calender_icon.png 17 November, 2024 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మళ్లీ తెరపైకి గవర్నర్ల వివాదం

27-07-2024 12:05:00 AM

ప్రతిపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలకు, గవర్నర్లకు మధ్య వివాదం మరోసారి సుప్రీంకోర్టుకు చేరింది. అసెంబ్లీలు ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపకుండా గవర్నర్లు పెండింగ్‌లో పెట్టడం, రాష్ట్రపతి సమీక్షకు పంపించడంపై కేరళలో అధికారంలో ఉన్న సీపీఎం ప్రభుత్వం, పశ్చిమ బెంగాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సర్కార్ సుప్రీంకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశాయి. గవర్నర్ల చర్య రాజ్యాంగ విరుద్ధమని ఆ రాష్ట్రాలు వాదించాయి. ఈ పిటిషన్లను విచారించిన చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం గవర్నర్ల కార్యదర్శులతోపాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖలకు నోటీసులు జారీ చేసింది. మూడు వారాల్లో నోటీసులకు సమాధానం తెలపాలన్న న్యాయస్థానం రెండు రాష్ట్రాలు కలిసి ఒకే పిటిషన్‌ను దాఖలు చేయాలని సంబంధిత రాష్ట్రప్రభుత్వాలను ఆదేశించింది.

నిజానికి కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద్ బోస్‌లకు, ఆయా రాష్ట్రప్రభుత్వాలకు మధ్య గత కొంతకాలంగా వివాదాలు నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో ఆ రెండు రాష్ట్రాలు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. దీర్ఘకాలం బిల్లులను పెండింగ్‌లో పెట్టడం సరికాదంటూ గతంలో ఒకసారి సుప్రీంకోర్టు కేరళ గవర్నర్‌ఆరిఫ్ మహ్మద్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది. మూడేళ్లుగా బిల్లులు పెండింగ్‌లో పెట్టడంపై మండిపడిన సర్వోన్నత న్యాయస్థానం ఇన్ని రోజులు ఏం చేస్తున్నారంటూ నిలదీసింది. దీంతో ఆయన ఆ బిల్లులన్నిటినీ రాష్ట్రపతి సమీక్షకోసం పంపించారు. పశ్చిమ బెంగాల్ గవర్నర్ బోస్‌కూడా ఇదే పని చేశారు.

గవర్నర్ల చర్య రాజ్యాంగ విరుద్ధమంటూ ఆ రాష్ట్రప్రభుత్వాలు మరోసారి సుప్రీంకోర్టు తలుపు తట్టాయి. తమిళనాడులో ఎంకె స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ప్రభుత్వం, అలాగే పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం కూడా తమ రాష్ట్రాల గవర్నర్ల తీరుపై గతంలో సుప్రీంకోర్టు కెక్కాయి. అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి పది బిల్లులను ఆమోదించి గవర్నర్  సీవీ రవి ఆమోదం కోసం పంపించినా ఆమోదం తెలపకపోవడంపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై గవర్నర్ తీరుపట్ల సర్వోన్నత న్యాయస్థానం తీవ్రస్థాయిలో మండిపడింది. దీంతో ఆయన మొత్తం బిల్లులను రాష్ట్రపతికి పంపేసి చేతులు కడుక్కున్నారు.

ఇక, ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వానికి, లెఫ్టెనెంట్ గవర్నర్ సక్సేనా మధ్య వివాదం ఒకటికంటే ఎక్కువసార్లు సుప్రీంకోర్టుకు చేరింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే పూర్తి అధికారాలు ఉంటాయని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వానికి, ఆ రాష్ట్ర గవర్నర్ భన్వర్‌లాల్ పురోహిత్‌కు మధ్యకూడా ఇదే తరహా వివాదం కొనసాగుతున్నది. 

నిజానికి గవర్నర్లకు, ప్రతిపక్ష పాలిత రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య వివాదం కొత్తేమీ కాదు. గతంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై, అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికి మధ్య దీర్ఘకాలం కొనసాగిన వివాదం అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో అధికార మార్పిడి జరగడంతోపాటు లోక్‌సభ ఎన్నికలకు ముందు ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనడం కోసం తమిళిసై తన పదవికి రాజీనామా చేసేదాకా ఈ వివాదం కొనసాగుతూనే వచ్చింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు వివాదాస్పదంగా మారుతుండడం ఫెడరల్ వ్యవస్థకు ఎంతమాత్రం శ్రేయస్కరం కాదు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలకు గవర్నర్లు అడ్డ్డు తగలడం సరికాదని  సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పినా వారి తీరులో మార్పు మాత్రం రావడం లేదు. ఈ కారణంగానే అసలు గవర్నర్ వ్యవస్థపైనే గౌరవం లేకుండా పోయే పరిస్థితి ఎదురవుతున్నది. అధికార పార్టీ నేతలకు పునరావాసంగా మారుతున్న ఈ గవర్నర్ వ్యవస్థనే రద్దు చేయాలన్న డిమాండ్ కూడా వినిపిస్తున్నది.