- విద్యార్థుల చావులు ప్రభుత్వ హత్యలే!
- మాజీ మంత్రి హరీశ్‌రావు
హైదరాబాద్, నవంబర్ 17 (విజయక్రాంతి): గురుకులాల్లో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం మొద్దు నిద్ర వీడకపోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఆదివారం ఎక్స్‌వేదిక స్పందిస్తూ.. 11 నెలల పాలనలో 42మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు.
సీఎం మాటలు కోటలు దాటుతున్నా చేతలు మాత్రం గడప దాటడం లేదన్నారు. గురుకుల భోజనంలో నాణ్యత లేకుంటే జైలుకే అని సీఎం ప్రగల్బాలు పలకడం తప్ప, కార్యాచరణ చేపట్టలేదన్నారు. సంగారెడ్డి జిల్లా బీసీ బాలికల గురుకులంలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడం కలచివేసిందన్నారు.
ఈ చావులు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని, దీనికి రేవంత్‌రెడ్డి బాధ్యత వహించాలన్నారు. బాసరలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని బలవన్మరణానికి పాలకులే కారణమన్నారు. బీఆర్‌ఎస్ పాలనలో దేశానికి రోల్ మోడల్‌గా నిలిచిన గురుకులాలు, కాంగ్రెస్ పాలనలో దిగజారిపోతున్నా య న్నారు.
ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహించే శాఖల పరిస్థితే ఇలా ఉంటే.. మిగతా శాఖల పనితీరు గురించి చెప్పాల్సిన పనిలేదని ఎద్దేవాచేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.10లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలి
కౌలు రైతులకు రైతుభరోసా దేవుడెరుగు.. వారు పండించిన పత్తిని మద్దతు ధరకు ఆమ్ముకోలేని దుస్థితిలో ఉన్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలు పత్తి పండించిన కౌలు రైతుల సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని ఎక్స్ వేదికగా డిమాండ్ చేశారు.