calender_icon.png 18 January, 2025 | 4:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐలమ్మ మహిళా వర్సిటీకి గవర్నర్ ఆమోదం

18-01-2025 12:24:21 AM

  1. గెజిట్ విడుదల చేసిన సర్కార్
  2. యూజీసీ గుర్తింపునకు దరఖాస్తు చేయనున్న అధికారులు

హైదరాబాద్, జనవరి 17 (విజయక్రాంతి): వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీ బిల్లుకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం గెజిట్ జారీ చేసింది. దీంతో వర్సిటీ ఏర్పాటు ప్రక్రియలో తుది అంకం పూర్తయ్యింది. ప్రభుత్వం జీవోను జారీచేయడంతో ఇక యూజీసీ గుర్తింపునకు వర్సిటీ అధికారులు దరఖాస్తు చేయనున్నారు.

త్వరలోనే యూజీసీ గుర్తింపు లాంఛనమేకానుంది. అయితే ఇప్పటికే చదువుతున్న విద్యార్థులకు ఏ పేరుతో సర్టిఫికెట్లు ఇవ్వాలన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతుంది. దీనిపై అధికారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. ప్రతిష్ఠాత్మక కోఠి మహిళా కాలేజీని తెలంగాణ ఉమెన్ వర్సిటీగా అప్‌గ్రేడ్ చేస్తూ గత ప్రభుత్వం జీవో జారీచేసింది.

అప్పట్లో తెలంగాణ మహిళా యూనివర్సిటీగా ఈ యూని వర్సిటీకి నామకరణం చేశారు. ఇటీవల కాంగ్రెస్ సర్కార్ పేరుమార్చి, వీరనారి చాకలి ఐలమ్మ మహిళా వర్సిటీ అని పేరును ఖరారు చేసిన విషయం తెలిసిందే.

వర్సిటీ అభివృద్ధికి ఐదేండ్ల ప్రణాళిక..

వర్సిటీ అభివృద్ధికి ఐదేండ్ల ప్రణాళికలను రూపొందించినట్లు వైస్ చాన్స్‌లర్ ప్రొఫెసర్ సూర్యాధనుంజయ్ తెలిపారు. వర్సిటీకి రూ.100 కోట్ల బడ్జెట్‌తో పాటు, పోస్టుల మంజూరుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు చెప్పారు. ఇక డిగ్రీలో మొదటి ఏడాది విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించడం లేదని, డిగ్రీ ఫస్టియర్ పాటు, పీజీ విద్యార్థుల హాస్టల్ భవన నిర్మాణం చేపడతామన్నారు.

పరిపాలన భవనం సహా మౌలిక వసతులు కల్పించేందుకు సన్నాహలు చేస్తున్నట్లు చెప్పారు. కొత్త కోర్సులను ప్రవేశపెట్టడంలో భాగంగా ఇంజినీరింగ్, టెక్నాలజీ, లా, బీఈడీ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామన్నారు.

నైపుణ్యాలకు అధిక ప్రాధాన్యమిస్తూ స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక బీఎస్సీ నర్సింగ్, బీఎస్సీ ఫిజియోథెరపీ, సీఎస్‌ఈ -ఏఐఎంఎల్, డాటాసైన్స్ వంటి కోర్సులను సైతం ప్రవేశపెడతామని ఆమె తెలిపారు.