calender_icon.png 29 April, 2025 | 10:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జీపీ బిల్డింగ్ నిర్మాణంలో నాణ్యతకు తిలోదకాలు..

29-04-2025 05:08:41 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణంలో కాంట్రాక్టర్ నాణ్యతకు తిలోదకాలు ఇచ్చి, నాసిరకం ఇసుక, స్టీల్, సిమెంట్ వినియోగిస్తున్నారని, దీనివల్ల భవనం ఎందుకు పనికిరాకుండా పోయే పరిస్థితి ఏర్పడుతుందని గ్రామానికి చెందిన వివిధ పార్టీల నాయకులు పింగిలి శ్రీనివాస్, గంజి రాజేందర్ రెడ్డి, చిన్నాల కట్టయ్య, బూర రజనీకాంత్, మాంగ్యా నాయక్, రాజయ్య తదితరులు జిల్లా కలెక్టర్, ఇంజనీరింగ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... రాజ్యసభ సభ్యుడు, వద్దిరాజు రవిచంద్ర తన స్వగ్రామమైన ఇనుగుర్తిలో గ్రామపంచాయతీ భవనం శిథిలంగా మారడంతో తన సిడిఎఫ్ నిధుల నుంచి 25 లక్షల రూపాయలను మంజూరు చేశాడని చెప్పారు. అయితే పనులు చేపట్టిన కాంట్రాక్టర్ నిబంధనలకు విరుద్ధంగా నాణ్యతాలేమితో పనులు చేస్తుండడం వల్ల ఏళ్ల తరబడి ఉండాల్సిన భవనం ఎందుకు పనికిరాకుండా పోవడం ఖాయమన్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీరాజ్ శాఖ ఇంజనీర్ మానస అక్కడికి చేరుకొని పనులను పరిశీలించి వెంటనే స్టీల్, ఇసుక, సిమెంట్ మార్చాలని కాంట్రాక్టర్ కు సూచించారు. దీనితో కాంట్రాక్టర్ ఇసుకను జల్లెడ పట్టించి, సిమెంటు మరో రకం తెప్పించి, స్లాబుకు అదనంగా స్టీల్ రాడ్లను వేయించి పనులు చేపట్టడానికి చర్యలు తీసుకున్నారు.