calender_icon.png 29 October, 2024 | 3:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూములు హాం ఫట్!

29-10-2024 01:19:35 AM

  1. రికార్డుల్లో భద్రం.. క్షేత్రస్థాయిలో కబ్జా
  2. భద్రాద్రి జిల్లాలో భూబకాసురుల విశ్వరూపం
  3. 1.24 లక్షల సర్కార్ భూమిలో.. 25శాతం అన్యాక్రాంతం
  4. అత్యధికంగా పాల్వంచ పారిశ్రామిక వాడలో..
  5. పట్టించుకోని రెవెన్యూ అధికారులు

భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 27 (విజయక్రాంతి):  భద్రాద్రి జిల్లాలో వేలాది ఎకరాల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమైంది. ఏజెన్సీ ప్రాంతం కొత్త జిల్లాగా ఏర్పడిన తర్వాత భూముల ధరలు అమాంతం పెరగడంతో గత నాలుగైదు సంవత్సరాల నుంచి కబ్జాకోరులు కోరలు విప్పారు.

ప్రభుత్వ భూమి ఎక్కడ కనపడితే అక్కడ పాగా వేశారు. అధికార యంత్రాంగానికి మామూళ్లు ముట్టజెప్పి, రాజకీయ నేతల అండదండలతో భూ మిని లాగేసుకున్నారు. అందుకు అవసరమైతే తప్పుడు సర్వే నంబర్లు సృష్టించారు. కొందరైతే ఏకంగా వెంచర్లే వేశారు.

కొత్తగూడెం జిల్లాకేంద్రంలోని ప్రైమ్ ఏరియాతో పాటు సింగరేణి భూములు, పాల్వంచ, చుం చుపల్లి, లక్ష్మీదేవిపల్లి, బూర్గంపహాడ్, సుజాతనగర్, అశ్వారావుపేట మండలాల్లో కబ్జాలు మరీ ఎక్కువగా ఉన్నట్లు ఆర్టీఐ నుంచి అంది న రెవెన్యూ లెక్కలను పరిశీలిస్తే తెలుస్తున్నది.

జిల్లాలో భూములు ఇలా..

జిల్లావ్యాప్తంగా 23 మండలాల్లో అంతా కలిపి 18 లక్షల ఎకరాల భూమి ఉండేది. గత ప్రభుత్వం భూరికార్డుల ప్రక్షాళన నిర్వహించి జిల్లాలో 17,03,181 ఎకరాల భూమిని పరిశీలించింది. దీనిలో 14,70,568.19 ఎకరాల పరిధిలో ఎలాంటి భూ వివాదాలు లేవని నిర్ధారణకు వచ్చింది.

ఈ భూమిలో 10,18,323 ఎకరాలు అటవీ ప్రాంతం అని తేలింది. మరో 2,19,694 ఎకరాల భూమి వ్యవసాయభూమి అని పక్కా అయింది. ఇక మిగిలిన 1,25,757 ఎకరాల భూమి ప్రభుత్వ భూమి అని, దీనిలో సుమారు 25శాతం భూములు అన్యాక్రాంతమైందని ఓ అంచనా.

పర్యవేక్షణ కరువు..

గతంలో గ్రామస్థాయిలో వీఆర్‌వో వ్యవస్థ బలంగా ఉండేది. వీఆర్వోలు వారి పరిధిలోని భూమిపై నిఘా ఉంచేవారు. గత ప్రభుత్వం వీఆర్వో వ్యవస్థను రద్దు చేసిన తర్వాత అంతా పర్యవేక్షణ బాధ్యతలు పూర్తిగా తహసీల్దార్‌కు వెళ్లాయి. వారికున్న పనుల్లో భూముల పర్యవేక్షణ మరో పెద్దపని కావడంతో క్రమంగా సర్కార్ భూములు అన్యాక్రాంతమయ్యాయి.

ఒకే సర్వే నంబర్.. రెండు విధాలా వివరాలు..

పాల్వంచ పరిధిలో భూవివాదం డబ్ల్యూపీ నంబర్ కేసు 28,551/2019 కేసు విషయంలో అప్పటి కలెక్టర్ కోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం ఓ సర్వే నంబర్‌లో 2,500 ఎకరాల భూమి ఉందని, దీనిలో 1,790 ఎకరాల రిజర్వ్‌ఫారెస్ట్ భూమి, 605 ఎకరాల గిరిజనుల అసైన్డ్ భూమి ఉండగా, సుమారు 85 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది.

ఓ వ్యక్తి సమాచార హక్కు ద్వారా.. రెవెన్యూశాఖను వివరాలు కోరగా.. ‘ఆ సర్వే నంబర్‌లో మొత్తం 23,500 ఎకరాల భూమి ఉంది. దీనిలో 107 ఎకరాల ప్రభుత్వ భూమి, సుమారు 495 ఎకరాల ఎస్సైన్ డ్ భూమి, 1,750 ఎకరాల రిజర్వ్ ఫారెస్ట్  భూములు ఉన్నాయి’ అని సమాధానం వచ్చింది. ఒకే సర్వే నంబర్‌లో గణాంకాల విషయంలో ఇలాంటి వ్యత్యాసాలెంటని స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.

ఇదే పరిస్థితి మిగిలిన 444, 999, 826, 827 సర్వే నెంబర్లలో నెలకొన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గతంలో జిల్లాలో కలెక్టర్‌గా పనిచేసిన రజత్‌కుమార్ శైనీ ప్రభుత్వ భూముల పరిరక్షణకు కొంత చొరవ తీసుకున్నారు. అనుకున్నట్లుగానే కొంత సర్కార్ భూమిని గుర్తించారు. ఆయా భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి చుట్టూ ఫెన్సింగ్ సైతం ఏర్పాటు చేశారు.

ఆయన బదిలీ అయిన తర్వాత మళ్లీ షరా మామూలే అయింది. తాజాగా 817 సర్వే నంబర్‌లో నిర్మించిన హెచ్ కన్వర్షన్ హాల్ వైనం వెలుగు చూసింది. ఓ వ్యక్తి 817/58 సర్వే నంబర్‌లో భూములు కొనుగోలు చేసినటుట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ సమర్పించి, 817/1లోని ప్రభుత్వ భూమిని ఆక్రమించి అక్రమంగా హెచ్ కన్వర్షన్ హాల్ నిర్మించాడని స్థానికంగా చర్చ నడుస్తోంది.

అటువైపు వెళ్లే రోడ్డుకు సైతం సోములగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 61ని  ఆక్రమించినట్లు సమాచారం. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జిల్లాలోని అన్ని మండలాల్లో భూ సర్వే చేపట్టాలని, హైడ్రా తరహా విధానాన్ని అమలు చేసి ప్రభుత్వ భూములను కాపాడాలని జిల్లావాసులు కోరుతున్నారు.