19-03-2025 07:06:58 PM
ఏ జె రమేష్ డిమాండ్..
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఇచ్చిన హామీ ప్రకారం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు నిధులు కేటాయించాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఎ.జె.రమేష్ డిమాండ్ చేశారు. బుధవారం సిఐటియు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని, ఆశ వర్కర్లకు పర్మినెంట్ చేయాలని, ఆలోపు ఫిక్స్డ్ వేతనం 18 వేల రూపాయలు ఇవ్వాలని ఈఎస్ఐ, పిఎఫ్ సౌకర్యం కల్పించాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని, బిఆర్ఎస్ నడిచిన బాటలోనే కాంగ్రెస్ పాయనిస్తున్నదని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తుందని, ఆశాలకు వేతనాలు పెంచడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిందని, ఆశాల ఓట్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినా, ఆశాల సమస్యలు మాత్రం నేటికీ పరిష్కారం చేయలేదన్నారు. ఈ కాలంలో ఆశాలకు ఫిక్స్డ్ వేతనం రూ.18,000/- లు నిర్ణయం చేయాలని, ఇతర సమస్యలు పరిష్కరంచాలని కోరుతూ రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులకు, జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలకు, మంత్రులకు ఆశాలు అనేకసార్లు వినతిపత్రాల ద్వారా విజ్ఞప్తులు చేశామాన్నారు. ఇప్పటికీ నిరంతరం నిరసనలు, పోరాటాలు నిర్వహిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం చలనం లేనట్లు వ్యవహరిస్తున్నదన్నారు. ఆశాలు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
ప్రజా పాలన ప్రభుత్వంలో ఏ ఒక్క సమస్యా పరిష్కారం కావడం లేదని, ఇచ్చిన హామీలను ఎలా గాలికి వదిలేయాలి అని ప్రభుత్వం చర్యలు ఉన్నాయన్నారు. ఇలాంటి పరిపాలన కార్మికులకు తీరని నష్టం కలిగిస్తున్నారని అన్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశాలకు ఫిక్స్డ్ వేతనంపై నిర్ణయం తీసుకుని, తగినన్ని నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి జిలకర పద్మ, ఉపాధ్యక్షులు దొడ్డ రవి కుమార్, పిట్టల అర్జున్, సహాయ కార్యదర్శులు కె.సత్య, డి.వీరన్న, ఆశా వర్కర్ల యూనియన్ జిల్లా అధ్యక్షులు ఝాన్సి, ప్రధాన కార్యదర్శి ధనలక్ష్మి, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు భూక్యా రమేష్, ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు నాయకులు రుక్మిణి, విజయలక్ష్మి, జయ, హైమ, తదితరులు పాల్గొన్నారు.