calender_icon.png 22 March, 2025 | 5:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అవినీతి అధికారికి ఇంకా అందలం ఎందుకు?

22-03-2025 01:45:10 AM

 విద్యుత్ కనెక్షన్ లేని మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఏం ప్రాతిపదిక

 పీవీ పేరుతో వాటాలేసుకున్న తోడు దొంగలు

 బీసీ పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్

వనపర్తి, మార్చి 21 ( విజయక్రాంతి ) : సివిల్ సప్లయ్ శాఖలో ధాన్యం పేరుతో కోట్లాది రూపాయలు దండుకున్న అవినీతి అధికారి కాశీ విశ్వనాథ్ ను ఇంకా ఎన్ని రోజులు అందలం ఎక్కిస్తారని బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాశీ విశ్వనాథ్ వనపర్తి డీఎస్‌ఓగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచే అనేక అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని, జిల్లాలో దాదాపు 40 మిల్లులకు అర్హత ఉన్నా.. తప్పుడు సమాచారంతో పక్క జిల్లాలకు ధాన్యం కేటాయించారన్నారు.

సస్పెండైన పాత డీఎం ఇర్ఫాన్ మరియు డిఎస్‌ఓ కాశీ విశ్వనాథ్ తోడు దొంగల్లా దోపిడీ చేసి ఫిజికల్ వెరిఫికేషన్ పేరుతో వసూళ్లకు పాల్పడి...ఆపై వాటాలేసుకున్నారని మండిపడ్డారు. విద్యుత్ కనెక్షన్ లేని మిల్లులకు ధాన్యం కేటాయింపులు ఏ ప్రాతిపదికన కేటాయించారో చెప్పాలని, కెపాసిటీకి మించి డబ్బులు ఇచ్చిన వారికి సన్నధాన్యం, ఇవ్వని వారికి దొడ్డు ధాన్యం కేటాయింపులు చేశారన్నారు. సస్పెండ్ వరకు వెళ్లిన డిఎస్‌ఓ.. ఎంత ముడుపులు ఇస్తే ఇక్కడ కొనసాగించేందుకు ఉన్నతాధికారులు ఒప్పుకున్నారని ప్రశ్నించారు.

అవినీతి అక్రమాల నేపథ్యంలో ఒకరిని సస్పెండ్ చేసినా ఇంకొకరిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు. డీ ఫాల్టర్ల మీద కేసులు నమోదు చేశామని చెబుతున్న అధికారులు ధాన్యం రికవరీపై దృష్టి ఎందుకు పెట్టడం లేదో చెప్పాలన్నారు. ఈ విధానం వల్ల సివిల్ సప్లయ్ అధికారి రైస్ మిల్లర్లకే అధిక లాభం చేస్తున్నారని, అర్హత ఉన్న 40 మిల్లులకు కాకుండా.. అసంపూర్తి మిల్లులకు, పక్కా జిల్లా మిల్లులకు సీఎం ఆర్ కేటాయింపులు చేసినట్లు రుజువైనా చర్యలు తీసుకోకుండా అతడిని ఎందుకు కాపాడుతున్నారని ప్రశ్నించారు.

ఈ విషయంపై పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి వివి గౌడ్, పట్టణ అధ్యక్షులు దేవర శివ, కొత్తకోట మండల అధ్యక్షుడు ఆంజన్న యాదవ్, పెద్దమందడి మండల అధ్యక్షుడు రమేష్ సాగర్, శేఖర్ గౌడ్, రామన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.