జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్...
పాపన్నపేట: విద్యావ్యవస్థ బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం పటిష్టమైన చర్యలు తీసుకుంటుందని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్(Collector Rahul Raj) అన్నారు. గురువారం క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ పాపన్నపేట మండల పరిధిలోని చీకోడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. ముందుగా విద్యార్థుల భోజనశాలను, స్టోర్ రూమ్ ను పరిశీలించారు. మెనూ అమలు తీరును ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తరగతి గదిలో కలెక్టర్ టీచర్ గా మారి పాఠాలు బోధించిన అనంతరం ప్రశ్నలు అడిగి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యావ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకొంటున్నదని, అందులో భాగంగానే మెనూ సమర్థవంతంగా అమలు చేసున్నామని తెలిపారు. విద్యార్థులు ఉన్నత చదువులు చదివి రాబోయే తరానికి ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చీకోడ్ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, సిబ్బంది పాల్గొన్నారు.