రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ
ఆందోల్, జనవరి 23 : పేదవారికి ప్రభుత్వం అండగా ఉండి సంక్షేమ పథకాలు అందిస్తుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గురువారం ఆందోల్ మండలంలోని నేరేడు గుంట గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో పాల్గొని ప్రసంగించారు. రాబోయే 10 రోజుల్లో నేరేడుగుంట నుంచి ఇళ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు.
1994లో మహిళల అభివృద్ధి కోసం ఐదెకరాల భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది అన్నారు. మహిళలు వ్యాపారంలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని తెలిపారరు. మహిళలు పారిశ్రామిక విధులుగా పాడి పరిశ్రమ రంగంలో అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది రుణాలు మంజూరు చేస్తుందని ఈ సందర్భంగా తెలిపారు నేరేడు గుంటలో పేదలు ఎవరైతే ఉన్నారో వారికి ముందు ఇళ్లు కేటాయిస్తామన్నారు.
నేరేడు గుంట గ్రామానికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంజూరు చేస్తామని ప్రకటించారు. అబద్ధాలు వద్దు, అర్హత ఉన్న వారికి ఇళ్లు కేటాయిద్దాం అని తెలిపారు. ఇంకా రుణమాఫీ కావాల్సి ఉంది.. త్వరలో చేస్తామన్నారు. ఆందోల్ నియోజకవర్గంలో అంతర్గత రోడ్లను నిర్మాణం చేస్తున్నామని తెలిపారు.
వితంతు, వృద్ధాప్య, వికలాంగుల పించన్ ఇంకా రావాల్సిన వారికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు త్వరలో నెరవేరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అడిషనల్ కలెక్టర్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.