- రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ
- ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి ఉత్తమ్ కుమార్ రెడ్డి
కరీంనగర్/జగిత్యాల/సిరిసిల్ల, జనవరి 22 (విజయక్రాంతి): అర్హత ఉన్న చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ పథకాలు అమలవుతాయని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర నీటిపారుదల, పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వ పథకాల అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో నిర్వహిస్తున్న గ్రామసభల్లో భాగంగా కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట, గంగాధర మండలం నారాయణపూర్, వేములవాడనియోజకవర్గ పరిధిలోని రుద్రంగి, జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైనలో జరిగిన గ్రామ సభల్లో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో విప్లవాత్మకమైన మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అడుగు ముందుకు వేసిందని అన్నారు.
పెళ్లయిన వారికి కొత్తగా రేషన్కార్డులు, కుటుంబ సభ్యుల మార్పు, చేర్పులు అన్ని పూర్తి చేస్తామని తెలిపారు. కొత్తగా రాష్ట్రంలో 4 లక్షల రేషన్ కార్డులు ఇస్తున్నామని, అర్హత ఉన్న వారందరికి ఇళ్లు కట్టించే ప్రక్రియ చేపడతామని, సాగు చేసేందుకు యోగ్యంగా ఉన్న ప్రతి ఎకరాకు 12 రైతు భరోసా ఇస్తామని తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ను పూర్తి చేస్తామని ఇందుకు అవసరమైన 70 కోట్ల రూపాయల నిధులు విడుదల చేస్తామని తెలిపారు.
ముంపు గ్రామాల సమస్యలు కూడా పరిష్కరిస్తామని తెలిపారు గోదావరి ఎండిపోవడం వల్ల జగిత్యాల జిల్లా ప్రాంత రైతులు ఇబ్బంది పడుతున్నారని, పెద్దలు జీవన్ రెడ్డి ఆదేశు మేరకు శ్రీరాంసాగర్ నుండి నీటిని విడుదల చేశామని తెలిపారు. నీటి పారుదల శాఖ అధికారులతో మాట్లాడి తప్పకుండా శాశ్వత పరిష్కారం చేస్తామన్నారు. శాసనసభ్యుడు అడ్డూరి లక్ష్మణ్ కుమార్ ఏ ప్రతిపాదన తీసుకువచ్చినా మంజూరు చేస్తామని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో సాచ్యులేషన్ పద్ధతిలో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించామని, ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరోసాలి ఇందిరమ్మ ఇళ్ల పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు. వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ రుద్రంగి కాబట్టి ఇక్కడ సందశాతం అర్హులకు మొదటి లోనే ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.
సలహాలు, సూచనలు అందించండి: మంత్రి పొన్నం ప్రభాకర్
గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ప్రజాప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, గామసభలలో ప్రతిపక్ష పార్టీ నాయకులు అవసరమైన సలహాలు, సూచనలు అందించాలని కోరారు. జనవరి 26 నుంచి ప్రారంభించి అర్హత ప్రకారం రేషన్కార్డులు అందరికి జారీ చేస్తామన్నారు.
మొదటి ప్రాధాన్యతలో సూరమ్మ ప్రాజెక్టు: విప్ ఆది శ్రీనివాస్
నియోజకవర్గంలో 43,100 ఎకరాలకు సాగునీరందించే సూరమ్మ ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యతలో ఉంచామని, ఈ పనులు త్వరలో ప్రారంభమయ్యేలా చూడాలని ఇంచార్జి మంత్రిని కోరారు. మానాలలో పాత చెరువు, కొత్త చెరువుకు లిఫ్టు అందిస్తే సాగు, తాగునీటికి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ప్యాకేజీ-9లో మలక్పేట రిజర్వాయర్లో నీళ్లు నిల్వ ఉంచాలని, 25 కోట్లు విడుదల చేస్తే అప్పర్ మానేరుకు నీరు తీసుకుని వెళ్లవచ్చని తెలిపారు.
తలాపున గోదావరి ఉన్నా ఇబ్బందులు: విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తలాపున గోదావరి ఉన్నా తీరప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్ తెలిపారు. రైతాంగానికి శాశ్వత సాగునీటి పరిష్కారం చూపించాలన్నారు. బుగ్గారం మండలంలోని యశ్వంత్రావుపేట చెరువుతోపాటు జంగల్ నాలా ప్రాజెక్టును పునరుద్ధరిస్తే నియోజకవర్గంలో అత్యధిక శాతం సాగునీటికి లబ్ది చేకూరుతుందన్నారు.
పేదల ప్రభుత్వం : ఎమ్మెల్యేలు కవ్వంపల్లి, మేడిపల్లి
కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంలు అన్నారు. తమ తమ నియోజకవర్గంలో ఇంచార్జి మంత్రితో గ్రామసభల్లో పాల్గొన్న వారు మాట్లాడుతూ గతంలో ఎన్నడూలేని విధంగా జనవరి మాసంలోనే నారాయణపూర్ జలాశయానికి ఎల్లంపల్లి నీటిని విడుదల చేశామని మేడిపల్లి సత్యం అన్నారు.
నారాయణపూర్ రిజర్వాయర్ పనులకు గత ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి, సిరిసిల్ల కలెక్టర్ సందీప్కుమార్ ఝూ, జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు.