calender_icon.png 10 January, 2025 | 3:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు అండగా ప్రభుత్వం

07-09-2024 12:43:21 AM

  1. కాంగ్రెస్ నేత వీహెచ్ భరోసా 
  2. సైదాబీ కుటుంబానికి రూ.50 వేల సాయం 

ఖమ్మం, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): వరద బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉండి, ఆదుకుంటుందని మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హన్మంతరావు భరోసా కల్పించారు. శుక్రవారం ఆయన మున్నేరు పరివాహక కాలనీల్లో పర్యటించి, వరద బాధితులను పరామర్శించారు. పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో పర్యటించి ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కూసుమంచి మండలం నాయకన్‌గూడెంలో వరదలో కొట్టుకుపోయిన యాకూబ్ సైదాబీ కుటుంబాన్ని  పరామర్శించి, తనవంతు సాయంగా రూ.50వేల ఆర్థిక సాయం అందించారు. ఈ సందర్బంగా వీహెచ్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి అందాల్సిన  సాయాన్ని త్వరలోగా అందేలా  కృషి చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో వరద బాధితులకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. 

ప్రకాశ్‌నగర్ వంతెన మూసివేత 

వరదలకు పూర్తిగా దెబ్బతిన్న ఖమ్మం ప్రకాశ్‌నగర్ వంతెనపై రాకపోకలను నిలిపేశారు. భారీగా వచ్చిన వరదలు, నీటి ప్రవాహానికి వంతెన ఫిల్లర్లు, స్పాన్‌లు కదలడంతో పాటు వంతెన ఒక వైపుగా ఒరిగింది. దీంతో ఆర్‌అండ్‌బీ అధికారులు ఆ వంతెన మీదుగా శుక్రవారం నుంచి రాకపోకలు నిలిపివేశారు. వాహనాలు రాకుండా వంతెనపై ఇరువైపులా రాతిగోడను నిర్మించారు.

ఈ వంతెన పైనుంచి నిత్యం హైదరాబాద్, సూర్యాపేట, కోదాడ, చుట్టుపక్కల గ్రామాలకు, ముదిగొండ మండల కేంద్రం వైపు నిత్యం వందలాది వాహనాలు తిరుగుతుంటాయి. ప్రస్తుతం మరమ్మతుల కారణంగా 6 నెలల పాటు వాహనరాకపోకలు నిలుపుదల చేశారు. ఉమ్మడి ఏపీలో 2011లో మున్నేరు వాగుపై ఈ వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి, 2013లో అందుబాటులోకి తెచ్చారు. ప్రకాశ్‌నగర్ వంతెనకు 21ఫిల్లర్లు ఉన్నాయి. ఆరు స్పాన్లు ఉన్నాయి. దాదాపు 350 మీటర్ల  పొడవున్న ఈ వంతెన పైనుంచి దాదాపు ఒక లక్షా 30వేల క్యూసెక్కుల వరద ప్రవహించింది.

అంత వరద ఒకే వచ్చేసరికి వంతెన స్పాన్లు, ఫిల్లర్లు తట్టుకోలేక పక్కకు ఒరిగినట్లు సమాచారం. వరదలు వచ్చినప్పుడు ఈ వంతెనపైనే 9 మంది చిక్కుకోగా, వెంకటగిరికి చెందిన జేసీబీ డ్రైవర్ ధైర్యం చేసి కాపాడారు. దీనిని మూసి వేయడం వల్ల అనేక వ్యయప్రయాసలకోర్చి కోదాడ క్రాస్‌రోడ్డు, వరంగల్ క్రాస్ రోడ్డు మీదుగా ఖమ్మం చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉంటే కరుణగిరి వద్ద ఇదే మున్నేరుపై నిర్మించిన వంతెనకు కూడా పగుళ్లు వచ్చాయి .ప్రకాశ్‌నగర్ వంతెన రిపేర్లు పూర్తి అయిన తర్వాత కరుణగిరి వంతెనకు మరమ్మతులు చేయనున్నారు. ప్రకాశ్‌నగర్ వంతెన మూసివేతతో ప్రజలకు తీవ్ర ఇబ్బందులు తప్పవు.