ప్రజల్లో విశ్వాసం కోల్పోయి మతి బ్రమించి బీఆర్ఎస్ చిల్లర చేష్టలు..
అభివృద్ధి పథకాలను అడ్డుకుంటే ఉపేక్షించేది లేదు..
ఇల్లెందు (విజయక్రాంతి): అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే కోరం కనకయ్య(MLA Koram Kanakaiah) అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖా మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి(Minister Ponguleti Srinivasa Reddy) సంచలన నిర్ణయాత్మకథలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదున్నర లక్షల మంది నిరుపేదలకు మొదటి దఫాలో ఇందిరమ్మ ఇళ్ళ మంజూరు కార్యక్రమంలో భాగంగా శుక్రవారం టేకులపల్లి మండల కేంద్రంలో గల గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు ఎమ్మెల్యే కోరం కనకయ్య ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గత బీ.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రం రావణ కాష్టంలా మారిందని, ప్రజాపాలన గాలికి వదిలి అక్రమార్జనే ధ్యేయంగా బీ.ఆర్.ఎస్ నేతల పాలన సాగిందని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోలో పొందుపరిచిన ఆరు గ్యారంటీ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే, జీర్ణించుకోలేని బీ.ఆర్.ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల చిల్లర మల్లర ఘర్షణలు చేస్తూ, తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని, పేదలకు అందించే అభివృద్ధి, సంక్షేమ పథకాలను అడ్డుకోవాలని చూసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. అనంతరం మండల తహశీల్దార్ నాగ భవానితో కలిసి మండల వ్యాప్తంగా 131 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవీందర్ రావు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఇస్లావత్ రెడ్యా నాయక్, మూడ్ సంజయ్, తౌడోజు చిన్న భిక్షుమయ్య, గణేష్, మాజీ సర్పంచ్ బోడ సరిత, సర్కిల్ ఇన్స్ స్పెక్టర్ తాటి పాముల సురేష్, బోడు సబ్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, పంచాయతీ కార్యదర్శి, కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు కోరం సురేందర్, మండల పార్టీ అధ్యక్షుడు భూక్యా దేవా నాయక్, జిల్లా మహిళా నాయకురాలు బండ్ల రజినీ, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.