calender_icon.png 4 October, 2024 | 12:56 PM

మత్స్యకారులకు సర్కారు అండ

04-10-2024 12:35:08 AM

చేప పిల్లలు ఉత్పత్తితో ఉపాధి పెంచుకోవాలి

రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

కరీంనగర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి): చేప పిల్లలు ఉత్పత్తి చేసి మత్స్యకారులు ఉపాధి పెంచుకోవాలని, రేవంత్‌రెడ్డి ప్రభు త్వం మీకు అండగా ఉంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. గురువారం కరీంనగర్ లోయర్ మా నేరు డ్యాంలో మంత్రి జలాలకు పూజలు చేసి, చేప పిల్లలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ.. కులవృత్తులు ఉపాధి పొందాలని సీఎం రేవంత్‌రెడ్డి పట్టుదలతోనే చేప పిల్లల విడుదల కార్యక్రమం ప్రారంభం అయ్యిందని తెలిపారు. చేప పిల్లలు ఎంత ఉత్పత్తి జరిగితే అంత మత్స్యకారుల కుటుంబాలకు ఉపాధి దొరుకుతుందన్నారు. సరఫరాకు సంబంధించిన సమస్య ఉందని, పాత బకాయిలు చాలా ఉన్నాయని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బడ్జెట్ సమావేశంలో సమీక్ష చేస్తుంటే చెల్లించాల్సిన బిల్లు లు రూ.40 వేల కోట్లు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తించామని తెలిపారు. మానేరులో 60 లక్షల చేప పిల్లల కెపాసిటీ ఉందని అన్నారు. ఈ ప్రాంతంలో చేపపిల్లల ఉత్పత్తిలో కరీంనగర్ ఉత్తర తెలంగాణలోనే పెద్ద దని చెప్పారు.

హుస్నాబాద్‌లో అన్ని చెరువుల్లో కూడా చేప పిల్లల పంపిణీకి మూడు జిల్లాల అధికారులతో మాట్లాడి ఉపాధి కల్పించేలా చేస్తున్నామన్నారు. మోపెడ్ వాహనాలు, ఐకేపీ సంఘాల ద్వారా మార్కెటింగ్ కోసం ఆటోలు ఇస్తున్నామని పేర్కొ న్నారు. ఎంఎస్‌ఎంఈ పాలసీలో తెలంగాణలోని అన్ని కులవృత్తులను పెడుతున్నామని, మొన్ననే వృత్తుల మేధావులను పిలిచి సమావేశం నిర్వహించామని స్పష్టంచేశారు.

కొత్త సభ్యత్వాలపై అర్హత సంఘాలు, అనర్హులు కాకుండా ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ఐక్యంగా ఉండి ముందుకు పోవాలన్నారు. ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వల్లే చేప పిల్లల పంపిణీ సాధ్యమయిందని అన్నారు.

కార్యక్రమంలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, మేయర్ సునీల్‌రావు, ఫిషరీస్ కమిషనర్ ప్రియాంక, కలెక్టర్ పమేలా సత్పతి, మత్స్య పారిశ్రామిక సంఘం జిల్లా చైర్మన్ పిట్టల రవీందర్, నాయకులు వెలిచాల రాజేందర్‌రావు, పురుమల్ల శ్రీనివాస్, వొడితెల ప్రణవ్ తదితరులు పాల్గొన్నారు. 

రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు..

రాష్ట్రంలో ఆధార్ కార్డులాగా ప్రతి కుటుంబానికి డిజిటల్ కార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలోని తాహేర్ కొండాపూర్‌లో ఫ్యామిలీ డిజిటల్ కార్డు నమోదు కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. స్వయంగా మంత్రి పలు నివసాలకు వెళ్లి వివరాలు నమోదు చేశారు.