దేశంలో గవర్నర్ల వ్యవస్థ రానురాను వివాదాస్పదంగా మారుతోంది. ముఖ్యంగా విపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లుగా ఉన్న వారు అక్కడి ప్రభుత్వాలకు పలు చిక్కులు కలిగిస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పటి గవర్నర్ రామ్‌లాల్ వ్యవహరించిన తీరు అందరికీ తెలిసిందే. గవర్నర్ల వ్యవహార శైలిపై అప్పుడు మొదలైన వివాదం ఆ తర్వాత కూడా అడపాదడపా తెరపైకి వచ్చినా అంతగా చర్చనీయాంశం కాలేదు.
కానీ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టిన తర్వాత ఇది తీవ్రరూపం దాల్చింది.
కేజ్రీవాల్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అక్కడి లెఫ్టినెంట్ గవర్నర్ మోకా లడ్డడం, ఆప్ ప్రభుత్వం న్యాయస్థానాల మెట్లు ఎక్కడం పరిపాటిగా మారింది. కోర్టు జోక్యం లేకుండా మీరు సమస్యను పరిష్కరించుకోలేరా అంటూ ఒక దశలో సుప్రీం కోర్టు గట్టిగా చురకలు వేసింది కూడా. అది క్రమంగా దక్షిణాదిన కేరళ, తమిళనాడుకు, ఆప్ అధికారంలో ఉన్న రాష్ట్రం పంజాబ్‌కుకూడా పాకింది. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి, అప్పటి రాష్ట్ర గవర్నర్(ప్రస్తుత ఉపరాష్ట్రపతి) జగదీప్ ధన్‌క ర్‌కు మధ్య గతంలో నిత్యం ఏదో ఒక విషయంపై వివాదం కొనసాగుతూనే వచ్చింది.
తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి, కేరళ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్‌లు బాధ్యతలు చేపట్టి నప్పటినుంచీ అక్కడి రాష్ట్ర ప్రభుత్వాలకు కొరకరాని కొయ్యలుగా మారారు. నిత్యం ఏదో ఒక అంశంపై రాష్ట్రప్రభుత్వాలకు చికాకు తెప్పిస్తూనే ఉన్నారు. ఇది ఎంతదాకా వెళ్లిందంటే ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆప్‌తో పాటుగా తమిళనాడులో డిఎంకె ప్రభుత్వం, కేరళలో విజయన్ నేతృత్వంలోని ఎల్‌డిఎఫ్ సర్కార్ గవర్నర్ల పని తీరుపై సుప్రీంకోర్టు తలుపులు తట్టాల్సి వచ్చింది. గవర్నర్లు రాజ్యాంగానికి అతీతులు కారని, వారు ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలతో సమన్వయంతో పని చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ గవర్నర్ల వైఖరిలో ఎలాంటి మార్పూ కనిపించ లేదు.
పొమ్మడి వివాదం
తాజాగా తమిళనాడులో అక్రమాస్తుల కేసులోమంత్రి వర్గంనుంచి తొలగించిన పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలో నియమించాలని తాము ఇచ్చిన ఆదేశాలను పాటించని గవర్నర్ రవి తీరుపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. కింది కోర్టు విధించిన మూడేళ్ల జైలు శిక్షను నిలిపి వేసిన సర్వోన్నత న్యాయస్థానం ఆయనను తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ఇటీవల ఆదేశించింది. అయితే పొన్ముడిని తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి స్టాలిన్ సిఫార్సు చేసినా గవర్నర్ అందుకు అంగీకరించలేదు. దీంతో గవర్నర్ తీరుపై తమిళనాడు ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్రప్రభుత్వ పిటిషన్‌ను విచారించిన సర్వోన్నత న్యాయస్థానం గవర్నర్ రవి తీరుపై మండిపడింది. గవర్నర్ సుప్రీంకోర్టు ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారని పేర్కొన్న సిజెఐ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
శిక్షను నిలిపివేసిన తర్వాత తొలగించిన మంత్రిని తిరిగి కేబినెట్‌లో చేర్చుకోవడం సంప్రదాయమని, దీన్ని గవర్నర్ ఎందుకు పాటించరని బెంచ్ ప్రశ్నించింది. అంతేకాదు, మనకు చట్టాలు వర్తించవా? మీరేమైనా దానికి అతీతమా? గవర్నర్ రాష్ట్రానికి పేరుకే అధిపతి కానీ ఆయన ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం నిర్ణయాల మేరకు నడుచుకోవాలని సిజెఐ డివై చంద్రచూడ్ మరోసారి స్పష్టం చేశారు. గవర్నర్ గనుక కోర్టు ఆదేశాలను పాటించని పక్షంలో తాము చర్య తీసుకోవలసి వస్తుందని కూడా హెచ్చరించారు. ముఖ్యమంత్రి సిఫార్సులను పాటిం చడానికి గవర్నర్‌కు ఒక రోజు సమయం ఇస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.
దీంతో దిగివచ్చిన గవర్నర్ హడావుడిగా శుక్రవారం పొన్ముడి చేత మంత్రిగా ప్రమాణం చేయించారు. ఇటీవల తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలనుద్దేశించిన ప్రసంగించాల్సిన గవర్నర్ తన ప్రంగపాఠం పూర్తిగా రాష్ట్రప్రభుత్వ అజెండాగా ఉందని అంటూ ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేసి సభనుంచి వెళ్లిపోయారు కూడా.
మిగతా రాష్ట్రాల్లోనూ
ఇది ఒక్క తమిళనాడు సమస్యే కాదు. చాలా రాష్ట్రాల్లో గవర్నర్ల తీరుపై అక్కడ అధికారంలో ఉన్న ప్రభుత్వాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు అనేకం. తెలంగాణలో కూడా మొన్నటిదాకా గవర్నర్‌గా ఉన్న తమిళిసైకు, కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్‌ఎస్ ప్రభుత్వానికీ మధ్య చాలా రోజులు వివాదం నడి.చిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం మిగతా రాష్ట్రాలకు కాస్త భిన్నమైనది. ఇక్కడ ముఖ్యమంత్రితో పాటుగా బీఆర్‌ఎస్ మంత్రు లెవరు కూడా తనకు ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వలేదని గవర్నర్ బహిరంగంగానే ఆరోపించారు. ఆమె పర్యటనల కోసం కనీసం హెలికాప్టర్‌ను సమకూర్చడం కానీ, ప్రోటోకాల్ పాటించడం లేదని, రాఫ్ట్రప్రభుత్వ కార్యక్రమాలకు చివరికి స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవం లాంటి జాతీయ వేడుకలకు సైతం ఆహ్వానించకుండా అవమానించారని ఆమె ఆరోపించారు. .
గవర్నర్ కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారని, రాజ్‌భవన్ బిజెపి కార్యాలయంగా మారిపోయిందని బీఆర్‌ఎస్ నేతలు ప్రత్యారోపణలు చేసేవారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ ఓటమి పాలయి కేసీఆర్ గద్దె దిగేదాకా ఇరువురి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. ఇలాంటి కారణాలచేతనే ఒకానొక సమయంలో కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో నడుచుకునే గవర్నర్ల వ్యవస్థను రద్దు చేయాలని విపక్షాలు డిమాండ్ చేశాయి.
సర్కారియా సిఫార్సులు
గవర్నర్ల నియామకానికి సంబంధించి గతంతో సర్కారియా కమిషన్ స్పష్టమయిన పిఫార్సులు చేసింది. గవర్నర్‌గా నియమించబడే వ్యక్తి ప్రజా జీవితంలో దీర్ఘ కాలం పని చేసిన వ్యక్తి అయి ఉండాలని స్పష్టంగా పేర్కొంది.అంతేకాకుండా ఒక రాష్ట్ర గవర్నర్‌గా నియమించబడే వ్యక్తి బయటి రాష్ట్రానికి చెందిన వారయి ఉండాలని పేర్కొంది. ఆయన పదవీ కాలానికి గ్యారంటీ ఉండాలని, ఉపరాష్ట్రపతి, లోక్‌సభ స్పీకర్‌తో పాటుగా సంబంధిత రాష్ట్రముఖ్యమంత్రిని సంప్రదించిన అనంతరం గవర్నర్ నియామకం చేపట్టాలని కూడా కమిషన్ తన నివేదికలో స్పష్టం చేసింది.
అలాగే గవర్నర్ పదవినుంచి వైదొలగిన అనంతరం ఆ వ్యక్తి కొంత కాలం పాటయినా ఇతర పదవులకు దూరంగా ఉండాలని, అయితే రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి లాంటి పదవుల విషయంలో మాత్రం దీనికి మినహాయింపు ఉండాలని స్పష్టంగా పేర్కొంది. కేంద్రం రాష్ట్రాల మధ్య సంబంధాలకు సంబంధించిన పలు అంశాలను పరిశీలించి మార్గదర్శకాలను సిఫార్సు చేయడం కోసం 1983లో ఆర్ ఎస్ సర్కారియా అధ్యక్షతన ఏర్పాటయిన ఈ కమిషన్ ఎన్నో విలువైన సిఫార్సులు చేసింది.
కానీ వాటిలో దేన్ని కూడా ఇప్పుడు ప్రభుత్వాలు పాటించడం లేదు. నిన్నటిదాకా రాష్ట్రాల్లో, కేంద్రంలో పదవులు అనుభవిస్తూ వచ్చిన వ్యక్తులు హటాత్తుగా గవర్నర్లుగా నియమితులయిపోతున్నారు. అలాగే గవర్నర్లుగా ఉన్న వారు సైతం తమ పదవులకు రాజీనామా చేసి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. ఇలాంటి వాటి గురించి ఏ పార్టీ కూడా ప్రశ్నించడం లేదు. ఎందుకంటే రేపు తాము అధికారంలోకి వచ్చినప్పుడు అవి కూడా ఇదే విధంగా ప్రవర్తించవన్న గ్యారంటీ ఏమీ లేదు. తమదాకా వచ్చినప్పుడు మాత్రం గోల చేస్తున్నాయి.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం కోసం శాశ్వతంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని కూడా సర్కారియా కమిషన్ సిఫార్సు చేసింది. ఇప్పుడు అనేక రాష్ట్రాల్లో గవర్నర్లు, రాష్ట్రప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న అనేక వివాదాలను అలాంటి వ్యవస్థ పరిష్కారం కాగలదు.
కె.రామకృష్ణ