calender_icon.png 2 November, 2024 | 8:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ భూమిని ప్లాట్లు చేసి అమ్మారు

02-11-2024 02:31:26 AM

  1. తమను మోసం చేశారంటూ హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు బాధితుల ఫిర్యాదు
  2. న్యాయం చేయాలని వినతి

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): అమీన్‌పూర్‌లోని సర్వే నంబర్ 6లో అనుమతులు చూపించి, సర్వే నంబర్ 12లో ఉన్న ప్రభుత్వ భూమిలో ప్లాట్లు చేసి తమకు విక్రయించి మోసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అమీన్‌పూర్‌కు చెందిన పలువురు బాధితులు శుక్రవారం హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు.

తమకు న్యాయం చేయాలని, నష్ట పరిహారం ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. రద్దయిన అనుమతుల విషయాన్ని బయటకు చెప్పకుండా తమను మోసం చేసి ప్లాట్లు అమ్మారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మాధవరెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు అనే వ్యక్తుల దగ్గర ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోయామని పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, అమీన్‌పూర్ మండలంలోని పెద్ద చెరువు అలుగులు మూసేసి, ఎగువ వైపు తమ స్థలాల్లోకి చెరువు నీరు వచ్చేలా చేశారంటూ మరికొందరు ఫిర్యాదు చేశారు. అదేవిధంగా సర్వే నంబర్ 153లోని హుడా అనుమతి పొందిన లేఅవుట్లలో ఉన్న పార్కు స్థలాన్ని కొత్తగా వెంచర్ వేస్తున్న వారు కబ్జా చేశారంటూ అమీన్‌పూర్ మండలంలోని వెంకటరమణ కాలనీ వాసులు ఫిర్యాదు చేశారు.

సర్వే చేయించి పార్కుతో పాటు లేఅవుట్‌లోని రహదారులను కాపాడాలని కోరారు. ఈ విషయాలపై పూర్తిస్థాయిలో సర్వే చేయించి న్యాయం జరిగేలా చూస్తామని కమిషనర్ బాధితులకు హామీ ఇచ్చారు.