28-02-2025 01:03:51 AM
నిర్మల్ ఫిబ్రవరి 27( విజయ క్రాంతి) : నిర్మల్ జిల్లాలో కరీంనగర్ పట్టభద్రులు ఉపాధ్యాయుల నియోజకవర్గానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ గురువారం పకడ్బందీ ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ముసినట్టు జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. జిల్లాలో మొత్తం ఓటర్లు 19 107 ఉండగా 1741 పట్టభద్రులు 19 66 ఉపాధ్యాయులు ఉండగా 68 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు.
పోలింగ్ కేంద్రాలను కడెం మండలంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ తనిఖీ చేయగా బైంసా డివిజన్లో జిల్లా ఎస్పీ జానకి షర్మిల పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4:00 వరకు పోలింగ్ నిర్వహించగా నాలుగు గంటల తర్వాత క్యూ లైన్ లో నిలబడ్డ వారికి ఓటింగ్ అవకాశం ఇవ్వడంతో పట్టణాల్లో పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు కనిపించారు.
పోలీస్ శాఖ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. ఇదిలా ఉండగా లోకేశ్వరంలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ ఖానాపూర్ డివిజన్లో మరో అదనపు కలెక్టర్ వైజాగ్ నెంబర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు.
ఓటర్లకు ఇబ్బంది కలిగించవద్దు
నిర్మల్ ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : పోలింగ్ కేంద్రాలకు ఓటింగ్ కోసం వచ్చేవారికి కావలసిన సమాచారాన్ని అందించి ఓటు హక్కు వినియోగించుకునేలా ఓటింగ్ సిబ్బంది చూడాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ అన్నారు. గురువారం లోకేశ్వరం మండలంలోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసి ఓటర్ స్లిప్పుల పంపిణీ తాగునీటి సౌకర్యం తదితర అంశాలపై ఆరా తీశారు. ఎన్నికల నిబంధనలు కచ్చితంగా పాటించాలని సిబ్బందికి సూచించారు.
ఆదిలాబాద్‌లో..
ఆదిలాబాద్, ఫిబ్రవరి 27 (విజయ క్రాంతి) : ఆదిలాబాద్ జిల్లా లో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జిల్లా వ్యాప్తంగా 39 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా, అధికార యంత్రాంగం పకడ్బందీ ఏర్పాటు చేపట్టారు. గురువారం పోలింగ్ సరళిని జిల్లా కలెక్టర్ రాజర్షి షా పరిశీలించారు. పలు పోలింగ్ కేంద్రాలను సందర్శిస్తూ పోలింగ్ ప్రక్రియను పర్యవేక్షించారు.
అదేవిధంగా జిల్లా ఎస్పీ గౌష్ అలం సైతం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను సందర్శించి, కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తులు పరిశీలించారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 163 బిఎన్‌ఎస్‌ఎన్ అమలు పర్చారు. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల ఓట్లు 14,935 ఉండగా 10,375 పోల్ అయ్యాయి. అదేవిధంగా ఉపాధ్యాయ ఓట్లు 1,593 ఉండగా 1,478 పోల్ అయ్యాయి. జిల్లా వ్యాప్తంగా పట్టభద్రుల పోలింగ్ 69.47 % కాగా, ఉపాధ్యాయుల పోలింగ్ 92.78 % నమోదైంది. ఉదయం పూట పోలింగ్ మందకోడిగా సాగిన మధ్యాహ్నం నుండి ఊపందుకుంది.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పరిశీలించిన సీపీ, కలెక్టర్
లక్షేట్టిపేట, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : పట్టణంలోని ప్రభుత్వ జడ్పీ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియను గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, రామగుండం సీపీ శ్రీనివాస్ లు పరిశీలించారు. పోలింగ్ కేంద్రంలో ఓటర్ల కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల సదుపాయాల గురించి వాకబు చేశారు. పోలింగ్ కేంద్రాల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు వేసి ప్రజాస్వామ్య పరిరక్షణకు పాటుపడాలని సూచించారు. అంతకుముందు రామగుండం సీపీ శ్రీనివాస్ మాట్లాడుతూ... పోలింగ్ కేంద్రాల వద్ద 163 బీ ఎన్ ఎస్ ఎస్ సెక్షన్ అమలులో ఉన్నట్టు తెలిపారు. కమీషనరేట్ వ్యాప్తంగా ప్రశాంతంగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏసీపీలు, సీఐ లు, ఎస్త్స్ర లు సిబ్బంది మొత్తం 560 మందితో పటిష్టమైన ఏర్పాట్లు చేశామన్నారు.
అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భద్రత చర్యలు చేపట్టామన్నారు. అంతకుముందు స్థానిక తహసీల్దార్ దిలీప్ కుమార్ పోలింగ్ కేంద్రాలలో పలుమార్లు తనిఖీ చేసి ఓటర్ల కు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. వయోభారం తో బాధడుతున్న వారిని, దివ్యాంగులు కూడా ఓటు వేసే విధంగా తహసీల్దార్ దిలీప్ కుమార్ సహకరించారు. ప్రశాంతంగా పోలింగ్ జరుగడంలో ఎస్త్స్ర పీ సతీష్ ఆధ్వర్యంలో పోలీసులు గట్టి బందోబస్త్ నిర్వహించారు.
బెల్లంపల్లిలో
బెల్లంపల్లి, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : బెల్లంపల్లి నియోజకవర్గం లో గురువారం పట్టభద్రుల, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సాయంత్రం పోలింగ్ ముగిసే సమయానికి నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో కలుపుకొని 5289 మంది పట్టభద్రులకు గాను 3527 మంది ఓటు హక్కును వినియోగించుకోగా 66.69 శాతం పోలింగ్ నమోదయింది. 235 మంది ఉపాధ్యా యులకు గాను 214 మంది తమ ఓటు హక్కు వినియోగించుకోవడం తో 91.06 పోలింగ్ శాతం నమోదైంది.
ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగిన ఎన్నికల పోలింగ్ లో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.నియోజకవర్గం లోని ఏడు మండలాల్లో ఎక్కడ పొరపాట్లు జరుగకుండా అధికారులు ఏర్పాట్లు చేపట్టారు.బెల్లంపల్లి లో ఆర్డీవో హరికృష్ణ,తహశీల్దార్ జోష్ణ పోలింగ్ బూత్ లను పర్యవేక్షించగా సీ ఐ దేవయ్య పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఓటెత్తిన టీచర్లు...వెనుకబడ్డ పట్టభద్రులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 27( విజయక్రాంతి): ఉపాధ్యాయ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు ఉత్సాహంగా ఓటింగ్లో పాల్గొనగా పట్టబద్రులు మాత్రం నిరుత్సాహాన్ని కనబరిచారు.6137 పట్టభద్రులు 4546 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.470 మంది ఉపాధ్యాయులకు 424 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో పదివేల పైగా పట్టభద్రులున్నప్పటికీ 6137 మంది మాత్రమే ఓటు నమోదు చేసుకున్నారు.
అర్హులైన వారు కూడ పూర్తిస్థాయిలో ఓటును వినియోగించుకోలేదు. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, ప్రైవేటు వ్యాపార సంస్థల్లో పనిచేస్తున్న పట్టభద్రులకు సెలవు దినంగా ప్రకటించాలని కలెక్టర్ ఆదేశించినప్పటికీ కొన్నిచోట్ల విద్యాసంస్థల్లో రెండు గంటలు మాత్రమే అవకాశం ఇవ్వడంతో ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉదయం ఎనిమిది గంటల నుండి పోలింగ్ ప్రారంభం లాగా సాయంత్రం నాలుగు గంటల వరకు జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
జిల్లాలో 17 పోలింగ్ బూతులను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ వెంకటేష్ , ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళని కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఎస్పి డివి శ్రీనివాసరావు, అదనపు కలెక్టర్లు దీపక్ తివారి, డేవిడ్, ఏ ఎస్పీ చిత్తరంజన్, సబ్ కలెక్టర్ పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీస్ శాఖ భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
జిల్లాలో ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
మంచిర్యాల, ఫిబ్రవరి 27 (విజయక్రాంతి) : జిల్లాలో మెదక్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - కరీంనగర్ నియోజక వర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ఎన్నికల పోలింగ్ ప్రక్రియ గురు వారంతో ముగిశాయి. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులు, సిబ్బంది పలు సూచనలు చేశారు.
నస్పూర్ మండలం తీగల్ పహాడ్ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని తహశిల్దార్ శ్రీనివాస్ తో కలిసి పరిశీలించారు. అనంతరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన వెబ్ కాస్టింగ్ ద్వారా పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ గురువారం ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరిగిందని, జిల్లాలో 60 మంది ప్రిసైడింగ్ అధికారులు, 181 మంది పోలింగ్ అధికారులు, 25 మం ది సూక్ష్మ పరిశీలకులను నియమించామని తెలిపారు.
జిల్లాలో ఉపాధ్యాయ ఎం.ఎల్.సి. ఎన్నిక కొరకు 18 పోలింగ్ కేంద్రాలు, పట్టభద్రుల ఎం.ఎల్.సి. ఎన్నిక కొరకు 40 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా ఇందులో 8 కామన్ పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన అధికారులు, సిబ్బంది తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వహించాలని తెలిపారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బం దులు తలెత్తకుండా పోలింగ్ కేంద్రాలలో త్రాగునీరు, విద్యుత్, వెలుతురు, ఇతర మౌళిక సదుపాయాలు కల్పించామన్నారు.