12-03-2025 11:19:15 AM
ప్రారంభమైన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
ప్రజలే కేంద్రంగా పాలన
హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు(Telangana Assembly Budget Sessions) బుధవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma Speech) ప్రసంగిస్తున్నారు. తెలంగాణ ప్రజల కలల సాకారానికే ఈ బడ్జెట్, ప్రజలే కేంద్రంగా పాలన సాగుతోందని గవర్నర్ పేర్కొన్నారు. మా ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాభివృద్ధికి కట్టుబడి ఉందన్నారు. రైతులు, మహిళలు, యువతకు అన్ని విధాల సహకారం అందిస్తున్నామని చెప్పారు. అన్ని వర్గాల అభ్యున్నతికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందని గవర్నర్ స్పష్టం చేశారు.
రైతుల అభివృద్ధి కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఘనమైన సంస్కృతికి నిలయం తెలంగాణ, ప్రజల కోసం గద్దర్, అంజయ్య వంటి ఎందరో కృషి చేశారు. జననీ జయకేతనం రాష్ట్ర గీతంగా చేసుకున్నాం, సామాజికి న్యాయం, అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరించుకున్నాం. అభివృద్ధి, ప్రగతి వైపు తెలంగాణ అడుగులు వేస్తోంది. రాష్ట్రానికి రైతులే ఆత్మ.. వారి అభివృద్ధికి కృషి చేస్తున్నాం, ప్రజల కోసం నిరంతరం శ్రమించే వాళ్లే అన్నదాతలు, రాష్ట్ర అభివృద్ధిలో రైతుల భాగస్వామ్యం ఉందని గవర్నర్ తెలిపారు. రైతులకు మద్దతివ్వడం.. వారిని శక్తిమంతులుగా తీర్చిదద్దడమే మా బాధ్యతన్నారు. దేశంలోనే అత్యధికంగా ధాన్యం పండిస్తున్న రాష్ట్ర తెలంగాణ అన్నారు.