26-04-2025 01:17:47 AM
పాతవిధానంలో డిగ్రీ విద్య అమలు నిర్ణయంపై వెనక్కి
ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలపై ప్రభుత్వం సీరియస్
యథావిధిగా బకెట్ సిస్టామ్‌నే అమలు చేయాలని ఆదేశాలు
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): డిగ్రీలో నచ్చిన కోర్సులను ఎంపిక చేసుకొనే బకెట్ సిస్టమ్ (బకెట్ ఆఫ్ కోర్సెస్)ను యథావిధిగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విధానాన్ని రద్దు చేయాలనే ఉన్నత విద్యామండలి ప్రతిపాదనలపై ప్రభుత్వం సీరియస్ అయినట్టు సమాచారం. తొలుత 2025 విద్యాసంవత్సరం నుంచి బకెట్ విధానాన్ని ఎత్తివేయాలని తెలంగాణ ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈనేపథ్యంలోనే అన్ని యూనివర్సిటీల వీసీలతో గతంలో సమావేశాన్ని నిర్వహించి బకెట్ విధానాన్ని రద్దు చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి, వాటిని ప్రభుత్వానికి పంపించింది.
ఒకవైపు దోస్త్ నోటిఫికేషన్‌కు, నూతన విద్యాసంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గరపడుతున్న క్రమంలో ఈ విధమైన నిర్ణయం తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టినట్టు తెలిసింది. అంతేగాక నాలుగు రోజుల కింద తెలంగాణ ఉన్నత విద్యామండలి, సంబంధిత అధికారులతో విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణా సచివాలయంలో సమీక్ష నిర్వహించి, ఈ విద్యాసంవత్సరం నుంచి యథావిధిగా బకెట్ విధానాన్ని అమలు చేయాలని ఆదేశించారు. ఏకపక్షంగా ఎలా నిర్ణయాలు తీసుకుంటారని అధికారులను హెచ్చరించినట్టు సమాచారం.
అసలేంటీ ‘బకెట్’
2021 నుంచి డిగ్రీ కోర్సుల్లో బకెట్ విధానాన్ని అమలు చేస్తున్నారు. మొత్తం డిగ్రీ కోర్సులను ఏ, బీ, సీ, డీ బకెట్లుగా విభజించారు. ఈ విధానంలో బీఎస్సీ గణితం తీసుకున్న విద్యార్థి సైకాలజీ వంటి కోర్సులనూ ఎంచుకొనే అవకాశం ఉంది. ఏ అభ్యర్థి ఏ కోర్సునైనా ఎంపిక చేసుకోవచ్చు. ఈ విధానంతో గతంలో పదుల సంఖ్యలో ఉన్న డిగ్రీ కోర్సులు 505కి చేరాయి. సబ్జెక్టు కాంబినేషన్లు పూర్తిగా మారిపోయాయి. బకెట్ ద్వారా ఎవరు ఏదైనా కాంబినేషన్లు తీసుకోవచ్చు.
రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల వరకు డిగ్రీ సీట్లు ఉంటే అందులో రెండు లక్షల వరకు సీట్లు నిండుతున్నాయి. ఇందులో మెజార్టీ విద్యార్థులందరూ బకెట్ విధానం ద్వారా నచ్చిన కోర్సు, నచ్చిన సబ్జెక్టును ఎంచుకుంటున్నారు. కాగా, ఈ విద్యాసంవత్సరంలో బకెట్ విధానం అమలు చేయాలని, 2026 విద్యా సంవత్సరానికి మాత్రం అమలు చేయాలో లేదో తర్వాత పునరాలోచన చేద్దామని అధికారులతో విద్యాశాఖ కార్యదర్శి చెప్పినట్టు సమాచారం.