భూ కబ్జాలు, జల దోపిడీతో దౌర్జన్యం..
జల, వాయు కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న జనం..
స్నేహ చికెన్ పరిశ్రమ కోసం ప్రభుత్వ భూమి కబ్జా..
శంకర సముద్రం నుంచి యధేచ్చగా స్నేహ చికెన్ పరిశ్రమ కోసం జలదోపిడీ...
16 నెలల క్రితమే ముగిసిన నీటి తరలింపు అగ్రిమెంట్ గడువు..
స్నేహ ఫార్మ్స్ వ్యర్థ పదార్థాలు, వ్యర్థ జలాలతో కలుషితమవుతున్న నీరు..
కలుషితమైన నీరు తాగి పలువురికి క్యాన్సర్, ఇతర రోగాలు..
ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ చికెన్ పరిశ్రమను మూసి వేయాలి..
బీసీ పొలిటికల్ జెఎసి స్టేట్ ఛైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్..
ముషీరాబాద్,(విజయక్రాంతి): ప్రభుత్వ నిబంధనలకు తూట్లు పొడుస్తూ భూ కబ్జాలు, జల దోపిడీతో దౌర్జన్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న స్నేహ చికెన్ పరిశ్రమ(Sneha Chicken Industry)పై చర్యలు తీసుకోవాలని బిసి పొలిటికల్ జెఎసి చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్(BC Political JAC Chairman Rachala Yugander Goud) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మహబూబ్ నగర్, వనపర్తి జిల్లాల సరిహద్దు ప్రాంతంలో కొన్నేళ్ల క్రితమే స్నేహా చికెన్ ఫౌల్ట్రీ పరిశ్రమను స్థాపించారని, చిన్నగా ప్రారంభమైన ఈ కంపెనీ ఇప్పుడు తన పరిధిని విస్తృతం చేసుకున్నదన్నారు. పెడ్డ మందడి మండలం వెల్టూరు శివారులోని 22/1 లో ప్రభుత్వ భూమిని స్నేహ చికెన్ పరిశ్రమ ఆక్రమించి, అక్కడ కొన్ని నిర్మాణాలు కూడా చేపట్టిందని గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తరువాత బీసీ పొలిటికల్ జెఎసి ఫిర్యాదు మేరకు అధికారులు సర్వే నిర్వహించి, రికార్డులు పరిశీలించిన తర్వాత వెల్టూరు శివారులోని సర్వే నెంబర్ 22/1లో 1.25 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని నిర్ధారించి, ప్రభుత్వ భూమిని ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను ఎందుకు తొలగించకూడదో.. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. స్నేహా చికెన్ కంపెనీ ఎండీ రాంరెడ్డికి 2024 ఫిబ్రవరి 28 న నోటీసులు జారీ చేశారన్నారు. నోటీసులు జారీ చేసి 10 నెలలు గడుస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని అధికారులను నిలదీయగా మళ్ళీ సర్వే నిర్వహించిన పెద్దమందడి రెవెన్యూ అధికారులు ఎలాంటి ఆక్రమణ జరగలేదని 2025 జనవరి 6న రిపోర్టు ఇవ్వటం చూస్తుంటే భారీగా ముడుపులు తీసుకుని పరిశ్రమకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు తేటతెల్లమైందన్నారు.
తాగు, సాగునీటికి ఇబ్బందులున్నా కంపెనీకి నీళ్ళా?
స్నేహా చికెన్ కంపెనీ భీమా రెండో దశలో అంతర్భాగంగా నిర్మించిన శంకర్ సముద్రం రిజర్వాయర్ నుంచి రోజుకు 10 లక్షల లీటర్ల చొప్పున కంపెనీ, అలాగే అందులో ఉండే క్వార్టర్స్ గృహ అవసరాలకు తరలించుకునేందుకు అనుమతి తీసుకున్నదని, ఈ నీటి తరలింపు సంవత్సరంలో 0.01289 టీఎంసీలను మించకూడదనే నిబంధన ఉందన్నారు. 2018 సెప్టెంబర్ 25న అయిదు సంవత్సరాల కాలపరిమితికి అనుమతి తీసుకోగా 2023 సెప్టెంబర్ 25 నాటికి ఆ అగ్రిమెంట్ గడువు కూడా పూర్తయ్యిందన్నారు. అయితే నిబంధనల ప్రకారం అగ్రిమెంట్ గడువు ముగిసిన తర్వాత తిరిగి అనుమతి పొందే వరకు నీటిని వినియోగించకూడదు. కానీ గడువు ముగిసిన తర్వాత కూడా అధికారుల అండదండలతో స్నేహా కంపెనీ దౌర్జన్యంగా నీటిని తరలిస్తోందని ఆరోపించారు. తాగు, సాగునీటికి నీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పట్టించుకోకుండా ప్రభుత్వ నిభందనలు పాటించకుండా దౌర్జన్యంగా పరిశ్రమకు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు.
పర్యావణానికి తూట్లు...
గత ప్రజాప్రతినిధుల అండదండలతో స్నేహ ఫార్మ్స్ యాజమాన్యం రెచ్చిపోయిందని, పర్యావరణ నిబంధనలకు తూట్లు పొడుస్తూ స్నేహ ఫార్మ్స్ నుంచి వచ్చే వ్యర్ధ పదార్ధాలు పొలాలలో వదలడంతో అవి అడ్డాకుల మండలం బలీదుపల్లి చెరువులో కలిసి అక్కడి నుండి పెద్దవాగులో కలుషితమై సరళసాగర్ మీదుగా రామన్‌పాడు డ్యామ్‌లోకి వెళ్తున్నాయన్నారు. రామన్‌పాడు డ్యామ్ నుంచి సరఫరా అయ్యే కలుషితమైన నీరు తాగి పలువురు క్యాన్సర్, ఇతర రోగాల బారిన పడుతున్నారన్నారు. ప్రభుత్వ నిభందనలకు తూట్లు పొడుస్తూ ప్రజల జీవితాలలో చెలగాటమాడుతున్న స్నేహ కంపెనీని మూసివేయాలని డిమాండ్ చేశారు.
ఉపాధి విషయంలో కుడా వివక్షే..
పరిశ్రమ స్థాపన కొసం అన్ని వర్గాల రైతులతో భూములు తీసుకొన్న యాజమాన్యం, తమ పరిశ్రమ నుంచి వచ్చే చికెన్ ను అందరికీ అమ్ముకుంటున్న యాజమాన్యం ఉపాధి అవకాశాలు కల్పించే విషయంలో మాత్రం ఒకే సామాజికవర్గానికి మంచి ఉద్యోగాలు కల్పిస్తూ...పేద వర్గాలను విస్మరిస్తూ అరకొర అవకాశాలు కల్పిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీసీ పొలిటికల్ జెఎసి రాష్ట్ర కార్యదర్శి వజగౌని వెంకటన్న గౌడ్, దేవర శివ, రామన్ గౌడ్, గౌతమ్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.