హైదరాబాద్,(విజయక్రాంతి): ఎమ్మెల్యేల అనర్హతపైన హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడిందని, అనర్హతపైన సర్వాధికారులు స్పీకర్ కు ఉన్నాయని కోర్టు తేల్చిందన్నారు. తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే న్యాయస్థానం సూచించింది కానీ నిర్ణిత సమయాన్ని కోర్టు ప్రస్తావించలేదని చెప్పారు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారని ప్రభుత్వ విప్ ఎద్దేవా చేశారు.
రాజ్యాంగం ప్రకారం సభాపతి నడుచుకుంటారని, కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డి, అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా హడావిడి చేశాడని విమర్శించారు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీకి పోయినట్లు కేటీఆర్, బీఆర్ఎస్ నేతల తీరు ఉందని, 10 ఏళ్ల పాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలను బీఆర్ఎస్ చేర్చుకుంది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను క్యాబినెట్ లో చేర్చుకొని నైతిక విలువలను కాళేశ్వరంలో కలిపారని, పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు.
ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లెక్కచేయలేదన్నారు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగి ఇప్పుడు అధికారం పోగానే రాజ్యాంగం, న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయన్నారు. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయమని, ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరని చెప్పుకొచ్చారు. కేసీఆర్ ఫామ్ హౌస్ కు, కేటీఆర్ గెస్ట్ హౌస్ కు, హరీష్ రావు నార్సింగి హౌస్ కు పరిమితం కావాల్సిందే అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జోస్యం చెప్పారు.