* సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో విచారణ కమిటీ తనిఖీలు
* ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్న అధికారులు
* సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్
ఎల్బీనగర్, జనవరి 22: సరూర్‌నగర్‌లోని అలకనంద ఆస్పత్రిలో ఎలాంటి అనుమతులు లేకుండా కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేస్తున్నట్లు వెలుగుచూసిన ఉదంతంపై సర్కార్ సీరియస్ అయ్యింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాలతో డాక్టర్ నాగేందర్ ఆధ్వర్యంలో నలుగురితో అలకనంద దవాఖానపై విచారణ కమిటీని ఏర్పాటు చేయగా బుధవారం వారు సంబంధిత ఆస్పత్రిలో తనిఖీలు చేపట్టారు. అనంతరం డాక్టర్ నాగేందర్ మాట్లాడుతూ.. అలకనంద దవాఖాన ఏర్పాటు అనుమతులు, ఇక్కడి వైద్యులు, సిబ్బంది నియామకాలు, ఫార్మసీలో మందులు, ఐసీయూ గదిని పరిశీలించామన్నారు.
ఇప్పటివరకు వైద్యులు చేసిన ఆపరేషన్ల వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. అనుమతి లేకుండా కిడ్నీ మార్పిడి చికిత్సలు చేయడం తీవ్రమైన నేరమన్నారు. అలకనంద దవాఖానలో జరిగిన శస్త్ర చికిత్సలపై పూర్తిస్థాయి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని తెలిపారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయన్నారు.
కిడ్నీ గ్రహీతల నుంచి రూ.50 లక్షల సేకరణ..
అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడులకు సంబంధించి ప్రభుత్వం ఉస్మానియా ఆస్పత్రి మాజీ సూపరింటెండెంట్ డా.నాగేందర్ ఆధ్వర్యంలో విచారణ కమిటీ వేసినట్లు తెలంగాణ వైద్య విద్య సంచాలకులు ఎన్ వాణి తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. పేదరికం కారణంగా తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల నుంచి ఇద్దరు వితంతువులు హైదరాబాద్ వచ్చి కిడ్నీలు విక్రయించినట్లు ఒప్పుకున్నారని విచారణలో తేలిందన్నారు.
అలకనంద ఆస్పత్రికి సంబంధించి ఒక ప్లాస్టిక్ సర్జన్‌కు మాత్రమే గుర్తింపు ఉందని.. ఆ ప్లాస్టిక్ సర్జనే ఈ కిడ్నీ శస్త్ర చికిత్సలు చేశారా.. లేదా అనే విషయమై ఆరా తీస్తున్నామన్నారు. ఆసుపత్రి యాజమాన్యం కిడ్నీ గ్రహీతలు ఒక్కొక్కరి నుంచి రూ.50 లక్షలకు పైగా నగదు తీసుకున్నట్టు పోలీసులు గుర్తించినట్లు సమాచారం.
ఏఐఎస్‌ఎఫ్ నాయకుల ఆందోళన..
అలకనంద ఆస్పత్రిలో వెలుగుచూసిన కిడ్నీ వ్యాపారంపై అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) నాయకులు భగ్గుమన్నారు. ఆస్పత్రి ఎదుట వారు ఆందోళన చేపట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రైవేట్ దవాఖానలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ధర్మేంద్ర, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సత్యప్రసాద్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు మధు, నాయకులు పాల్గొన్నారు.
సుమోటోగా స్వీకరించిన తెలంగాణ మెడికల్ కౌన్సిల్
అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని సుమోటోగా స్వీకరించి విచారణ చేయనున్నట్లు టీజీఎంసీ చైర్మన్ డా.మహేశ్ కుమార్ తెలిపారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్‌కు న్యాయస్థానాన్ని పోలిఉండే అధికారాలు కలిగి ఉన్నాయని టీజీఎంసీ వైస్ చైర్మన్ డా.శ్రీనివాస్ స్పష్టం చేశారు. కిడ్నీ మార్పిడి కుంభకోణంతో సంబంధాలు ఉన్న వైద్యులపై ఎథికల్, మాల్ ప్రాక్టీసెస్ కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.