స్వయం సహాయక సంఘాల ద్వారా 1000 మెగావాట్ల ఉత్పత్తి
త్వరలో టెండర్లు ఖరారు చేస్తాం
కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
ఎస్.హెచ్.జీల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు ప్రగతిపై సమీక్ష
నిజామాబాద్ (విజయక్రాంతి): మహిళా సాధికారతే ధ్యేయంగా ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలతో ముందుకెళ్తోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు నెలకొల్పి వేయి మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలనే లక్ష్యంతో ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య పరస్పర ఒప్పందం ఖరారయ్యిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మంత్రులు సీతక్క(Minister Sithakka), కొండా సురేఖ, ఇంధన శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ సందీప్ కుమార్ సుల్తానియా, గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ లోకేష్, సెర్ప్ సీఈవో దివ్య దేవరాజన్, ట్రాన్స్కో సీఎండి కృష్ణ భాస్కర్ తదితరులతో కలిసి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం ఆయా జిల్లాల కలెక్టర్లతో సోలార్ ప్లాంట్ల ఏర్పాటు ప్రక్రియపై ప్రగతిని సమీక్షించారు. ఐదు సంవత్సరాల వ్యవధిలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం సంకల్పించిందని, ఈ దిశగా మహిళలకు పెద్ద ఎత్తున వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నామని గుర్తు చేశారు.
ఈ ఆర్ధిక చేయూతను మహిళా సంఘాలు సద్వినియోగం చేసుకుంటూ సమర్ధవంతమైన వ్యాపార లావాదేవీలతో ఆర్ధిక పరిపుష్టి సాధించేలా అధికారులు తోడ్పాటును అందించాలని సూచించారు. మహిళా సంఘాలు సోలార్ పవర్ ప్లాంట్ల ఏర్పాటు కోసం వారికి అందుబాటులో ఉన్న స్థలాన్ని, ప్రభుత్వ భూములను గుర్తించాలని కలెక్టర్లను ఆదేశించారు. సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు కోసం బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు ఆర్థిక సహాయం ఇప్పించేలా చొరవ చూపాలన్నారు. మహిళా సంఘాల భూముల్లో ప్లాంట్ల ఏర్పాటుకు విద్యుత్ శాఖ రెడ్ కో ద్వారా టెండర్లు ఆహ్వానించిందని, త్వరలోనే వాటిని ఖరారు చేస్తారని డిప్యూటీ సీఎం తెలిపారు. ఈ నేపథ్యంలో ఆసక్తి, అర్హత కలిగిన మహిళా సంఘాలను గుర్తించి, భూసేకరణ, బ్యాంకుల నుంచి ఆర్థిక సాయం అందించే ప్రక్రియలను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. సోలార్ ప్లాంట్ల ద్వారా ఒక మెగావాటు విద్యుత్ ఉత్పత్తికి నాలుగు ఎకరాల స్థలం అవసరం అవుతుందని, ఈ లెక్కన ప్రతి జిల్లాలో 150 ఎకరాలకు తగ్గకుండా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు నాలుగు వేల ఎకరాలు సేకరించాల్సి ఉంటుందని అన్నారు.
దేవాదాయ, ఇరిగేషన్ శాఖల పరిధిలోని భూములను గుర్తించాలని, ఆర్.ఓ.ఎఫ్.ఆర్ కింద గిరిజనులకు అందించిన భూములను సైతం అభివృద్ధి చేసుకునేందుకు వెసులుబాటు లభించిందని అన్నారు. గిరిజనులకు అందించిన భూముల్లో సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. తద్వారా సోలార్ విద్యుత్తు అందుబాటులోకి వస్తే అటవీ ప్రాంతాల్లోని రైతులు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా పెద్ద ఎత్తున పంటలు సాగు చేసుకునే అవకాశం ఏర్పడుతుందని, గిరిజనులు ఆత్మగౌరవంతో బతికే అవకాశం కల్పించినట్లవుతుందని అన్నారు. హైదరాబాద్ వంటి మహానగరాల్లో భారీ భవంతుల పైన సోలార్ పవర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో గుట్టలతో విస్తరించిన భూములు అత్యధికంగా ఉన్నందున వీటి పైన పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అందుబాటులో ఉన్న అవకాశాలను పరిశీలించాలన్నారు.
దీనివల్ల ప్రభుత్వ భూములను పరిరక్షించుకునేందుకు కూడా అవకాశం ఉంటుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సూచించారు. ప్రధానమంత్రి పీ.ఎం కుసుమ్ పథకంలో భాగంగా రైతులు రెండు మెగావాట్ల వరకు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసుకునే అవకాశం ఉన్నందున, ఈ దిశగా రైతులను చైతన్యం చేయాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. తెలంగాణ రెడ్ కో పోర్టల్ ద్వారా రైతులు సోలార్ విద్యుత్ ఉత్పత్తి కోసం దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ దిశగా రైతులను ప్రోత్సహిస్తే తక్కువ ధరకు విద్యుత్తు అందుబాటులోకి రావడమే కాకుండా కాలుష్య రహిత విద్యుత్ ఉత్పత్తికి ఆస్కారం ఉంటుందన్నారు. అలాగే, ప్రతి నియోజకవర్గంలో సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు నాలుగు నుంచి ఐదు ఎకరాలు భూమి అవసరం అవుతుందని, ఈ మేరకు మినీ ఇండస్ట్రియల్ ఏరియాల ఏర్పాటు కోసం స్థల సేకరణపై దృష్టి సారించాలని డిప్యూటీ సీఎం కలెక్టర్లకు సూచించారు. దీని ద్వారా స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యాపారం చేసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు.
అటవీ హక్కుల ద్వారా లభించిన భూముల్లో అవకాడో వంటి పంటలు సాగు చేస్తే అటవీ సంపద పెరగడంతో పాటు గిరిజనులు ఆర్థికంగా బలోపేతం అవుతారని అన్నారు. రాష్ట్రంలో 6.67 లక్షల ఎకరాలను ఇప్పటివరకు ప్రభుత్వం గిరిజనులకు పంపిణీ చేయగా, ఆ భూముల్లో లాభసాటి పంటల సాగు జరిగేలా ఉపాధి హామీ, గిరిజన శాఖ, స్వయం సహాయక సంఘాల ద్వారా వచ్చే పథకాలు అన్నిటిని సమన్వయం చేసుకొని సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. గిరిజనులకు ఆదాయం తక్కువగా ఉంటుందని, భూమి లభ్యత ఎక్కువగా ఉంటుందని మంత్రి సీతక్క అన్నారు. ఈ నేపథ్యంలో అచ్చంపేట నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి పరీవాహక ప్రాంతంలోని భూములపై అధికారులు దృష్టిపెడితే గిరిజనులకు ప్రయోజనం జరుగుతుందని సూచించారు. వీడియో కాన్ఫరెన్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ అంకిత్, డీఆర్డీఓ సాయాగౌడ్, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి నాగోరావు తదితరులు పాల్గొన్నారు.