- ఇప్పటివరకు 47.01 లక్షల మెట్రిక్ టన్నులు సేకరణ
- 8.84 లక్షల మంది రైతులకు రూ.10,149 కోట్లు చెల్లింపు
- సన్నవడ్లకు బోనస్ రూ.939 కోట్లు.. 3.36 లక్షల మందికి లబ్ధి
- లక్ష్యం 95 లక్షల మెట్రిక్ టన్నులు.. సగం దాటని కొనుగోళ్లు
- జనవరిలో పేదలకు సన్నబియ్యం పంపిణీ అనుమానమే
హైదరాబాద్, డిసెంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో ధాన్యం సేకరణ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు 47.01లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయగా, 8.84 లక్షల మంది రైతులకు అందుకు సంబంధించిన రూ.10,149 కోట్లు చెల్లించింది. 2025 జనవరి 31వరకు కొనుగోలు కేంద్రాలు అందుబాటులో ఉండేలా ఏర్పాటుచేసినా.. ఇప్పటివరకు 80 శాతం కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తయ్యాయి.
మూడు నాలుగు జిల్లాలో మాత్రమే కేంద్రాలు అడపాదడపా తెరిచి ఉండటంతో అక్కడ మరో 15 రోజుల వరకు ధాన్యం సేకరణ పూర్తి కావచ్చని అధికారులు భావిస్తున్నారు. కొత్త సంవత్సరం నుంచి రేషన్‌దుకాణాల ద్వారా పేదలకు సన్నబియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం ప్రకటించినా.. అమలు చేయడం సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు.
సన్నబియ్యం పంపిణీ చేయాలంటే ప్రభుత్వం 36 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం సేకరిస్తే 24 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం వస్తాయి. పౌరసరఫరాల శాఖ ఈ వానకాలం సీజన్‌లో 153 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అంచనా వేసి 95 లక్షల మెట్రిక్ టన్నుల కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. కానీ, ప్రభుత్వం ఆశించిన విధంగా సన్నధాన్యం సేకరణ కాలేదు.
ప్రైవేటు వ్యాపారులు కల్లాల వద్దకే వెళ్లి పెద్ద మొత్తంలో సన్నవడ్లు కొనుగోలు చేయడంతో ప్రభుత్వ కేంద్రాలకు తక్కువ స్థాయిలో వచ్చాయి. సన్నాలకు రూ.500 బోనస్ ఇస్తామని చెప్పినా రైతులు వ్యాపారుల వైపే మొగ్గు చూపారు. దీంతో రేషన్ దుకాణాల ద్వారా సన్నబియ్యం పంపిణీ ప్రభుత్వానికి సవాల్‌గా మారింది.
ఇప్పటివరకు 18.78 లక్షల సన్న వడ్ల కొనుగోలు
కొనుగోలు కేంద్రాల ద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 3.36 లక్షల మంది రైతుల నుంచి 18.78 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఇందుకు రూ.939 కోట్ల బోనస్ ఇవ్వాల్సి ఉండగా ఇప్పటివరకు రూ.591 కోట్లు రైతుల ఖాతాలో జమచేసింది. ఈ సీజన్‌లో 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయాలని భావిస్తే సగానికి తక్కువగానే సేకరించింది.
దీంతో పేదలకు సన్నబియ్యం పంపిణీ మరో మూడు నెలల వరకు వాయిదా వేయవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం అనుమతి ఇస్తే ప్రైవేటు వ్యాపారుల వద్ద అక్రమంగా ఉన్న నిల్వలు స్వాధీనం చేసుకుని వాటిని ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందజేయనున్నట్టు తెలిసింది.
ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యంలో 28.23 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం, 18.78 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకం. గత ఏడాది 2023 వానకాలంలో 41.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయగా ఈ ఏడాది అంతకంటే 6 లక్షల మెట్రిక్ టన్నులు అదనంగా కొనుగోలు చేసింది.
రాష్ర్టవ్యాప్తంగా ఈసారి 8,318 కేంద్రాల్లో కొనుగోళ్లు చేపట్టింది. ఈదురుగాలులు, అకాల వర్షాలకు కూడా కేంద్రాల్లో ధాన్యం పోసిన రైతులు నష్టపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంది. ధాన్యం సేకరణలో కామారెడ్డి, నిజామాబాద్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, సిద్దిపేట జిల్లాలు ముందు వరుసలో నిలిచాయి.
బోనస్‌తో పెరిగిన సన్నాల సాగు
సన్నవడ్లకు ప్రభుత్వం బోనస్ ప్రకటించడంతో ఈసారి సన్నరకాల వరి సాగు విస్తీర్ణం అనుహ్యంగా పెరిగింది. 2023 వానకాలం సీజన్‌లో సాగైన విస్తీర్ణంలో కేవలం 25.05 లక్షల ఎకరాల్లో(38 శాతం) సన్నాలు సాగు చేశారు. ఈ వానకాలంలో రాష్ట్రంలో రికార్డు స్దాయిలో 66.78 లక్షల ఎకరాల్లో సాగు చేయగా అందులో 61 శాతం దాదాపుగా 40.55 లక్షల ఎకరాల్లో రైతులు సన్న వరి పండించారు. మిగతా 26.33 లక్షల ఎకరాల్లో దొడ్డు రకాలు పండించారు.
అధిక ధరతోనే ప్రైవేటుకు అమ్మారు
ప్రభుత్వం ప్రకటించిన ధరకంటే ఎక్కువగా చెల్లించడంతో రైతులు ప్రైవేటు వ్యాపారుల వైపు మొగ్గు చూపారు. లాభం ఉన్నచోట అమ్ముకోవడం సాధారణమే. ప్రారంభంలో కొనుగోలు కేంద్రాలు కొద్దిగా ఆలస్యం కావడంతో ముందుగానే వ్యాపారులు కొనుగోలు చేపట్టారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం వ్యాపారులు 25 లక్షల మెట్రిక్ టన్నుల సన్నధాన్యం కొనుగోలు చేయవచ్చు.
డీఎస్ చౌహాన్