16-02-2025 12:50:37 AM
హైదరాబాద్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): బిల్డర్లు, డెవలపర్లకు హైదరాబాద్ స్వర్గధామమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు పేర్కొన్నారు. సంపద సృష్టికర్త లయిన వాళ్లు రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాము లు కావాలని పిలుపునిచ్చారు. బిల్డర్లకు ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందన్నారు. హైదరాబాదును గ్రీన్ సిటీగా మార్చేందుకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. కాలుష్యం కారణంగా ఢిల్లీలోని ప్రజలు అక్కడ నివసించేందుకు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఆ పరిస్థతి హైదరాబాద్‌కు రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. శనివారం హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ బిల్డర్స్ గ్రీన్ సమ్మిట్‌లో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్లోబల్ స్థాయిలో తెలంగాణ రైజింగ్ అయ్యేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు పోతున్నట్లు స్పష్టం చేశారు. నెట్ జీరో సిటీ ఒప్పందం ద్వారా హైదరాబాద్ ప్రపంచానికి సందేశం ఇచ్చిందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ర్ట అభివృద్ధి కోసం తమ ప్రభుత్వం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి ఈ ఏడాది రూ.10 వేల కోట్లు కేటాయించినట్టు వెల్లడించారు.
దశలవారీగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తాం..
హైదరాబాద్‌లోని డీజిల్ వాహనాలను దశలవారీ ఎలక్ట్రిక్ వాహనాలుగా మారుస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు. 2029 నాటికి 20,000 మెగావాట్ల గ్రీన్ పవర్ ఉత్పత్తే లక్ష్యంగా కొత్త విద్యుత్ పాలసీని తీసుకొచ్చామన్నారు. ఆదాయాన్ని కోల్పోతామని తెలిసినా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు రిజిస్ట్రేషన్ చార్జీలను తగ్గించినట్టు పేర్కొన్నారు. కాలుష్య రహిత నగరంగా హైదరా బాద్‌ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఆదాయం కంటే ప్రజల ఆరోగ్యమే తమకు ముఖ్యమని స్పష్టం చేశారు. ఫోర్త్ సిటీని తెలంగాణ ఫ్యూచర్ సిటీగా అభివర్ణించారు. ప్రపంచ కేంద్రంగా ఫోర్త్ సిటీని తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. మూసీ పునరుజ్జీవాన్ని రాష్ర్ట చరిత్రలో ఒక మైలురాయిగా భట్టి విక్రమార్క అభివర్ణించారు. దశాబ్దకాలంగా కాలుష్య కాసారంతో ప్రజలు జీవించడానికి ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మూసీలో పరిశుద్ధమైన నీళ్లు పారే లా చేసి దాన్ని నగరానికి వరంలా మారుస్తామన్నారు. హైదరాబాద్‌ను అద్భుత నగరం గా మార్చడానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎంత ఖర్చైనా వెనకాడబోమన్నారు.