కామారెడ్డి/నిజామాబాద్,(విజయక్రాంతి): అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేస్తామని జిల్లా ఇన్ ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఉమ్మడి జిల్లా అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలపై ఆదివారం నిజామాబాద్ కలెక్టరేట్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గ్రామసభలు తూతూ మంత్రంగా కాకుండా బాధ్యతగా నిర్వహించాలని అధికారులకు సూచించారు. టెక్నాలజీని వినియోగించి పథకాలకు అర్హులైన వారిని గుర్తించి తుది జాబితా ముసాయిదాను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అందజేయాలన్నారు. క్షేత్రస్థాయిలో అవసరమైతే ఇతర శాఖ అధికారులను సైతం వినియోగించుకోవాలని సూచించారు. రేషన్ కార్డుల విషయంలో ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దని అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేస్తామన్నారు.
పథకాలు నిరంతరాయంగా కొనసాగుతాయని చెప్పారు. గత ప్రభుత్వం తమకు అప్పులు మిగిల్చిందని ప్రతినెలా రూ.6వేల కోట్ల వడ్డీ చెల్లిస్తున్నామన్నారు. అయినా రైతు భరోసా రూ.12 వేలు అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి ఉండేనని గుర్తు చేశారు. అలాగే రైతు భరోసాను వ్యవసాయ ఆధారిత భూములకే ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. గతంలో పంటను పండించకపోయినా వేలకోట్ల రూపాయలు ఇచ్చి వృథా చేశారన్నారు. అనంతరం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఎమ్మెల్సీ కవిత, ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, భూపతిరెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, ప్రశాంత్ రెడ్డి, పైడి రాకేశ్ రెడ్డి, తోట లక్ష్మీకాంతారావు, వెంకటరమణారెడ్డి, వ్యవసాయ శాఖ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.