- ఈ ఏడాది ఏప్రిల్-అక్టోబర్ మధ్య మూలధన వ్యయం 17,750.89కోట్లు
- ఒక్క అక్టోబర్‌లోనే అభివృద్ధికి 7,759.59 కోట్లు ఖర్చు
- ఇది బడ్జెట్ అంచనాల్లో 23శాతం
- గత మూడేళ్లలో ఒక్క నెలలో ఇంత మొత్తం వెచ్చించడం ఇదే తొలిసారి
హైదరాబాద్, నవంబర్ 24 (విజయక్రాంతి): రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చులు అమాంతం పెరిగాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య కాలంలో అంతంత మాత్రంగానే ఖర్చు చేసిన ప్రభుత్వం అక్టోబర్‌లో భారీగా నిధులను వెచ్చించినట్లు ఇటీవల విడుదల చేసిన నివేదికలో కాగ్ చెప్పింది.
ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో కలిపి రూ.9,447.82 కోట్లను అభివృద్ధి పనులకు ఖర్చు చేసిన ప్రభుత్వం.. అక్టోబర్ ఒక్క నెలలోనే రూ.7,759.59 కోట్లను వెచ్చించింది. ఈ ఏడాది బడ్జెట్‌లో మూలధన వ్యయం కోసం ప్రభుత్వం రూ.3,3486.50కోట్లను ప్రతిపాదించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి రూ.17,750.89కోట్లను చేయగా.. ఇది బడ్జెట్‌లో 53.01శాతం.
అయితే ఒక్క అక్టోబర్ నెలలో సర్కారు ఏకంగా రూ.7,759.59కోట్లను అభివృద్ధి కోసం ఖర్చు చేయడం గమనార్హం. ఇది మొత్తం బడ్జెట్‌లో 23శాతం. గత మూడేళ్లలో ఒక్క నెలలో డెవలప్‌మెంట్ కోసం ఇంతపెద్ద మొత్తంలో ప్రభుత్వం ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. 2021-22లో బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో చివరిసారిగా సెప్టెంబర్ నెలలో అత్యధికంగా రూ.8,051.96 కోట్లను ఖర్చు చేసింది. ఆ తర్వాత ఇదే అత్యధికమని కాగ్ గణాంకాలు చెబుతున్నాయి.
ఖర్చు చేసింది వీటికే..
అభివృద్ధికి చేసే ఖర్చు, రక్షణ వ్యయం, కేంద్రం ఇతోధికంగా ఇచ్చే దీర్ఘకాలిక రుణాలను కలిపి బడ్జెట్‌లో మూలధన వ్యయంగా చెబుతారు. ఇందులో కేంద్రం నుంచి వచ్చే దీర్ఘకాలిక రుణాలు ప్రభుత్వానికి ఒక్క రూపాయి కూడా రాలేదు. మిగిలిన రెండు అంశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం భారీగా ఖర్చు చేసింది. ముఖ్యంగా గ్రామీణ రోడ్లకు అక్టోబర్‌లో పెద్దమొత్తంలో నిధులను విడుదల చేసింది.
రాష్ట్రంలోని 92 నియోజకవర్గాల్లోని 323 కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు, నిర్మాణానికి ప్రభుత్వం అక్టోబర్‌లో రూ.1,377.66కోట్లను విడుదల చేసింది. అలాగే పోలీస్ సిబ్బందికి సరెండర్ లీవ్ బడ్జెట్ కింద రూ.182.48కోట్లను విడుదల చేసింది. సెప్టెంబర్‌లో వచ్చిన భారీ వర్షాలకు పెద్దఎత్తున నష్టం వాటిల్లింది.
ఈ క్రమంలో అక్టోబర్‌లో వరద ప్రభావిత ప్రాంతాలకు కేంద్రం రూ.416కోట్లను విడుదల చేయగా.. వాటికి మరిన్ని నిధులను కలిపి ప్రభుత్వం వరద ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ఖర్చు చేసింది. ఇదే నెలలో ఆలయాల అభివృద్ధి, రాష్ట్రీయ రహదారుల డెలవప్‌మెంట్‌తో పాటు మరిన్ని పనులకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది.
సంక్షేమానికి కూడా పెద్దపీట..
అక్టోబర్‌లో సంక్షేమ పథకాల్లో భాగంగా ఇచ్చే సబ్సిడీకి కూడా ప్రభుత్వం భారీగా నిధులను ఖర్చు చేసినట్లు కాగ్ తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్-అక్టోబర్ మధ్య సబ్సిడీ కోసం రూ.7,690.12కోట్లను వెచ్చించింది. అయితే ఒక్క అక్టోబర్ నెలలో ప్రభుత్వంపై సబ్సిడీ భారం రూ.1,313.60 కోట్లు పడింది. ఈ ఏడాది ఇదే అధికం కావడం గమనార్హం.
ఈ ఏడాది ఏ నెలలో కూడా ఇంత పెద్ద మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీ కింద చెల్లించలేదు. గతేడాది బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇదే అక్టోబర్ నెలలో సబ్సిడీ కోసం రూ.376.67కోట్లను మాత్రమే ఖర్చు చేసింది. 2023-24ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ నాటికి బీఆర్‌ఎస్ ప్రభుత్వం రూ.4,431.07కోట్లను మాత్రమే వెచ్చించగా ఈ ఏడాది రూ.7,690.12కోట్లకు పెరిగింది.
2024-25 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్- అక్టోబర్ వరకు నెలవారీగా ప్రభుత్వం మూలధన వ్యయం వివరాలు (రూ.కోట్లలో)
ఏప్రిల్ 3,060.09
మే 1,818.40
జూన్ 976.26
జూలై 1,503.77
ఆగస్టు 556.31
సెప్టెంబర్ 1,532.99
అక్టోబర్ 7,759.59
మొత్తం 1,7750.89
మూలధన వ్యయం కింద
బడ్జెట్‌లో ప్రతిపాదించిన
మొత్తం రూ.33,486.50కోట్లు