08-04-2025 12:04:32 AM
నిజామాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నిజామాబాదు జిల్లాలోని ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో గత ఎన్నో ఏళ్ళుగా విడిసిల ఆధిపత్య తీరు అడ్డు అదుపులేకుండా పోతున్నాయి. తోడుగా అగ్రకుల రాజకీయ నాయకులు నిమ్మకు నేరేత్తినట్లు వ్యవహారిస్తున్నారని పలు గ్రామస్తులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అందులో భాగంగానే ఏర్గట్ల మండలం తాళ్ళారాంపూర్ ఊరిలోని గౌడ కులస్తుల ఈతకల్లు విషయమై వీడీసీ సభ్యులకు మధ్య గత కొంత కాలం నుంచి గొడవలు జరిగాయి.
ఇట్టి అంశంపై ఏర్గట్ల పోలీస్ స్టేషన్లో గీతాకార్మికులు పలువురిపై కేసులు పెట్టారు. అయితే వాటిని సాకుగా చేసుకొని ఆధిపత్య కక్షతో ఆదివారం రామనవమి కావడంతో హిందూ ఆలయంలో పూజలు నిర్వహించడం కోసం వెళ్లిన ‘గౌడ మహిళల్ని గుళ్ళోకి రావద్దంటు మీకు పూజలు నిర్వహించనని‘ అర్చకులు (బ్రాహ్మణులు) ఖరాఖండిగా చెప్పి వెనక్కి పంపారు.
ఇది ఘోర మానసిక అన్యాయం. తమ ఆధ్యాత్మిక హక్కు నిరాకరణ. దీనికి జవాబుగా వందల సంఖ్యలో గౌడజాతి జనం తమ గ్రామం నుంచి భారీ ఊరేగింపుతో తరలి వచ్చి పోలీస్ స్టేషన్ (పి.ఎస్)ను ముట్టడించారు. హిందూ పండగ రోజున రామాలయంలో కుంకుమార్చన చేయనీయకుండా తమ ఆధ్యాత్మిక హక్కును, మానసికంగా అవమానపర్చిన పూజారులపై చట్టరీత్య కఠిన చర్యలు తీసుకోవాలని ఆందోళనకారులు డిమాండ్ చేశారు.
అదేవిధంగా రాజ్యాంగ విరుద్ధమైన గ్రామ వీడీసీని తక్షణమే రద్దు చెయ్యాలని స్టేషన్ ఎదుట బైఠాయించారు. మహిళల న్యాయ పోరాటానికి జిల్లా అంబేడ్కర్ సంఘాలు, బీసీ సంఘాలు మద్దతు పలికాయి.