25-04-2025 01:12:22 AM
ప్రీ ప్రైమరీ బోధనకు సర్కార్ శ్రీకారం
ప్రభుత్వ పాఠశాలల పరిధిలోని కేంద్రాలపై దృష్టి
విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యం
సంగారెడ్డి, ఏప్రిల్ 21(విజయక్రాంతి) : అంగన్వాడీ కేంద్రాలలో ప్రీ ప్రైమరీ బోధనకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రభుత్వ పాఠశాలల్లోనే ఆంగ్ల మాధ్యమంలో పూర్తి స్థాయి విద్యను అభ్యసించేలా శ్రీకారం చుడుతుంది. పుట్టిన బిడ్డ నుంచి చదువులు పూర్తయ్యే వరకు ప్రభుత్వమే మొత్తం బాధ్య త తీసుకొని మంచి బోధన అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంగన్వాడీ కేంద్రాల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టడంతో అటు పౌష్టికా హారం, ఇటు ఉత్తమ బోధనకు పునాది వేసినట్లు అవుతుందని భావిస్తున్నారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి...
ఉమ్మడి జిల్లాలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలను ఒకేసారి మార్చడం ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచనతో ముందుగా ప్భుత్వ పాఠశాలల ప్రాంగణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రాలపై దృష్టి సారించారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న అంగన్వాడీ పాఠశాలలు కొన్ని సొంత భవనాలు, మరికొన్ని అద్దె భవనాల్లో ఉండగా మిగిలిన కేంద్రాలు ప్రభుత్వ పాఠశాలల పరిధిలో ఉన్న భవనాల్లో నిర్వహిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలో ఐదు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో 1504 అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో 450 వరకు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఇలావుండగా ప్రీ ప్రైమరీ బోధన కోసం జిల్లాలో కొన్ని కేంద్రాలను ఎంపిక చేసి వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు తెలిసింది. ఇందుకోసం ఇప్పటికే జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల ప్రాంగణంలో నిర్వహించే అంగన్వాడీ కేంద్రాలు, అంగన్వాడీ టీచర్ల విద్యార్థతలు మొదలైన వివరాలను రాష్ట్ర అధికారులు తెప్పించుకున్నట్లు తెలిసింది.
కిడ్స్ స్కూల్స్ తరహాలో...
ప్రభుత్వ నిబంధనల మేరకు 3 సంవత్సరాల నుంచి 5 ఏళ్ళ వయస్సు వరకు అంగన్వాడీ కేంద్రాల్లో, ఆ తర్వాత ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలని ఉంది. అయితే ఐదు సంవత్సరాల వరకు అంగన్వాడీ కేంద్రాలకు వస్తున్నారు. కానీ ఆ తర్వాత పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో ఉంచడం లేదు. ఇందుకోసం పట్టణాల్లో ఇబ్బడిముబ్బడిగా వెలసిన కిడ్స్, వండర్ వరడ్స్ లాంటి పేర్లతో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. అక్కడ ఆంగ్ల మాధ్యమం బోధన చేయడంతో పేదలు కూడా ఎక్కువ డబ్బులు ఖర్చుపెట్టి ఆయా స్కూళ్ళకు పంపుతున్నారు. అదే ఒరవడిలో చదవడం, ప్రైవేట్ పాఠశాలపై మొగ్గు చూపుతున్నారు. అదే అంగన్వాడీ కేంద్రాల్లోనే పిల్లలకు ఆటలు, పాటలు, ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం, పిల్లలను ప్రాథమిక పాఠశాలల్లో చేరేందుకు అర్హులను చేయడం అంటే..అక్షరాలు, అంకెలు, రైమ్స్ వంటివి నేర్పించడం, నర్సరీ యూకేజీ, ఎల్కేజీని అంగన్వాడీ కేంద్రాల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు.
ఇంకా గైడ్లైన్స్ రాలేదు...
అంగన్వాడీ కేంద్రాల్లో ప్రీ ప్రైమరీ బోధన ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతుంది. అయితే రాష్ట్ర అధికారులు నివేదికలు అడిగితే అందిస్తాం. ప్రీ ప్రైమరీ సెంటర్ల ఎంపికకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
-లలితకుమారి, డీడబ్ల్యూఓ, సంగారెడ్డి