సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు మోతే రాజలింగు
మందమర్రి (విజయక్రాంతి): భారత రాజ్యాంగ రూపకల్పన ప్రాముఖ్యతను ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేయాలని సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ అధ్యక్షులు అడ్వకేట్ మోతే రాజలింగు కోరారు. సోమవారం క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిదిలో నిర్వహించిన సంఘం సమావేశంలో నవంబర్ 26 భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవం పురస్కరించుకొని ఆయన మాట్లాడారు. భారత రాజ్యాంగ రూప కల్పనకు 299 మంది సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేయగా, అందులో 15 మంది మహిళలకు చోటు దక్కడం విశేషం అన్నారు. దేశంలో స్వేచ్ఛ, సౌబ్రాతృత్వం, సమన్యాయం, ప్రజాస్వామ్యం పరిడవిల్లడానికి రెండేళ్ల 11 నెలల 18 రోజులపాటు శ్రమించిన అనంతరం అఖండ భారత్ కు లిఖిత రాజ్యాంగాన్ని అందించారన్నారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగ పరిషత్ దీనికి ఆమోదం తెలిపిందన్నారు. నేటి కాలం యువతకు రాజ్యాంగ దినోత్సవం అనేది ఉందని అసలేంత మందికి తెలుసని ఆయన ప్రశ్నించారు. జనవరి 26న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్న రోజు మాత్రమే తెలుసని, నవంబర్ 26 ప్రత్యేకత, దాని వెనుక గల ప్రాముఖ్యత చాలా తక్కువ మందికి తెలుసు అని అన్నారు. అటువంటి వారికి ఈరోజు ప్రాముఖ్యతను తెలియజేయడానికి ప్రభుత్వాలు విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు అడ్వకేట్ మారపాక మల్లేష్, ఆడెపు సురేందర్, నడిపెల్లి సునీల్ రావు, హనుమండ్ల రమేష్ లు పాల్గొన్నారు.