calender_icon.png 26 April, 2025 | 10:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘అంగడి’ సరుకుగా సర్కారు భూములు!

26-04-2025 12:00:00 AM

  1. ప్రభుత్వ భూముల్లో బోర్డులు మాయం
  2. కేసముద్రంలో కోట్ల విలువైన భూమి అన్యాక్రాంతం 
  3. ప్రభుత్వ కార్యాలయాలకు దొరకని సెంటు భూమి
  4. భూముల మాయం వెనుక ఉన్నదెవరు?

మహబూబాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమికి రెక్కలు వచ్చాయి. తప్పుడు పత్రాలతో ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి ‘అంగడి’ సరుకుగా మార్చి అప్పనంగా అమ్ముకున్నారు.

2012 లో మండల కేంద్రానికి ఐదు కిలోమీటర్ల పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించి వాటికి హద్దులు నిర్ణయించి భవిష్యత్తులో ప్రభుత్వ అవసరాలు, కార్యాలయాల నిర్మాణం కోసం వినియోగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం రెవెన్యూ శాఖను ఆదేశించింది. ఈ మేరకు కేసముద్రం రెవెన్యూ గ్రామ పరిధిలోని 256, 262 తదితర సర్వే నంబర్లలో అప్పటి తహసిల్దార్ బన్సీలాల్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో అధికారుల బృందం పరిశీలించి 12 చోట్ల మిగులు ప్రభుత్వ భూములను గుర్తించారు.

ఆ మేరకు ఆయా ప్రదేశాల్లో ఇది ‘ప్రభుత్వ భూమి’ అంటూ బోర్డులు కూడా నాటారు. అయితే కొంతకాలానికి తహసిల్దార్ బన్సీలాల్ బదిలీ కావడంతో రెవెన్యూ శాఖ ప్రభుత్వ భూముల్లో నాటిన బోర్డులను గుర్తుతెలియని వ్యక్తులు తొలగించారు. ఆ తర్వాత వచ్చిన రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని ప్రభుత్వ భూములుగా గుర్తించిన స్థలాలను కొందరు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

అయితే ఈ క్రమంలో బన్సీ లాల్ తహసీల్దారుగా ఉన్న సమయంలో ఉపతహసిల్దార్ గా ఉన్న వెంకట్ రెడ్డి తహసీల్దారుగా పదోన్నతి పై 2019లో కేసముద్రం వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత మళ్లీ ప్రభుత్వ భూములను గుర్తించి తిరిగి రెండోసారి ఆయా స్థలాల్లో బోర్డులు నాటించారు.

అలాగే అప్పటి మహబూబాబాద్ కలెక్టర్ గౌతమ్ కు నివేదించడంతో కేసముద్రం తో పాటు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములను రిజిస్ట్రేషన్ చేయకూడదంటూ కొన్ని సర్వే నెంబర్లను ‘బ్లాక్ లిస్టు’లో పెట్టి ఆ జాబితాను సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా పంపించారు.

ఇలా కొంతకాలం వరకు ఆ భూములు అలాగే ఉండగా.. కలెక్టర్ గౌతమ్ బదిలీపై వెళ్లిపోవడం, ఇటు తహసిల్దార్ వెంకట్ రెడ్డి పదవీ విరమణ చేసి వెళ్ళిపోగానే భూముల్లో నాటిన బోర్డులను  తిరిగి తొలగించారు. ప్రభుత్వ భూమిగా పేర్కొన్న ఆయా భూముల్లో దొడ్డి దారిలో తప్పుడు పత్రాలతో కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్ గ్రామ పంచాయతీల ద్వారా డోర్ నెంబర్లు తీసుకొని అమ్మకానికి పెట్టారు.

ఇలా రెండుసార్లు కేసముద్రం మండల కేంద్రంలో ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ సుమారు 20 నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమిగా గుర్తించిన ఆ భూముల్లో ఇప్పుడు సెంటు కూడా ప్రభుత్వ ఆధీనంలో లేకపోవడం విశేషం. ప్రభుత్వ భూమిగా పేర్కొన్న కోట్ల రూపాయల విలువైన భూమి గత ప్రభుత్వ హాయంలో ‘ఉష్ కాకి’ కావడం వెనుక ఉన్న పెద్ద తలలు ఎవరన్నది ప్రశ్నార్ధకంగా మిగిలిపోయింది.

ప్రస్తుతం కేసముద్రం స్టేషన్, కేసముద్రం విలేజ్, ధనసరి, అమీనాపురం, సబ్ స్టేషన్ తండా గ్రామాలను కలిపి కొత్తగా మున్సిపాలిటీ ఏర్పడింది. ఈ క్రమంలో పట్టణానికి కొత్తగా కార్యాలయాలు మంజూరు కావడంతో పాటు డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్, 50 పడకల ఆసుపత్రి, విద్యుత్ సబ్ స్టేషన్, అగ్నిమాపక కేంద్రం, మున్సిపాలిటీ ఆఫీస్, జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం నిర్మించాల్సి ఉంది.

వీటికోసం ఇప్పుడు రెవెన్యూ శాఖ అధికారులు భూతద్దం వేసుకొని చూసినా ఎక్కడా సెంటు భూమి దొరకడం లేదంటూ చేతులెత్తేస్తున్నారు. ఐదేళ్ల క్రితం వరకు కేసముద్రం రెవెన్యూ గ్రామ పరిధిలో 20 నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నట్లు ప్రకటించిన రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పుడు.. ఆ భూములు ఏమయ్యాయనే అంశాన్ని పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.

కేసముద్రం పట్టణంలో తక్కువలో తక్కువ గజానికి 10,000 నుండి 30 వేల రూపాయల వరకు ప్రభుత్వ భూమిగా పేర్కొన్న భూములను అడ్డదారిలో విక్రయించి కోట్లు దండుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికీ కూడా గతంలో ప్రభుత్వ భూమిగా పేర్కొంటూ బోర్డులు నాటిన ప్రదేశాల్లో అనేక చోట్ల ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ.. వాటి జోలికి రెవెన్యూ శాఖ అధికారులు పోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

ఆ భూముల రక్షణ కోసం వెన్నుదన్నుగా నిలుస్తున్న వారికి ప్రభుత్వ అధికారుల అండదండలు ఉండడంతోనే ఆ భూముల జోలికి వెళ్లడం లేదనే విమర్శలు వస్తున్నాయి.

స్థలం లేక కార్యాలయాల ఏర్పాటుకు ఆటంకాలు

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య సలహాదారుడిగా నియమితులైన మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే, కేసముద్రం మండలం అర్పణ పల్లి కి చెందిన వేం నరేందర్ రెడ్డి కేసముద్రం మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకున్నారు.

తాను ఉన్నత స్థాయిలో ఉన్న సమయంలో సొంత మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కేసముద్రం మండల కేంద్రాన్ని మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాలిటెక్నిక్ కళాశాల, విద్యుత్ సబ్స్టేషన్, 50 పడకల ఆసుపత్రి, అగ్నిమాపక కేంద్రాన్ని మంజూరు చేయించారు.

అయితే ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ స్థలం లేదని రెవెన్యూ శాఖ చెబుతుండడంతో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడానికి ఆటంకంగా మారింది. దీంతో ప్రస్తుతం డిగ్రీ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహిస్తుండగా, పాలిటెక్నిక్ కళాశాల జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఏర్పాటు చేశారు.

ఇక ప్రభుత్వ ఆసుపత్రి, అగ్నిమాపక కేంద్రం, మున్సిపాలిటీ కార్యాలయం, మినీ స్టేడియం, జ్యోతిబాపూలే గురుకుల విద్యాలయం నిర్మాణానికి అవసరమైన స్థలం లేక వాటికి నిధులు మంజూరు చేయడానికి ఆటంకంగా మారింది.

చర్యలు తీసుకుంటాం

కేసముద్రం పట్టణంలో గతంలో ఇక్కడ పనిచేసిన తహసిల్దార్లు గుర్తించిన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయినట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. గతంలో అధికారులు గుర్తించిన భూముల వివరాలను సేకరించి, ఎక్కడెక్కడ భూముల అన్యాక్రాంతం అయ్యాయనే విషయాన్ని జిల్లా అధికారులకు నివేదించి, వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ భూములను గుర్తించి, స్వాధీనానికి చర్యలు తీసుకుంటాం. 

 -ఎర్రయ్య, తహసిల్దార్, కేసముద్రం