11-04-2025 01:38:03 AM
బీస్మార్ట్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జలంధర్ రెడ్డి
యాదాద్రి భువనగిరి, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : పదవ తరగతి ఫలితాల్లో గ్రేడింగ్ విధానమే అమలు చేయాలని తెలంగాణ బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ పగిడాల జలంధర్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు గురువారం భువనగిరి డీఈఓకు ఆయన వినతిపత్రం అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. గ్రేడింగ్ పద్ధతిని ఎత్తివేసి మార్కులు కేటాయిస్తే కార్పొరేట్ పాఠశాలలకు లబ్ధి చేకూరుతుందన్నారు.
విద్యార్థులు ఇప్పటివరకు గ్రేడింగ్ పద్ధతిని అనుసరించే చదివారని, ప్రభుత్వం ఆకస్మాతుగా మార్కుల విధానం అమలు చేస్తామని ప్రకటించడం శోచనీయమని పేర్కొన్నారు. గ్రేడింగ్ విధానంలో 90 శాతంపైన మార్కులు వచ్చిన విద్యార్థులందరికీ ఒకే గ్రేడింగ్ ఇవ్వడంతో నిరుత్సాహం చెందరన్నారు. మార్కులు వేస్తే మానసికంగా ఆందోళన చెందే అవకాశముందన్నారు.
రాష్ట్ర లో బడ్జెట్ స్కూల్స్ ఎక్కువగా ఉన్నందున విద్యాశాఖ తమ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను వెంటనే రద్దుచేసి గ్రేడింగ్ విధానంలోనే ఫలితాలను వెల్లడించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా బీస్మార్ట్ సభ్యులు మిర్యాల దుర్గాప్రసాద్, బట్టి రెడ్డి రవీందర్ రెడ్డి, తోటకూరి యాదయ్య, నోముల బస్వా రెడ్డి, సింగిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.