calender_icon.png 24 October, 2024 | 11:58 PM

గోవిందమ్మా.. యూఆర్ గ్రేటమ్మా

10-09-2024 02:30:00 AM

వనపర్తి జిల్లా పెబ్బేరు టౌన్.. ఎప్పుడైనా అటు వెళ్తే.. మన కళ్లముందు ఓమ్నీ మినీ వ్యాన్ రయ్‌మంటూ గల్లీల్లో దూసుకుపోతుంటోంది. ఇంతకీ ఆ ఓమ్నీ స్పెషల్ ఏమిటంటారా.. ఆ డ్రైవర్ ఓ లేడీ. ఆమె వయసు 48. ఆ వయసులో డ్రైవర్‌గా ఎందుకు మారిందనుకుంటున్నారా.. చిన్న వయసులోనే భర్త దూరమైనా.. కుటుంబానికి అన్నీతానై అండగా నిలబడింది. ఆమెను ఒకసారి కలిస్తే.. ‘గోవిందమ్మా.. యూఆర్ గ్రేటమ్మా..’ అని మీరే అంటారు.

జీవితం అంటేనే కష్టాలు.. కన్నీళ్లు.. వాటిని తట్టుకొని నిలబడినవారే సక్సెస్ అవుతారు. గోవిందమ్మ జీవితంలో ఎన్నో కష్టాలు.. కన్నీళ్లున్నాయి. ఆమె జీవిత కథను రాస్తే పుస్తకం అవుతుంది.. తీస్తే డాక్యుమెంటరీ కూడా అవుతుంది. ఇవన్నీ తెలుసుకోవాలంటే.. గోవిందమ్మ జీవితం గురించి తెలుసుకోవాల్సిందే.. వనపర్తి జిల్లా పెబ్బేర్ మున్సిపాలిటి 2వ వార్డుకు చెందిన ఒలియదాసరి గోవిందమ్మది నిరుపేద కుటుంబం.

ఆమెకు ఆక్షరం ముక్క రా దు. చిన్నప్పట్నుంచే కష్టాన్ని నమ్ముకున్నది. తండ్రి నెత్తిన మూటలు పెట్టుకొని చీరలు అమ్మేవాడు. గోవిందమ్మ కూడా తండ్రిలా గే నెత్తిన మూటలు పెట్టుకొని జీవితం కొనసాగించింది. గోవిందమ్మ కష్టాన్ని చూసి చాలామంది పెళ్లి చేసుకోవాలని ముందుకొచ్చారు. అయినా కుటుంబ సభ్యుల చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకుంది. సీన్ కట్ చేస్తే.. ముగ్గురు మగ పిల్లలు. 

ఇద్దరు పిల్లలు దివ్యాంగులు

దేవుడి శాపమో.. విధిరాతనో ఏమోకానీ.. వారిలో ఇద్దరు దివ్యాంగులే..  పిల్లల బాధలు అయినా గోవిందమ్మ ఏనాడు దిగులు పడలేదు. ఏ ఒక్కరోజు భారంగా భావించలేదు. భర్త విడిచిపెట్టిపోయినా.. అత్తింటివారు సహకారం అందించలేకపోయినా పిల్లల బాధ్యత తీసుకుంది. తన తండ్రిలానే నెత్తిన చీరల మూటలు పెట్టుకొని ఊరూరు తిరిగింది. ఎన్నో కష్టాలు పడింది. పిల్లల కోసం ఉదయాన్నే 4 గంటలకు లేచి వాళ్ల అన్నం వండి, తినిపించి వ్యాపారం చేసుకునేది. ఇలా ప్రతిరోజు ఆమె దినచర్య సాగేది.

కానీ ఏనాడు ముగ్గరు పిల్లలను భావించలేదు. అయితే తనకంటూ సొంత ఇళ్లు లేకపోవడంతో ఓ చెరువు కట్టపై గుడిసే వేసుకొని బతుకు పోరాటం చేసింది. అయితే పిల్లలు పెద్దొళ్లు అయ్యారు. పరిస్థితులకు తగ్గట్టే ఖర్చులు ఎక్కువయ్యాయి. ఇక గోవిందమ్మ మలి వయసులో నెత్తిన చీరలు పెట్టుకొని అమ్మడం కష్టంగా మారింది. పిల్లల భవిష్యత్తు కోసం మళ్లీ ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. 

ఓమ్నీ కారే.. షాపింగ్ మాల్

పిల్లలు ఖర్చులు పెరుగుతుండటంతో కొత్తగా ఏదైనా చేయాలని ఫైనాన్స్ ద్వారా ఓమ్నీ కారు కొన్నది. ఓమ్నీకారును షాపిం గ్ మాల్‌గా మార్చేసింది. అందులో పిల్లల నుంచి పెద్దల వరకు (పిల్లలు ఆడుకునే ఆట వస్తువుల నుంచి మహిళలు వాడే వంట సామాగ్రి వరకు) దొరకని వస్తువు అంటూ ఉండదు. అయితే నిత్యం ఒకే దగ్గర వ్యాపారం చేస్తే సరిపడ డబ్బులు రాకపోవడంతో.. డ్రైవింగ్ నేర్చుకుంది. ప్రస్తుతం వనపర్తి జిల్లా అంతటా కలియతిరుగూ.. వస్తువులను అమ్ముతూ జీవిస్తోంది. హైదరాబాద్‌కు తన కొడుకుతో కలిసి వెళ్లి కావాల్సిన సామాన్లు తెచ్చి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోని జాతలు, పండుగల్లో ఆ వస్తువులను అమ్ముకుంటోంది. ఫలితంగా ఇద్దరు పిల్లలు డిగ్రీ చదువుతున్నారు. త్వరలో ప్రయోజకులు అయ్యేస్థాయికి చేర్చింది గోవిందమ్మా.