calender_icon.png 5 December, 2024 | 12:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బకాయిలు రూ.500 కోట్ల పైనే!

14-11-2024 01:00:56 AM

  1. జలమండలి ఆదాయానికి ప్రభుత్వ కార్యాలయాల గండి
  2. వీటిలో ప్రభుత్వాసుపత్రులు, విద్యాసంస్థలు, ఇతర కార్యాలయాలు
  3. ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకునేనా?

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 13(విజయక్రాంతి): జలమండలి పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల నుంచి దాదాపు రూ.500 కోట్ల పైనే బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఏండ్ల తరబడి పేరుకుపోయిన ఈ బకాయిలను చెల్లించేందుకు, బిల్లులపై ఉన్న వడ్డీ, పెనాల్టీని రద్దు చేస్తూ ఓటీఎస్ అవకాశం కల్పించగా.. పలు సంస్థల నుంచి స్పందన రావడం లేదని తెలుస్తోంది.

గ్రేటర్ ప్రజలకు తాగునీటి సరఫరా, మురుగునీటి నిర్వహణ చేస్తున్న హైదరాబాద్ జలమండలిలో వినియోగదారుల వద్ద పేరుకు పోయిన బకాయిలను వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వన్‌టైమ్ సెటిల్‌మెంట్ అవకాశం కల్పించింది. ఈ ఓటీఎస్‌కు జలమం డలి వినియోగదారుల నుంచి ఆదరణ లభిస్తోంది.

కానీ మహా నగరంలోని ప్రభుత్వాస్ప త్రులు, విద్యాసంస్థలు, బస్టాండ్‌లు, మున్సిపల్ కార్యాలయాలు, పార్కుల్లోని నల్లా నీటి కనెక్షన్లకు సంబంధించిన బకాయిలు ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయి.  ప్రతీ సంవత్సరం వచ్చే నల్లా బిల్లుల్లో ఎంతో కొంత చెల్లించినప్పటికీ మెజార్టీ బిల్లులు మిగిలి ఉంటుండటంతో ఆయా కార్యాలయాల నల్లా బిల్లులు భారీగా పేరుకుపోయాయి.

వివిధ సంస్థల నుంచి రావాల్సిన బకాయిలు ఇలా

జలమండలి పరిధిలోని ప్రతీ ఓ అండ్ ఎం డివిజన్‌లో దాదాపు 150-300లకు వరకు ప్రభుత్వ సంస్థల బకాయిలు పేరుకుపోయినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు నగరంలోని ప్రముఖ ప్రభుత్వ ఆస్పత్రులైన గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, చెస్ట్ హాస్పటల్, కంటి దవాఖాన లాంటి ప్రముఖ ఆస్పత్రుల నుంచే దాదాపు రూ.50కోట్లు రావాల్సి ఉందని సమాచారం.

అయితే జలమండలి అధికారులు ఆయా ఆస్పత్రుల ఉన్నతాధికారులకు నోటీసులు ఇచ్చారు. ఇక నగరంలోని ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టల్స్ బకాయిలు కూడా (ఒక్కో పాఠశాల) దాదాపు రూ.50వేల నుంచి రూ.3లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది.

నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లు, ఆర్‌అండ్‌బీ భవనాలు, జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాల నుంచి కూడా భారీగా బకాయిలున్నాయి. హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ నుంచి మాత్రం రెగ్యులర్‌గా బిల్లుల చెల్లింపులు జరుగుతాయని తెలుస్తోంది. 

ఈ అవకాశాన్నైనా సద్వినియోగం చేసుకోవాలని.. 

జలమండలి పరిధిలో ఓటీఎస్‌కు అర్హత కలిగిన క్యాన్ నంబర్లు దాదాపు 7,11,030 ఉన్నాయి. వారి నుంచి రూ.1,792 కోట్లు నల్లా బిల్లులు రావాల్సి ఉంది. వీటిలో రాయితీలు కల్పించడం ద్వారా సగం బిల్లులనైనా రాబట్టాలని జలమండలి లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నగరంలోని ప్రభుత్వ కార్యాలయాల్లో పేరుకుపోయిన పెండింగ్ బిల్లులు జలమండలి లక్ష్యానికి గండి కొడుతున్నాయని తెలుస్తోంది.

ఆయా ప్రభుత్వ కార్యాలయాల ద్వారా జలమండలికి రావాల్సిన బకాయిలే దాదాపు. రూ.500కోట్ల పైగా ఉండటం గమనార్హం. ఇలాంటి ప్రభుత్వ కార్యాలయాలు, డొమెస్టిక్, కమర్షియల్, ఇతర బకాయిలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం అక్టోబర్ ఆరంభం నుంచి 31 వరకు ఓటీఎస్ అవకాశాన్ని కల్పించింది. గడువు ముగియడంతో మరోసారి నవంబర్ నెలాఖరు వరకు అవకాశ మిచ్చింది.

నగరంలోని ప్రముఖ, సాధారణ ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు ఏండ్ల తరబడి బకాయిలు పేరుకుపోయినందున ఈ సారి ప్రభుత్వం అవకాశం కల్పించిన ఓటీఎస్‌ను సద్వినియోగం చేసుకోవాలని తమ పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాల అధికారుల వద్దకు వెళ్లి జలమండలి మేనేజర్లు, జీఎంలు, సీజీఎంలు సూచనలు చేస్తున్నారు.

దీంతో పలువురు ప్రభుత్వ కార్యాలయాల్లోని అధికారులు స్పందించి తమ శాఖల పై అధికారులకు లేఖలు రాస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్థిక సంవత్సరం ముగింపు (మార్చి)లో తమకు అవకాశం కల్పిస్తే బిల్లులు కట్టేందుకు సులభమవుతుందని పలు కార్యాలయాల అధికారులు కోరుతున్నట్లు తెలుస్తోంది.

అద్దె భవనాల్లోని కార్యాలయాల బకాయిలు కట్టేదెవరో? 

నగరంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. హై దరాబాద్ జిల్లాలో 90కిపైగా ప్రభుత్వ పాఠశాలలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇక్కడ ఉన్న నల్లా నీటి బిల్లులను కట్టేదెవరనే అయోమయం నెలకొంది. ఆయా ప్రభుత్వ కార్యాలయాలు, భవనాల యాజమాన్యాల మధ్య ఒప్పందం ప్రకారం బిల్లులు చెల్లించాల్సి ఉండగా.. వారి మధ్య సమన్వయ లోపంతో జలమండలికి చెల్లించాల్సిన నల్లా బిల్లుల చెల్లింపుల్లో నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

బకాయిలు చెల్లించని ప్రభుత్వ సంస్థలు

* ఆస్పత్రులు

* జీహెచ్‌ఎంసీ కార్యాలయాలు

* బస్టాండులు

* ఆర్‌అండ్‌బీ భవనాలు

* పాఠశాలలు

* సంక్షేమ హాస్టళ్లు

* వివిధ పార్కులు

* ఇతర ప్రభుత్వ కార్యాయాలు