calender_icon.png 4 April, 2025 | 6:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్ పాలనలో కారుచౌకగా ప్రభుత్వ భూముల విక్రయం

04-04-2025 12:14:03 AM

  • అనుయాయులకు సర్కార్ స్థలాలు పంచిపెట్టారు

చర్చకు సిద్ధమా.. కేటీఆర్? l పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ సవాల్

హైదరాబాద్, ఏప్రిల్ 3 (విజయక్రాంతి): ‘బీఆర్‌ఎస్ ప్రభుత్వం తన అనుయాయులకు పప్పు బెల్లాల్లా సర్కార్ భూములను పంచిపెట్టింది. తద్వారా ప్రభుత్వ ఆస్తులు హారతి కర్పూరంలా కరిగిపోయాయి.. ఇది నిజం కాదా? ఈ అంశంపై తాము బహిరంగ చర్చకు సిద్ధం. మీరు సిద్ధమా ’ అంటూ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ గురువారం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌కు సవాల్ విసిరారు.

ఢిల్లీలో ఆయన మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆర్థిక పతనం, భూముల విధ్వంసాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వమే ప్రారంభించిందని ఆరోపించారు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారని, వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్ర రాజకీయ ముఖచిత్రంలో బీఆర్‌ఎస్ అనే పార్టీనే ఉండదని జోస్యం చెప్పారు.

హెచ్‌సీయూ భూములు వందకు వందశాతం ప్రభుత్వానికి చెందినవేనని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలనలో నాటి సీఎం చంద్రబాబు చంద్రబాబు ఆ భూములను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు యత్నించారని, దీంతో నాటి కాంగ్రెస్ న్యాయపోరాటం చేసి, భూములను కాపాడిందని గుర్తుచేచేశారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో ప్రభుత్వం ఒక మెట్టు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం తెలంగాణకు చెందిన బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చొరవ చూపాలని, ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్‌మెంట్ తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

కేబినెట్ విస్తరణ ఏఐసీసీ పరిధిలోనిది..

మంత్రివర్గ విస్తరణ అంశం పూర్తిగా ఏఐసీసీ పరిధిలోని అంశమని పీసీసీ అధ్యక్షుడు స్పష్టం చేశారు. క్యాబినెట్ విస్తరణలో మరో ఇద్దరు బీసీలకు మంత్రి పదవులు ఇవ్వాలని తాను ఇప్పటికే అధిష్ఠానాన్ని కోరానని తెలిపారు.

మైనార్టీ వర్గానికి చెందిన ఒకరికి కూడా అవకాశం ఉంటుందని వెల్లడించారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, ప్రాంతాలు, కులాల వారీగా లెక్కలు వేయాల్సి వస్తుందని వివరించారు. సామాజిక న్యాయం చేయడమే లక్ష్యంగా తమ పార్టీ ముందుకు వెళ్తున్నదని స్పష్టం చేశారు. 

ఈడబ్ల్యూఎస్ నుంచి ముస్లింలను తొలగించే దమ్ముందా: మంత్రి పొన్నం 

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10 శాతం అమలవుతున్నాయని, ముస్లింలను కాదని ఆ రిజర్వేషన్లు అమలు చేస్తున్నారా..? రిజర్వేషన్లలో ముస్లింలు కూడా ఉన్నారు కదా..?’ అంటూ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎన్టీఏ కూటమి అధికారంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని, అక్కడ రిజర్వేషన్లు తొలగించే దమ్ము బీజేపీకి ఉందా..? అంటూ సవాల్ విసిరారు.

తాము 70 ముస్లింల కోసం రిజర్వేషన్లు ఇచ్చామని, గతంలోనే ప్రధాని నరేంద్రమోదీ ఓ సందర్భంలో అన్నారని గుర్తుచేశారు. తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను బీజేపీ ఎందుకు అడ్డుకుంటుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్రమే అమలు చేసుకోవచ్చని కేంద్ర మంత్రి బండి సంజయ్ చెప్తున్నారని, కేంద్ర మంత్రిగా ఉండి ఇలాంటి అవివేకమని ప్రకటన జారీ చేయడం సిగ్గుచేటన్నారు.

ఒకవేళ రాష్ట్రాలకు నిజంగా ఆ పవర్ ఉంటే, తమ ప్రభుత్వం వెంటనే రిజర్వేషన్లు అమలు చేస్తుందన్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో రిజర్వేషన్ల పరిమితి 50 శాతం దాటిందని, తెలంగాణలో మాత్రం ఇంకా 50 శాతమే ఉందని వెల్లడించారు. బీసీ రిజర్వేషన్ల పెంపు విషయంలో తెలంగాణ యావత్ దేశానికే రోల్ మోడల్‌గా నిలుస్తుందని వివరించారు.