- రుణమాఫీకి కట్టుబడి ఉన్నాం
- మంత్రులు శ్రీధర్‌బాబు, జూపల్లి కృష్ణారావు
- కడ్తాలలో కస్తూర్బా పాఠశాల నూతన భవనం ప్రారంభం
- పాల్గొన్న ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, వీ శంకర్
రంగారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్య, వైద్యం బలోపేతంపై సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం కల్వకుర్తి నియోజకవర్గం కడ్తాల మండల కేంద్రంలో కస్తుర్బా పాఠశాల నూతన భవనాన్ని మంత్రి జూపల్లి కృష్ణారావు, నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లు రవి, కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్క నాటారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు.
త్వరలో రాష్ట్రంలో స్కిల్ యూని వర్సిటీ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయి లో నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గం వంగూరు మండలం లోని సర్వారెడ్డి పల్లిలో రూ.800 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించనున్నట్లు చెప్పారు. నిరుద్యోగులకు ఉద్యోగా వకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం నోటిఫికే షన్లు జారీ చేసి పరీక్షలు నిర్వహిస్తుంటే, ప్రతిపక్షాలు ఆటంకాలు కలుగజేస్తున్నాయని మండిపడ్డారు.
అనంతరం ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ.. నాగర్‌కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని సీఎం సొంత గ్రామం కొండారెడ్డిపల్లి సమీపంలో సర్వారెడ్డి పల్లిలో 1000 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్, కల్వకుర్తి నియోజకవర్గంలో స్కిల్ యూనివర్సిటీ, వెల్దండ మండలంలోని చెర్కూర్‌లో చిన్న, మధ్య తరహా పరిశ్రమ ఏర్పాటు కోసం 100 ఎకరాలను గుర్తించామని తెలిపారు. ఈ సందర్భంగా వనపర్తి, నాగర్‌కర్నూల్ జిల్లాలో ఐటీ సెంటర్ల ఏర్పాటు, హైదరాబాద్ జాతీయ రహదారిలో ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటుకు కృషి చేయాలని మంత్రి శ్రీధర్ బాబుకు వినతి పత్రం అందజేశారు.
అనంతరం ఎమ్మెల్యే నారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల హామీ మేరకు కల్వకుర్తి నుంచి మాడ్గుల మండలం నాగిళ్ల వరకు కేఎల్‌ఐ కాల్వ పనులు పూర్తి చేసి 35 వేల ఎకరాల వరకు సాగునీరు అందిస్తామ ని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్, రాష్ట్ర పొల్యూషన్ బోర్డు మెంబర్ బాలాజీ సింగ్, డీఈవో సుశీందర్‌రావు, ఎంఈవో సర్దార్‌నాయక్, ఎస్‌వో అనిత, వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.