calender_icon.png 27 December, 2024 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలకే ‘పట్టభద్రుల’ టికెట్

02-11-2024 12:00:00 AM

  1. బలహీనవర్గాల నేతలకు బీఆర్‌ఎస్ చాన్స్
  2. కాంగ్రెస్, బీజేపీలను ఇరుకున పెట్టేందుకు ఎత్తులు
  3. రాజారాం యాదవ్, జోగు రామన్న పేర్లు ఖరారు? 

హైదరాబాద్, నవంబర్ 1  (విజయక్రాంతి): ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల పోరు ప్రధాన పార్టీలకు సవాల్‌గా మారాయి. ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్‌రెడ్డి పదవీకాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగియనుంది.

దీంతో వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఈఎన్నికల్లో విజయం సాధించి తీరాలని అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌లు వ్యుహాలకు పదును పెడుతున్నాయి. ఈసారి జరిగే పోరులో బీసీ నేతలను నిలబెట్టేందుకు గులాబీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

ఓయూ విద్యార్థి ఉద్యమనేత రాజారాం యాదవ్ పేరు తెరపైకి వచ్చినట్లు, మరోవైపు ఇటీవల పార్టీ బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటు చేసిన కమిటీ ఇద్దరి పేర్లు సూచించినట్లు పార్టీ వర్గాలో టాక్ నడుస్తోంది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జోగు రామన్న పేరు కూడా వినిపిస్తుంది.

ఇప్పటికే కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్‌సింగ్ కూడా తాను పోటీ చేస్తున్నట్లు ప్రచారం చేసుకోగా, ఆయనను పట్టభద్రులు ఆదరించడం కష్టమని, బలహీనవర్గాలకు ఇస్తే విజయం సాధించవచ్చని, అదే విధంగా కాంగ్రెస్, బీజేపీలను కూడా దెబ్బకొట్టవచ్చని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.

గత పది రోజుల నుంచి రాజారాం యాదవ్ పట్టభద్రుల ఓట్ల ఎన్‌రోల్‌మెంట్ క్యాంపులు పెట్టి పేర్లు నమోదు చేయిస్తున్నారు. ఆయనకు ఇప్పటికే హైకమాండ్ సూచనప్రాయంగా చెప్పినట్లు తెలంగాణ భవన్‌లో చర్చ సాగుతోంది.

ఇటీవల బీసీ కుల గణనన, నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాల నోటిఫికేషన్ వేయాలని సచివాలయ ముట్టడి, ఇందిరాపార్కు వద్ద సత్యాగ్రహ దీక్ష వంటివి చేపట్టి రేవంత్ సర్కార్‌కు కొరకరాని కొయ్యగా మారారు.

ఆయన చేపట్టిన ఉద్యమానికి వివిధ యూనివర్శిటీలకు చెందిన విద్యార్థి నాయకులు మద్దతు పలికారు. యువనేత కావడంతో పాటు తెలంగాణ ఉద్యమ నేపథ్యం ఉండటంతో తెలంగాణ పట్టభద్రులు జై కొడుతారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. 

కాంగ్రెస్‌లో పోటాపోటీ..

అధికారం కాంగ్రెస్ కూడా సిటింగ్ సీటును తిరిగి దక్కించుకునేందుకు ముమ్మరం ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి చాలామంది నేతలు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోసారి ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పోటీ చేసి విజయం సాధించి మంత్రి పదవి దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు ఆయన అనుచరులు పేర్కొంటున్నారు. బీజేపీ నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.రాణి రుద్రమ దేవి, సుగుణాకర్‌రావు, గుజ్జల రామకృష్ణారెడ్డి పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది.  

ఈ నెల 6 వరకు ఓటరు నమోదు..

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓ టర్ల నమోదు సెప్టెంబర్ 30న ప్రారంభం కాగా ఈ నెల 6 వరకు కొనసాగనుంది. డిసెంబర్ 30న ఓటర్ జాబితా విడుదల కానుంది. నాలుగు జిల్లాలకు చెందిన కలెక్టరేట్లలో ఓటరు రిజిస్ట్రేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఆర్డీవో, తహసీల్దార్ ఆఫీసుల్లో ఆన్‌లైన్‌లో ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ ద్వారా కూడా ఓటరు నమోదు చేసుకోవచ్చు.

డిగ్రీ మెమో, ప్రొవిజనల్ సర్టిఫికెట్, ఆధార్, ఎలక్షన్ కార్డు ఎపిక్ నంబర్, ఫోన్ నంబర్, ఈ మెయిల్ ఐడీ, పాస్‌ఫొటోతో పాటు ఫామ్ 18 సమర్పించాలి. ఎమ్మెల్సీ ఓటరుగా 2021 నవంబర్ 11 లోపు డిగ్రీ పాసైనవారు అర్హులు. 2019 ఎన్నికల్లో 1.96 లక్షల మంది గ్రాడ్యుయేట్లు మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకోగా ఈసారి పట్టభద్రుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందని ఎన్నికల అధికారులు భావిస్తున్నారు.

సుమారు 7.50 లక్షల మంది గ్రాడ్యుయేట్లు రిజిస్ట్రేషన్ చేసుకునేలా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. బరిలో నిలిచే అభ్యర్థులు విజయం కోసం ముందస్తుగా ఓటరు నమోదు సెంటర్లను ఏర్పాటు చేసి గ్రాడ్యుయేట్లను ఆకట్టుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. నాలుగు జిల్లాలకు చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసి ఈసారి తమ గెలుపునకు సహకరించాలని వేడుకుంటున్నారు.