మూమాజీ ఎంపీ వి. హనుమంతారావు...
ముషీరాబాద్ (విజయక్రాంతి): భారతమాత మహాహారతి కార్యక్రమం సందర్భంగా ఆదివారం రాత్రి హుస్సేన్‌సాగర్‌లో జరిగిన బోటు ప్రమాదంపై భారతమాత పౌండేషన్‌పై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ ఎంపీ, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు వి. హనుమంతారావు కోరారు. గల్లంతైన ఇంజినీరింగ్ విద్యార్థి అజయ్ కుటుంబానికి కేంద్రమంత్రి జి. కిషన్‌రెడ్డి రూ. 2 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా బాణాసంచా పేల్చడం వల్లనే ఈ బోటు ప్రమాదం జరిగిందని ఆరోపించారు. మంగళవారం బషీర్‌బాగ్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గల్లంతైన అజయ్ తండ్రి నాగారంలో ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నారని, ఆ కుటుంబానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బోటులో బాణాసంచా పేల్చినపుడు హుస్సేన్ సాగర్‌లో దూకిన సాయిచంద్, గణపతిలకు కూడా గాయాలయ్యాయని, వారికి కూడా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరిహారం చెల్లించాలని అన్నారు.
పుష్ప సినిమా హీరోపై ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుందో అదే తరహాలో భారతమాత ఫౌండేషన్‌పై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. బీజేపీ నేతలకు భారత రాజ్యాంగంపై ఎలాంటి గౌరవం లేదని, డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను నిత్యం అవమానపరుస్తున్నారని ఆరోపించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్‌ను అవమానించిన కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లేబర్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ నాగభూషణం, టీ పీసీసీ కార్యదర్శి శంభుల శ్రీకాంత్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్, నాయకులు కే. శ్రీకాంత్, దాత్రిక్ చందూలాల్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.