calender_icon.png 30 September, 2024 | 3:07 AM

అక్టోబర్ నుంచి ధాన్యం సేకరణ

30-09-2024 12:45:41 AM

సన్నాలు దళారులకు చేరకుండా జాగ్రత్త

కోతలకు ముందే కొనుగోలు కేంద్రాలు

సన్న, దొడ్డు ధాన్యం వేర్వేరుగా కొనుగోళ్లు 

హైదరాబాద్, సెప్టెంబర్ 2౯ (విజయక్రాంతి): వానకాలం ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ఏర్పాట్లు వేగంగా చేస్తుంది. అక్టోబర్ మొదటి వారం నుంచి జనవరి చివరివారం వరకు కేంద్రాలు అందుబాటులో ఉంచనున్నది. ఈ సీజన్‌లో సన్న వడ్లు పెద్ద ఎత్తున సేకరించేందుకు ముందుస్తు ప్లాన్ చేసింది.

పంట కోతకు ముందే కొనుగోలు కేంద్రాలను రైతులకు అందుబాటులో ఉంచనుంది. ఈసారి ధాన్యం కొనుగోలు ప్రైవేటు వ్యాపారులకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తలు చేపట్టింది. మిల్లర్ల వద్ద ఉన్న సన్న బియ్యం నిల్వలు కూడా వెంటనే ప్రభుత్వానికి అప్పగించాలని ఉన్నతాధికారులు యాజమాన్యాలను ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం జనవరి నుంచి రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆ దిశగా అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకోసం పౌరసరఫరాల శాఖ 7,139 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సన్నాలు, దొడ్డు రకం వడ్లను వేర్వేరుగా కొనుగోలు చేయనుంది. 

వచ్చేనెల మొదటి వారం నుంచి కొనుగోళ్లు

అక్టోబరు మొదటి వారంలో ధాన్యం కొనుగోళ్లు మొదలవుతాయని అధికారులు తెలిపారు. జనవరి చివరి వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించారు. మొదటివారంలో నల్లగొండ, మెదక్, రెండో వారంలో నిజామాబాద్, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, నారాయణపేటలో కేంద్రాలను ప్రారంభిం చేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.

మూడో వారంలో కరీంనగర్, జగిత్యాల, వరంగల్, జనగామ, సూర్యాపేట, మేడ్చల్ ప్రారంభం కానున్నాయి. నాలుగో వారంలో మంచిర్యాల, సంగారెడ్డి, పెద్దపల్లి ,హనుమకొండ ఉండగా నవంబర్ మొదటి వారంలో నిర్మల్, సిద్దిపేట, రంగారెడ్డి, రెండో వారంలో కుమ్రంభీం ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, గద్వాల, వనపర్తి జిల్లాల్లో కేందాలు అందుబాటులోకి వస్తాయి.

మూడో వారంలో జయశంకర్ భూపాలపల్లి, ములుగు, ఖమ్మం నాలుగో వారంలో మహబూబాబాద్, వికారాబాద్, ఆదిలాబాద్‌లో కేంద్రాలు ప్రారంభిస్తారు. ఖరీఫ్‌లో సేకరించిన సన్నాలను జనవరి నుంచి రాష్ర్ట వ్యాప్తంగా అన్ని చౌక ధరల దుకాణాల్లో సన్న బియ్యం అందించనున్నారు. ధాన్యం కొనుగోలులో అధికారుల పాత్ర కీలకంగా ఉంటుందని, ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు లక్ష్యాలను పూర్తి చేసేందుకు పౌరసరఫరాల శాఖ సిద్దమైంది. 

146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి

రాష్ట్రంలో వానకాలం 60.39 లక్షల ఎకరాల్లో వరి సాగు చేశారు. 146.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 91.28 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. మొదటి సారి 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం నిల్వకు గోదాములను ఏర్పాటు చేసింది.

ఈ సీజన్‌లో  36.80 లక్షల ఎకరాల్లో సన్న వరి సాగు చేయగా 88 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నది. వానకాలం నుంచే సన్నాలకు రూ.500 బోనస్ ఇవ్వనుంది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా 4,496 ధాన్యం కొనుగోలు కేంద్రాలు, ఐకేపీ కేంద్రాల ద్వారా 2,102, ఇతరుల ద్వారా 541 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు.

మిల్లర్లు అవకతవకలకు పాల్పడితే సహించేది లేదని, ప్రజల సొమ్ముతో అప్పు చేసి కొనుగోలు చేస్తున్న ధాన్యం అంశంలో అక్రమాలు జరిగితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. సరిహద్దు రాష్ర్టల నుండి ధాన్యం దిగుమతి జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.