- మాయమైన వేలాది లారీల ధాన్యం
- కోట్లకు పడగలెత్తిన కొందరు మిల్లర్లు
ప్రభుత్వానికి కోట్లలో నష్టం
విచారణలే కాని చర్యలేవీ?
కరీంనగర్ జిల్లాలో పెద్దఎత్తున సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) ధాన్యం మాయమైంది. బియ్యం పట్టించి ఇవ్వాలని మిల్లర్లకు ప్రభుత్వం ధాన్యం ఇస్తే దాన్ని పక్కదారి పట్టించి కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకున్నారు. పెద్దఎత్తున వ్యాపారులు ధాన్యాన్ని బయటకు అమ్ముకొని లబ్ధి పొందారు. కోట్లాది రూపాయల విలువచేసే ధాన్యాన్ని వ్యాపారులు అమ్ముకుంటున్నా, ప్రభుత్వం ఈ విషయమై ఏమాత్రం పట్టించుకోకపోవడం ప్రశ్నార్థకమవుతోంది.
జమ్మికుంటలో ఒక కంపెనీకి
సీఎంఆర్ కింద ఇచ్చిన ధాన్యం: లక్షా 96వేల క్వింటాళ్లు
ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం : ౦
దీని విలువ: 62.30 కోట్లు
ఇల్లందకుంటలో ఒక కంపెనీకి
అప్పగించిన ధాన్యం: 2.19 లక్షల క్వింటాళ్లు
ప్రభుత్వానికి అప్పగించిన ధాన్యం : ౦
దీని విలువ: 68 కోట్లు
ఎండీపై కేసు.. భర్తతో సహా పరారీ
కరీంనగర్, జూన్ 30 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాకు సంబంధించిన 2022-23 యాసంగి, 2023-24 వానాకాలం పంటలకు సంబంధించి మొత్తం 14.80 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికిగాను 6.50 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే తిరిగి ఇచ్చారు. 8 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యం ఇంకా అప్పగించవలసి ఉంది. ప్రభుత్వం గత సంవత్సరం నుంచి గడువు మీద గడువు పెడుతున్నప్పటికి కొందరు మిల్లర్లు బియ్యాన్ని పక్కదారి పట్టించి కోట్లు గడిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం కోరపల్లిలోని శ్రీ మహాశక్తి ఆగ్రో ఇండస్ట్రీస్‌కు 2022-23 యాసంగి, 2023-24 వానాకాలం సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ కింద లక్షా 96 వేల క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించగా, కస్టమ్ మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఒక క్వింటాలు కూడా ప్రభుత్వానికి అప్పగించకుండా దారిమళ్లించారు. వీటి విలువ 62.30 కోట్ల వరకు ఉంటుంది.
ఇల్లందకుంట మండలం శ్రీరాములపల్లిలోని శ్రీ సీతారామ ఆగ్రో ఇండస్ట్రీస్‌కు సంబంధించి ఈ రెండు సీజన్లలో 2.19 లక్షల క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించగా, వీటిని కూడా మిల్లింగ్ చేసి పక్కదారి పట్టించారు. వీటి విలువ 68 కోట్ల వరకు ఉంటుంది. ఈ ఇండస్ట్రీలకు సంబంధించిన ఎండీగా వ్యవహరిస్తున్న బండారి శారద, ఆమె భర్త బండారి మారుతిలపై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు పరారీలో ఉన్నారు. ప్రస్తుతం ఇదే ప్రాంతంలో మరో మిల్లులో కూడా బియ్యం పక్కదారి పట్టినట్లు తెలుస్తోంది.
సీఎంఆర్ పాలసీలో లొసుగులు..
ప్రతి ఏడాది ప్రతి సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరిస్తుంది. ఇలా సేకరించిన ధాన్యాన్ని రైస్ మిల్లులకు పంపిస్తుంది. మిల్లర్లకు ఈ ధాన్యాన్ని బియ్యంగా పట్టించి ఎఫ్‌సీఐకి లెవిగా పంపించాల్సి ఉంటుంది. ప్రతి 100 కిలోల ధాన్యానికి 65 కిలోలు బియ్యం ప్రభుత్వానికి ఇవ్వాలి. దీన్ని ప్రభుత్వం ప్రజా పంపిణీ కింద ఇటు రేషన్ షాపుల ద్వారా ప్రజలకు అటు బాయిల్ బియ్యం అయితే ఎఫ్‌సీఐకి పంపిస్తుంది.
లారీలకు లారీలే మాయం..
రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోని సివిల్ సప్లు విభాగం రైస్ మిల్లులను ట్రేడర్లను ఎంపిక చేసి ఐకేపీ సెంటర్ల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని వారికి పంపిస్తుంది. వారు బియ్యంగా పట్టించి మళ్లీ ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉటుంది. ఇలా ఒక్కో ట్రేడర్‌కు 200 నుంచి 300 లారీల ధాన్యాన్ని పంపించింది. కానీ కొందరు రైస్ మిల్లర్లు, ట్రేడర్లు ధాన్యాన్ని బయట అమ్ముకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ కోట్ల రూపాయల్లోనే ఉంటుందని అంచనా. సీఎంఆర్ పాలసీలో ఉన్న లొసుగులను ఆసరా చేసుకున్న వ్యాపారులు పెద్దఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది.
ముందే స్కెచ్...
సీఎంఆర్ పాలసీలో ఉన్న లొసుగులను ఆధారం చేసుకున్న కొందరు మిల్లర్లు, వ్యాపారులు ముందుగానే తమ సంపాదనకు స్కెచ్ వేసుకుంటున్నారు. అధికారులకు డబ్బుల ఆశచూపి అలాగే పొలిటికల్ సిఫార్సులతో పెద్దఎత్తున అధికారులు తమ మిల్లుకు, తమ ఏజెన్సీకి ధాన్యం వచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కొంతమంది బినామీ పేర్లతో లైసెన్సులు సృష్టించి, మరికొన్ని రైస్ మిల్లులను లీజుకు తీసుకుని పెద్దఎత్తున ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని పొందారు. కరీంగర్‌కు చెందిన ఓ వ్యాపారి ఏకంగా పదుల సంఖ్యలో మిల్లులను పొంది కోట్లాది రూపాయల ధాన్యాన్ని ప్రభుత్వం ద్వారా తీసుకొని దాన్ని మాయం చేసినట్టు తెలుస్తోంది. హుజూరాబాద్‌కు చెందిన మరో వ్యాపారి 8కిపైగా రైస్ మిల్లులను లీజుకు తీసుకుని ప్రభుత్వం నుంచి ధాన్యాన్ని పొంది మాయమైనట్టు తెలుస్తోంది. ఈ ధాన్యం విలువ కోట్ల రూపాయలలో ఉండడం గమనార్హం.
ఐఈ, ఈడీ ఎక్కడ..?
100 కోట్ల లిక్కర్ స్కాం ఢిల్లీలో జరిగితే కదిలిన ఈడీ, ఆదాయ పన్నుశాఖ అధికారులు ఇంత పెద్ద కుంభకోణం జరిగితే ఎందుకు పట్టించుకోవడం లేదనే చర్చ జరుగుతోంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేవలం 100 కోట్లేనని కానీ దుర్వినియోగమైన ధాన్యం విలువ వందల కోట్లలో ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ వ్యవహారం విషయంలో పూర్తిస్థాయిలో విచారణ చేసి అక్రమార్కుల వివరాలు బయటపెట్టి వారి నుండి ధాన్యాన్ని రికవరీ చేయాల్సి ఉంది.
కోట్లకు పడగలెత్తిన వ్యాపారులు
ఒకప్పుడు నామమాత్రంగా ధాన్యం కొనుగోలు చేసి బియ్యం పట్టించి విక్రయించిన చిన్న వ్యాపారులు ఈ అక్రమ వ్యాపారం మొదలు పెట్టి కోట్ల రూపాయలకు పడగలెత్తినట్లు తెలుస్తోంది. రైస్ మిల్లుల్లో జరిగిన అక్రమాలతో వ్యాపారులు కోట్లాది రూపా యలు కొల్లగొట్టారు. రైస్‌మిల్లు విలువ కంటే 10 నుంచి 20 రెట్లు ఎక్కువగా ధాన్యం విలువ ఉంది. విక్రయించిన ధాన్యంతో వ్యాపారులు కోట్లాది రూపాయలు వెనకేసి, ఇతర వ్యాపారాలు ప్రారంభించినట్లుగా తెలుస్తోంది. అధికారులు కేసు పెడతారు.. బెయిల్ తీసుకొని మళ్లీ బయటకు రావచ్చు.. కోర్టులో కేసులు ఏళ్ల కొద్దీ నడుస్తాయి, ఏమీ కాదులే.. అన్న చందంగా వ్యాపారులు వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా సంపాదించిన డబ్బుతో కొంతమంది జల్సాలు చేసినట్లు తెలుస్తోంది. ఒక వ్యాపారి ఏకంగా పాల డెయిరీతోపాటు కోట్లాది రూపాయల విలువచేసే నివాస గృహాలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం, వైన్స్ వ్యాపారం చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఏ రైస్ మిల్లర్ ఎంత ధాన్యం దుర్వినియోగం చేశారు అన్నది సివిల్ సప్లు అధికారులు కూడా తేల్చలేకపోతున్నారు.
విడ్డూరంగా అధికారుల తీరు..
రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించే విషయంలో సివిల్ సప్లు అధికారులు వ్యవహరిస్తున్న తీరు విస్మయాన్ని కలిగిస్తోంది. వ్యాపారుల గత చరిత్ర చూడకుండానే పెద్దఎత్తున వారికి ధాన్యం కేటాయిస్తున్నారు. గతంలో వారికి ఎంత ధాన్యం కేటాయించాం, వాటికి సంబంధించి బియ్యాన్ని సరఫరా చేశారా, లేదా అన్న అంశాలను పరిశీలించకుండానే ఇష్టారాజ్యంగా ధాన్యాన్ని కేటాయిస్తున్నారు. వ్యాపారులతో కుమ్మక్కు కావడమే దీనికి కారణం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఒక్కో మిల్లుకు 200 నుంచి 300 లారీల ధాన్యం అంటే దాని విలువ సుమారు 5 నుండి 6 కోట్లు ఉంటుందని అంచనా.
దీన్నిబట్టి ఎనిమిదికిపైగా మిల్లులు చూపించి ధాన్యం తీసుకున్న వ్యక్తులు ఎంత విలువైన ధాన్యం మాయం చేశారో అర్థం చేసుకోవచ్చు. సివిల్ సప్లు అధికారులు ఎప్పటికప్పుడు రైస్ మిల్లుల్లో నిల్వలు పరిశీలించాల్సి ఉంది. మిల్లుల యజమానులు ఎప్పటికప్పుడు ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సరఫరా చేస్తున్నారా లేదా అన్నది పరిశీలించాల్సి ఉంది. వ్యాపారులతో కుమ్మక్కైన అధికారులు తూతూ మంత్రంగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షించడంతో ప్రభుత్వానికి పెద్దఎత్తున గండి పడుతుంది. టాస్క్‌ఫోర్స్ విజిలెన్స్ అధికారులు కూడా వ్యాపారులకు సహకరిస్తున్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు వ్యాపారులకు రాజకీయ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది.
నివేదిక పంపిచాం..
శనివారం కరీంనగర్‌లో రెండు, మానకొండూర్‌లో రెండు, తిమ్మాపూర్‌లో రెండు మిల్లులను తనిఖీ చేశాం. ప్రభుత్వం కేటాయించిన ధాన్యంలో స్టాకు ఉన్న ధాన్యానికి కొద్దిగా వ్యత్యాసం ఉంది. విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ద్వారా తనిఖీలు చేశాం. వీటికి సంబంధించిన నివేదికను రాష్ట్ర పౌరసరఫరాలశాఖకు పంపించాం.
వెంకటేశ్వర్లు,
జగిత్యాల డీఎస్‌వో