calender_icon.png 16 January, 2025 | 4:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందాలి

16-01-2025 01:19:54 AM

* అధికారులందరూ అంకితభావంతో పనిచేయాలి 

* జనవరి 26న నాలుగు సంక్షేమ పథకాలకు శ్రీకారం

* మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్

మెదక్, జనవరి 15 (విజయక్రాంతి)ః అర్హులైన లబ్దిదారులందరికి ప్రభుత్వ పథకాలు అందాలని, ఇందుకు అధికా రులంతా సమన్వయంతో పనిచేయాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు.

బుధవారం కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ నగేష్, డిఆర్‌ఓ భుజంగరావు, జెడ్పి సీఈఓ ఎల్లయ్య, మెదక్ ఆర్డిఓ రమాదేవి, తూప్రాన్ ఆర్డీవో జై చంద్ర రెడ్డి, డిపిఓ యాదయ్య, జిల్లా వ్యవసాయ అధికారి వినయ్, హౌసింగ్ పీడీ మాణిక్యంతో కలిసి జిల్లాలోని ఆర్డీఓలు, ఎస్డీసీలు, తహసీల్దార్ లు, ఎంపిడిఓలు, ఎంపీఓలు, ఎంఏఓలు, మండల ప్రత్యేక అధికారులు, ఇతర సంబంధిత అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా జనవరి 26న అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు పథకాల విధివిధానాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించి, ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలపై కలెక్టర్ అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల వంటి కీలకమైన నాలుగు సంక్షేమ పథకాల అమ లును జనవరి 26న ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లా, మండల స్థాయి అధికా రులందరూ నిబద్ధతతో పనిచేయాలని పేర్కొన్నారు.

గ్రామ సభలను పక్కాగా నిర్వ హించాలని, ఈ నెల 16 నుంచి 20 వరకు చేపట్టే క్షేత్రస్థాయి సర్వేలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అత్యంత జాగ్రత్తగా ఈ ప్రక్రియను సజావుగా పూర్తిచేయాలని, అలాగే 16 నుంచి 20 వరకు లబ్ధిదారుల ముసాయిదా జాబితా తయారీలో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవని, 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభలు పక్కాగా జరిగే విధంగా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలని, 21 నుంచి 25 వరకు డేటా ఎంట్రీ లో తప్పులు దొర్లకుండా చూడాలని, ఫ్లెక్సీ లు, మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసుకోవాలని, అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డులో ప్రచురించాలని, గ్రామ సభల్లో వచ్చే ఫిర్యాదులపై రిజిస్టర్ లను, కంట్రోల్ రూం లను ఏర్పాటు చేసి, అర్జీలను స్వీకరించాలని, ఈ సర్వే, గ్రామ సభల పట్ల ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలని, విస్తృత ప్రచార కార్యక్రమాలు చేపట్టాలని, ప్రభుత్వ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని ఆదేశించారు.