మణుగూరు: మహిళా సాధికారతనే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గ పరిధిలోని మణుగూరు వంద పడకల ఆసుపత్రిలో ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ను ఆయన ప్రారంభించారు. అనంతరం శివలింగాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో 28 చేపల సొసైటీ సభ్యులకు చేప పిల్లలను పంపిణీ చేశారు. మండల కార్యాలయంలో మహిళా శక్తి కుట్టు మిషన్ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా మెరుగుపడే విధంగా రాష్ట్ర ప్రభుత్వం మహిళా శక్తి పథకం ఏర్పాటు చేసిందని తెలిపారు.
స్వయం ఉపాధి కోసం ప్రభుత్వం అందించే శిక్షణ కార్యక్రమాలను యువతులు, మహిళలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం మహిళా శక్తి పథకం పేరుతో 13 నుంచి 14 మహిళా సంఘాలకు 1కోటి 53లక్షల 50వేల రూపాయల చెక్కులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, మణుగూరు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినాకి నవీన్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.