ప్రజా పాలన పథకాలపై ఇంటింటికి కళా జాత ప్రదర్శన
హుజూర్ నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని గోపాల పురం, బూరుగడ్డ గ్రామాలలో ప్రతి ఇంటికి ప్రజా పాలన పథకాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందని తెలంగాణ సాంస్కృతిక సారధి జిల్లా టీమ్ లీడర్ వేముల శ్రవణ్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏడాది పాలన పురస్కరించుకొని జిల్లా కలెక్టర్, సమాచార పౌర సంబంధాల అధికారి ఆదేశాల ప్రకారం జిల్లా లోని ప్రతి గ్రామంలో కళా జాత ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన 6 గ్యారంటీలలో ఒకటైన ఉచిత బస్ పథకంలో భాగంగా ఫ్రీగా బస్ ప్రయాణం చేసే ప్రతి మహిళ కళ్ళలో ఆనందం కనబడుతుందని అన్నారు.
ప్రతి మహిళకు రూ. 500 సబ్సిడీ గ్యాస్ సిలిండర్ ను అందించడం జరుగుతుందని అర్హులైన పేదలకు ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేయడం జరుగుతుందని రైతు భరోసా పేరుతో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయడం జరుగుతుందని వివరించారు. గృహ జ్యోతి పథకంతో ప్రతి ఇంటికి 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు తెలిపారు. స్కిల్ యూనివర్సిటితో రెసిడెన్షియల్ పాఠశాలలు అనుసంధానం చేసి నాణ్యమైన విద్య అందిస్తున్నట్లు గిరిజన శిక్షణ ఉపాధి కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరు ఈ పథకాలు అందుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళా కారులు గంట భిక్షపతి, పల్లెల లక్ష్మణ్, కుందమల్ల నాగలక్ష్మి, ఒంటెపాక ప్రియంక, నెమ్మాది స్రవంతి, మేడి ప్రియదర్శిని, మేడి ఇందిరలతో పాటు ఆయా గ్రామాల కార్యదర్శులు గిరిజ, ఇందిర తదితరులు పాల్గొన్నారు.