25-04-2025 10:39:29 PM
ఐటీడీఏ పివో రాహుల్...
బూర్గంపాడు (విజయక్రాంతి): రాజీవ్ యువ వికాసం పథకానికి దరఖాస్తులు చేసుకున్న నిరుద్యోగులైన గిరిజన యువతి యువకుల దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన లబ్ధిదారులకు తప్పనిసరిగా ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు. శుక్రవారం సారపాకలోని గ్రామ పంచాయతీ కార్యాలయమును ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రాజీవ్ యువ వికాసం కింద వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రాజీవ్ యువ వికాసం పథకం కింద జీవనోపాధి పెంపొందించుకోవడానికి గిరిజన యువతి యువకులు ఏ పథకం కింద దరఖాస్తు చేసుకున్నారో వారికి ఆ పథకాలపై అవగాహన ఉన్నది లేనిది గమనించాలని, దరఖాస్తులు చేసుకున్న లబ్ధిదారులు ఇండ్లకు వెళ్లి దరఖాస్తులో పొందుపరిచిన అన్ని వివరాలు సంతృప్తిగా ఉన్నది లేనిది పరిశీలించాలని సూచించారు. ఏ పథకం కొరకు దరఖాస్తు చేసుకున్నారో పథకానికి సంబంధించిన వివరాలను లబ్ధిదారులను అడిగి తెలుసుకోవాలని, ఏ పథకము ద్వారా జీవనోపాధి పొందుతారో ఆ గ్రామములో ఆ పథకమునకు సంబంధించిన షాపులు గాని, ఇతర కుటీర పరిశ్రమలు గాని సక్రమంగా నడుస్తున్నది లేనిది తెలుసుకొని లబ్ధిదారులకు జీవనోపాధి పెంపొందించుకొనే పథకాల పథకాల గురించి వారికి తెలియజేయాలని అన్నారు.
అలాగే గ్రామపంచాయతీ సిబ్బంది వార్డులలోని తడి చెత్త పొడి చెత్త ప్రతిరోజు వేర్వేరుగా సేకరించి తప్పనిసరిగా డంపింగ్ యార్డ్ లో వెయ్యాలని, ప్రతిరోజు వార్డులన్నీ శుభ్రంగా ఉండేలా చూడాలని, సంబంధిత గ్రామపంచాయతీ ఈవో పర్యవేక్షణ చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ ఈవో మహేష్, జూనియర్ అసిస్టెంట్ రాములు, బిల్ కలెక్టర్లు ఠాగూర్, ప్రశాంతి, మురళి తదితరులు పాల్గొన్నారు.