calender_icon.png 5 January, 2025 | 9:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజారోగ్య సంరక్షణకు ప్రభుత్వ ప్రాధాన్యం

03-01-2025 11:57:42 PM

మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి

నల్లగొండ (విజయక్రాంతి): ప్రజారోగ్య సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యం ఇస్తున్నదని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి స్పష్టం చేశారు. మర్రిగూడెం మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో రూ. 70 లక్షలతో ఏర్పాటు చేసిన డయాలసిన్ కేంద్రాన్ని వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. రోజురోజుకూ కిడ్నీ వ్యాధి బాధితులు పెరుగుతుండడం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. రోగుల తాకిడికి అనుగుణంగా కేంద్రాన్ని 24 గంటలు నడపాలని సూచించారు. వైద్య సిబ్బంది షిఫ్టుల వారీగా పనిచేయాలని సూచించారు.

గ్రామాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు సేకరించి వారికి క్రమం తప్పకుండా సేవలందించాలని చెప్పారు. ప్రభుత్వ వైద్యులు అంకితభావంతో పనిచేసి సర్కారుకు మంచి పేరు తేవాలన్నారు. అంతకుముందు మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీసి, విద్యార్థుల సమస్యలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 25 రోజులుగా సమ్మె చేస్తున్న కేజీబీవీ అధ్యాపకులు ఎమ్మెల్యేలకు తమ సమస్యలు విన్నవించగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెంచిన మెస్, కాస్మోటిక్ ఛార్జీలు కేజీబీవీలకు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు.