calender_icon.png 5 February, 2025 | 10:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్య రంగాన్ని సంక్షోభంలోకి నెడుతున్న ప్రభుత్వాలు

05-02-2025 07:16:47 PM

పి.డి.ఎస్.యు. రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ.. 

ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్..

భద్రాచలం (విజయక్రాంతి): దేశంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విద్యార్థి వ్యతిరేక విధానాల ఫలితంగా ప్రభుత్వ విద్యరంగం పూర్తిగా సంక్షోభంలో కూరుకు పోతున్నదని పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పెద్దింటి రామకృష్ణ, ప్రధాన కార్యదర్శి నామాల ఆజాద్ లు తెలిపారు. బుధవారం భద్రాచలం పట్టణంలో పి.డి.ఎస్.యు. తెలంగాణ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ సందర్భంగా భారీ విద్యార్థి ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పెద్దింటి రామకృష్ణ, నామాల ఆజాద్ లు మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్లు, సీట్లు, కుల, మత గణన లాంటి రాజకీయాలకు ఇస్తున్న విలువ ప్రభుత్వవిద్య రంగ బలోపేతానికి ఇవ్వటం లేదన్నారు. రాష్ట్రంలో దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు గత మూడు సంవత్సరాల నుండి పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ రాక అనేక ఆర్థికపరమైన అవస్థలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా పేద విద్యార్థుల భవిష్యత్, జీవితాలతో చెలగాటమాడుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాజ్యాంగంలోని ఫెడరల్ సూత్రాలకు విరుద్ధంగా, వివిధ రాష్ట్రాల పరిధిలో కొనసాగుతున్న విశ్వవిద్యాలయాల స్వయంప్రతిపత్తినీ దెబ్బతీసే సంస్కరణలు తీసుకువస్తున్నదని తెలిపారు. విశ్వవిద్యాలయాల అభివృద్ధికి సరిపడా నిధులు లేక, నాణ్యమైన పరిశోధనలు జరుగక, పరిశోధక విద్యార్థులకు ఫెలోషిప్ లు లేక విద్యావ్యవస్థ కుంకుపడుతున్నదని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని దేశంలో కార్పొరేట్ విద్యాసంస్థలను రద్దు చేసి, విద్య వ్యాపారాన్ని అరికట్టాలని, ప్రభుత్వ విద్య వ్యవస్థ బలోపేతానికి కేంద్ర బడ్జెట్లో 10%, రాష్ట్ర బడ్జెట్లో 30% నిధులు కేటాయించాలని, ఖాళీగా ఉన్న టీచర్, లెక్చరర్, ప్రొఫెసర్ పోస్టులన్నింటిని శాశ్వత ప్రతిపాదికన భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాలను హెచ్చరించారు. ఈ ర్యాలీలో అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య కళాకారులు ప్రదర్శించిన డప్పు డాన్స్ ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నది. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యు. రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. నరసింహారావు, కాంపాటీ పృద్వి, బి .భాస్కర్, నరేందర్, ఎస్.అనిల్, రాష్ట్ర సహాయ కార్యదర్శి సాయి, అఖిల్, ప్రవీణ్, కోశాధికారి సురేష్, రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకటేష్, మహేందర్, వినోద్ సంధ్య, గణేష్, కావ్య, రమేష్, సీతారాం, రాకేష్, శివ తదితరులు పాల్గొన్నారు.