calender_icon.png 20 January, 2025 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వరద బాధితులకు అండగా ప్రభుత్వం

03-09-2024 12:00:00 AM

  1. అన్ని విధాల ఆదుకుంటాం 
  2. ఎమ్మెల్యేలు, కలెక్టర్లు, అధికారులు 
  3. ముంపు ప్రాంతాల్లో పర్యటన 
  4. బాధితులకు పరామర్శ

సూర్యాపేట, సెప్టెంబరు 2: భారీ వర్షాల కారణంగా కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో నష్టపోయిన ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. కోదాడ  నియోజకవర్గంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం మంత్రి పర్యటించారు.  నడిగూడెం మండలం కాగిత రామచంద్రాపురం వద్ద తెగిన ఎన్‌ఎస్‌పీ కాల్వ కట్టను పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు.

కాల్వకట్ట మరమ్మతు పనులు వారంలో పూర్తిచేస్తామన్నారు. అనంతరం కోదాడ పట్టణంలో వరద దెబ్బతిన్న తమ్మర బ్రిడ్జి, కోదాడ మండలంలోని రామాపురం వద్ద బ్రిడ్జిని కోదాడ ఎమ్మెల్యే పద్మావతితో కలిసి పరిశీలించారు. వారివెంట కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, ఎస్పీ సన్‌ప్రీత్‌సింగ్, ఏఎస్పీ నాగేశ్వర్‌రావు, ఆర్డీవో సూర్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ రమాదేవి ఉన్నారు.   

మానుకోటలో మంత్రి సీతక్క పర్యటన

హనుమకొండ(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లాలో పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క, ఎంపీ పోరిక బలరాం నాయక్, ఎమ్మెల్యే మురళీనాయక్, కలెక్టర్ అద్వైత్ కుమార్ పర్యటించారు. మరిపెడ, కేసముద్రం, ఇనుగుర్తి, నెల్లికుదురు మండలాల్లోని గ్రామాలను సందర్శించారు. పురుషోత్తమాయ గూ డెం, రావిలాల ఘటనపై మంత్రి సీతక్క వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా అధికారులు భద్రతా చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా, మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేసుకుని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.

తండా గ్రామాల్లో రోడ్లను బాగు చేయాలని, నిరాశ్రయులను పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. కేసముద్రం మండల కేంద్రంలోని ఎన్టీఆర్ నగర్, సంతోష్ నగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి బాధితులతో మాట్లాడి వారికి భరోసా కల్పించారు. వరంగల్ నగరంలో లోతట్టు ప్రాం తాలను సందర్శించారు. హనుమకొండలో పలు కాలనీల్లో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి పర్యటించారు. పరకాల నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి పర్యటించారు.

ఆదిలాబాద్‌లో నీట మునిగిన పంటలు

ఆదిలాబాద్(విజయక్రాంతి): ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వరాలతో పంట పొలాలు నీట మునిగాయి. పెన్ గంగా నది పరివాహక మండలాలైన జైనథ్, బేలా, భీంపూర్  మండలల్లో అత్యధికంగా నష్టం జరిగింది. పంట నష్టంపై ప్రభుతం వెంటనే సరే నిరహించి రైతులను ఆదుకోవాలని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ డిమాండ్ చేశారు

కామారెడ్డి జిల్లాలో ఎమ్మెల్యే పర్యటన

కామారెడ్డి(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా లో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ఆదేశాల మేరకు వారిని పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ఆహారం అందిస్తున్నారు. బాన్సువాడలోని పలు కాలనీల్లో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి పర్యటించారు. కామారెడ్డిలో ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి పర్యటించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మికాంతారావు పలు గ్రామాలను సందర్శించారు. ఎల్లారెడ్డిలో ఎమ్మె ల్యే మదన్‌మోహన్ పర్యటించారు. 

నిర్వాసితులకు పునరావాసం..

నాగర్‌కర్నూల్(విజయక్రాంతి): అచ్చంపేట మండలం నక్కలగండి ప్రాజెక్టు నిర్వాసితులకు నెల రోజుల్లోనే పునరావాసం కల్పిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ హామీ ఇచ్చారు. అచ్చంపేట మండలం మర్లపాడుతండాకు ఎమ్మెల్యే వంశీకృష్ణ నాటు పడవలో వెళ్లి నిర్వాసితులతో మాట్లాడారు. నెలరోజుల్లోనే పునరావాసం కల్పిస్తామన్నారు. 

గుర్రంగడ్డ ప్రజలకు సహకరిస్తాం 

గద్వాల(వనపర్తి)(విజయక్రాంతి): గద్వాల మండల పరిధిలోని గుర్రంగడ్డ గ్రామాన్ని ఎస్పీ శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ సంతోష్ కలెక్టర్ బోటు ద్వారా సందర్శించారు. ప్రజలకు అన్ని విధాలా సహకరిస్తామన్నారు.

అధికారుల సూచనలు పాటించాలి

రాజన్న సిరిసిల్ల(విజయక్రాంతి): భారీ వరాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అధికారుల సూచనలు తప్పకుండా పాటించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సూచించారు. పలు గ్రామాల్లో ఆయన పర్యటించారు. జాగ్రత్త చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీర్నపల్లి మండలంలోని గర్జనపల్లి, వన్ పెల్లి వద్ద లో లెవెల్ వంతెనలు, గర్జనపల్లిలో  ఇల్లు కూలి పోగా, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు. 

కొత్తగూడెం జిల్లాలో 

భద్రాద్రి కొత్తగూడెం(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 2,982 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లి, 984 మంది రైతులు నష్టపోయారు. వ్యవసాయశాఖ ప్రాథమిక అంచనా ప్రకారం జూలూరుపాడు, పాల్వంచ, అశ్వాపురం, బూర్గంపాడు, మణుగూరు మండలాల్లో పంట నష్టం వాటిల్లింది. 

పలు జిల్లాల్లో

పెద్దపల్లి/నిర్మల్/మంచిర్యాల/కుమ్రంభీం ఆసిఫాబాద్(విజయక్రాంతి)/కోరుట్ల: మంచి ర్యాల జిల్లాలోని ముంపు ప్రాంతాలను మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు, కలెక్టర్ కుమార్ దీపక్ సందర్శించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ వెంకటేష్ దోత్రే పర్యటించారు. వరద బాధితలును ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నిర్మల్ ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి ఆరోపించారు. మంథని పట్టణంలోని గౌతమేశ్వర ఆలయ పరిసరాలను పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పరిశీలించారు. ముంపు ప్రాంతాల ప్రజలకు నష్టం కలగకుండా అధికారులు అప్రత్తంగా ఉండాలని సూచించారు. మానేరు వంతెనతోపాటు కాల్వశ్రీరాంపూర్‌ను రామగుండం సీపీ ఎం.శ్రీనివాసులు పరిశీలించి, పలు సూచనలు చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్ల తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. కోరుట్ల పట్టణంలోని ఆదరనగర్, ముత్యాల వాడ, అయిలాపూర్ రోడ్, తాళ్ల చెరువు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 

కరీంనగర్ జిల్లాలో

కరీంనగర్(విజయక్రాంతి): కరీంనగర్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షానికి జిల్లాలోని చెరువులు మత్తడి దూకాయి. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సోమవారం వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. హుజూరాబాద్‌లోని పలు కాలనీల్లో ఇళ్లలోకి నీరు చేరుకుంది. కరీంనగర్ కలెక్టరేట్‌లో చెట్టు కూలడంతోపాటు ఆర్టీసీ వర్క్‌షాప్ వద్ద రోడ్డుపై నీరు ప్రవహించి, వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కోతిరాంపూర్ వద్ద కూడా ప్రధాన రహదారిపై వరదనీరు చేరుకోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు.

కరీంనగర్ నగరపాలక సంస్థ కమిషనర్ చాహత్ వాజ్‌పేయి నగరంలోని లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పలు వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి సహాయక చర్యలను పర్యవేక్షించారు. శంకరపట్నం మండలం అంబాలాపూర్ గ్రామంలో ఊర చెరువుకు గండి పడటంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు ప్రారంభించారు. కరీంనగర్ మండలం తీగలగుట్టపల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో వరదనీరు చేరుకోవడంతో ఆర్‌వోబీ పనులకు అంతరాయం ఏర్పడింది. కొండాపూర్ గ్రామంలో వరిపొలాలు నీట మునిగాయి. 

సూర్యాపేటలో 20 వేల ఎకరాల్లో పంట నష్టం

సూర్యాపేట(విజయక్రాంతి): జిల్లాలో గత మూడు రోజులు కురిసిన వర్షాల  కారణంగా 20 వేల ఎకరాలలో పంట నష్టం జరిగినట్లు అధికారులు అంచనా  వేశారు. నడిగూడెం మండలం రామచంత్రాపురం వద్ద ఎన్‌ఎస్‌పి కెనాల్ తెగిపోవడంతో 300 ఎకరాల పంట నష్టం జరిగినట్లు లెక్కకట్టారు. జిల్లాలో ఇద్దరు మృతి చెందారు. 7 ఇళ్లు పూర్తిగా కూలిపోగా, 27 ఇల్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 150 కరె ంట్ స్తంభాలు కూలిపోగా, 150 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయని అధికారులు అంచనా వేశారు.  

నష్ట నివారణ చర్యలు చేపట్టాం

కొత్తగూడెం ఎమ్మేల్యే కూనంనేని 

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2(విజయక్రాంతి): కొత్తగూడెం నియోజకవర్గంలోని పాల్వంచ, కొత్తగూడెం మండలాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సోమవారం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పర్యటించారు.  మందెరకలపాడు వంతెనకు గండి ఏర్పడటంతో యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి రాకపోలను పునరుద్ధరింపజేశారు. ఇళ్లలో నీరు చేరిన కుటుంబాలను పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అడిగి తెలుసుకొన్నారు. బాధితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.