ఆయన కుటుంబానికి రూ.20లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలి: కేటీఆర్
హైదరాబాద్, జనవరి 18 (విజయక్రాం తి): కాంగ్రెస్ సర్కారు రుణమాఫీ చేయకపోవడంతోనే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం సైదాపూర్‌కు చెందిన రైతు జాదవ్ నాగోరావ్ ఆత్మహత్య చేసుకున్నాడని బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పేరిట రుణం ఉన్న బ్యాంకులోనే పురుగుల మందు తాగి ఆ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడంటే రుణభారం అతన్ని ఎంత మానసిక వేదనకు గురిచేసిందో అర్థమవుతోందన్నారు.
రైతు ఆత్మ హత్యకు రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ పేరిట చేసిన మోసంతోపాటు రైతు వ్యతిరేక విధానాలే కారణమని విమర్శించారు. అధికారం లోకి రాగానే రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం మాట తప్పడమే కారణమన్నారు. ఇది ముమ్మాటికీ సర్కారు చేసిన హత్యగానే రైతాంగం భావిస్తుందని, ప్రభుత్వంపై హత్యానేరం కింద కేసు నమో దు చేయాలన్నారు. రైతు కుటుంబానికి రూ.20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని సూచించారు.