- ఈ సంవత్సరం నుంచే శ్రీకారం
- జనవరి 26న రాజ్‌భవన్‌లో ప్రదానం
- నాలుగు విభాగాల్లో గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్సలెన్స్
- రూ.2లక్షల ప్రైజ్‌మనీ కూడా అందజేత
- నేటి నుంచి దరఖాస్తులు స్వీకరణ
- గవర్నర్ కార్యదర్శి బుర్రా వెంకటేశం వెల్లడి
హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): ఇక నుంచి ఏటా గవర్నర్ అవార్డులను ప్రదానం చేయనున్నట్లు రాజ్‌భవన్ సెక్రటరీ బుర్రా వెంకటేశం తెలిపారు. గవర్నర్ అవార్డ్స్ ఫర్ ఎక్స్‌లెన్స్ కార్యక్రమానికి ఈ సంవత్సరం నుంచి శ్రీకారం చుడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.
శుక్రవారం రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గవర్నర్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఆయన ప్రకటించారు. వివిధ రంగాల్లో చేస్తున్న కృషికిగానూ వారిని ప్రోత్సహించడంతోపాటు గౌరవించాలనే ఉద్దేశంతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ నిర్ణయించినట్లు ఆయన తెలిపారు.
పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు, ఆటల విభాగం, సాంస్కృతిక విభాగాల్లో గత ఐదు సంవత్సరాలు (2019 నుంచి)గా తెలంగాణలో అభివృద్ధి కోసం కృషి చేస్తున్న వారికి వ్యక్తులు, సంస్థలకు మాత్రమే అవకాశం ఉంటుందన్నారు.
ఈ నాలుగు విభాగాల్లో రెండు కేటగిరీల అవార్డులుంటాయని, ఒక కేటగిరీలో వ్యక్తిగతంగా, మరో కేటగిరీలో ఆయా విభాగాల్లో అభివృద్ధి చేసిన సంస్థలు, సొసైటీలు, ట్రస్ట్‌లకు అవార్డులను అందజేయనున్నట్లు తెలిపారు. కింద రూ.2 లక్షల నగదు, ప్రశంసాపత్రం అందజేస్తామని వెల్లడించారు.
అవార్డులను జనవరి మొదటి వారంలో ప్రకటించి, జనవరి 26న రాజ్‌భవన్‌లో గవర్నర్ చేతుల మీదుగా ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు. శనివారం నుంచి ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.
ఈనెల 23వ తేదీ వరకు మాత్రమే దరఖాస్తులతోపాటు ఆయా నాలుగు విభాగాల్లో వారు చేసిన కృషి, సేవలకు సంబంధించిన పూర్తి ఆధారాలను జత చేయాలని, వచ్చిన దరఖాస్తులను జ్యూరీ కమిటీ స్క్రూటినీ చేసి అవార్డులకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.