 2 (విజయక్రాంతి): సీజన్ల వారీగా రైస్ మిల్లర్లకు కేటాయించిన ధాన్యాన్ని ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్ డీఎస్ చౌహాన్‌ను కోరారు. మంగళవారం ఆయన నిజామాబాద్ జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారుల వైఫల్యాల గురించి చౌహాన్‌కి వినతిపత్రం అందజేశారు. నిజామాబాద్ జిల్లాలో గత ఏడాది రబీ, ఖరీఫ్ సీజన్లలో రాష్ట్రంలో సన్నరకం వరి ఎక్కువ మొత్తంలో పండించినట్టు అధికారుల గణాంకాలు వెల్లడించాయని తెలిపారు.

ఐకేపీ కేంద్రాలు, వ్యవసాయ సొసైటీల ద్వారా ధాన్యం కొనుగోలు సేకరణ బాధ్యతలు జిల్లా అధికారులకు అప్పగించగా, మిల్లింగ్ సామర్థ్యం వారీగా ధాన్యాన్ని మిల్లర్లకు కేటాయించారని గుర్తుచేశారు. కానీ, రైస్ మిల్లర్లు తిరిగి ప్రభుత్వానికి బియ్యం ఇవ్వకుండా ప్రైవేటు మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించుకున్నారని ఆరోపించారు. రైస్ మిల్లర్లుకు ఎంత ధాన్యం కేటాయించారో అంతమేర ధాన్యాన్ని వారినుంచి స్వాధీనం చేసుకోవాలని కోరారు. జిల్లాలో పెద్ద మిల్లర్లు గరిష్ఠంగా సీఎంఆర్ చేయడానికి ధాన్యం తీసుకున్నారని, ప్రస్తుతం ఆయా మిల్లుల్లో వాస్తవ నిల్వులు లేకుండా చేశారని ఆరోపించారు.

వారికి కేటాయించిన ధాన్యం తనిఖీలు చేయడానికి విజిలెన్స్ బృందాలను అనుమతించడం లేదని, రైస్ మిల్లర్ల సంఘం నాయకులు చిన్న మిల్లర్లపై ఒత్తిడి చేస్తున్నారని పేర్కొన్నారు. ధాన్యం నిల్వలు తనిఖీలు చేస్తే వాస్తవాలు బయటపడతాయని అన్నారు. జిల్లా రైస్‌మిల్లర్ అసోసియేషన్.. బోధన్ అసోసియేషన్‌కు మద్దతు ఇస్తుందని, దీంతో వారు తమ తప్పులు బయటపడకుండా కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లావ్యాప్తంగా సోదాలు చేస్తే నిల్వలు గుర్తించడంతోపాటు మిల్లర్ల అక్రమాలకు నియంత్రివచ్చని తెలిపారు. మరికొందరు మిల్లర్లు ఎఫ్‌సీఐకి సీఎంఆర్ సరఫరా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ధాన్యాన్ని మిల్లింగ్ చేయని మిల్లర్లు.. పీడీఎస్ రైస్‌ను రీస్లుకింగ్ చేస్తున్నారని విమర్శించారు. 

మిల్లర్లతో అధికారుల మిలాఖత్

నిజామాబాద్‌లో కొంతమంది మిల్లర్లతో లావాదేవిల్లో పౌరసరఫరాలశాఖ నిమగ్నమైందని, పెద్ద మిల్లర్లు ప్రభాకర్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి వేర్వేరుపేర్లతో వ్యాపారం చేస్తున్నారని లక్ష్మీనారాయణ ఆరోపించారు. వాసీ ఇండస్ట్రీస్ పారాబాయిల్డ్, ఎంఎస్‌ఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ వర్ని, గంగా రైస్‌మిల్లు వర్ని, రాయల్ ట్రేడింగ్ కంపెనీ వర్ని, యూనస్ ట్రేడ్‌ర్స్ నవీపేట్, కారం ఇండస్ట్రీస్ కోటగిరి, అర్కం ట్రేడర్స్ జల్లాల్‌పూర్, బిస్మిల్లా ట్రేడర్స్ జాకోరా అతని బినామీలుగా ఉన్నట్టు వెల్లడించారు. సంగారెడ్డిలో వాసి నిర్వహణ సూర్య ఆగ్రో,  చంద్రా ఆగ్రో, అతని బినామీలు సుమారు 15కుపైగా పేర్కొన్న కంపెనీలు ఉన్నాయని తెలిపారు.

వీటితోపాటు నిజామాబాద్, కామారెడ్డి, నిర్మల్, సంగారెడ్డి, క్రష్నూర్ మహారాష్ట్రలో ప్రభాకర్‌రెడ్డి, అతని అనుచరులు నిర్వహిస్తున్నారని వివరించారు. గత ప్రభుత్వంలో కూడా జిల్లాలో రైస్ మిల్లర్లు ధాన్యం నిల్వల వివరాలు చెప్పకుండా అరాచకాలకు పాల్పడ్డారని, అదే తరహాలో ప్రస్తుత ప్రభుత్వంలో కూడా చేయాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా డీఎస్‌చౌహాన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత  మిల్లర్ల అగడాలకు అడ్డుకట్ట వేశారని, వారికి సహకరించే జిల్లా అధికారులపై వేటు వేసి ఇద్దరిని సస్పెండ్ చేశారని గుర్తుచేశారు.